– మా పాలన సంతృప్తికరం
– డిస్కంలను అప్పుల ఊబి నుంచి బయటపడేస్తాం
– గత పాలకులు అన్ని రంగాలనూ ధ్వంసం చేశారు
– ఊహించిన దానికంటే ఎక్కువ అప్పులు తెచ్చారు
– వాటన్నింటినీ గాడిలో పెట్టటానికే సగం సమయం సరిపోతోంది
– అయినా అభివృద్ధి, సంక్షేమం విషయంలో రాజీపడేది లేదు వాటిని జోడెడ్లలాగా నడిపిస్తున్నాం
– బీఆర్‌ఎస్‌ది బీజేపీతో రాజకీయ బంధం.. మాది కేంద్రంతో పరిపాలనా సంబంధం
– ‘కాషాయ’ సిద్ధాంతం మన రాష్ట్రానికి సెట్ కాదు : ‘నవతెలంగాణ’ ప్రత్యేక ఇంటర్వ్యూలో ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి
‘మా 19 నెలల పాలన సంతృప్తికరంగా ఉంది. ప్రజలు ఏ నమ్మకంతోనైతే మాకు ఓటేసి గెలిపించారో, ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటున్నాం…’ అని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. గత పాలకులు రాష్ట్రంలోని అన్ని రంగాలను ధ్వంసం చేశారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. లెక్కకు మిక్కిలిగా, ఊహించిన దానికంటే ఎక్కువగా అప్పులు చేశారని తెలిపారు. అప్పులు, వాటి వడ్డీలు, వివిధ బకాయిలు రాష్ట్ర ప్రగతికి ప్రతిబంధకంగా మారాయని ఆవేదన వ్యక్తం చేశారు. గత పాలకులు చేసిన అప్పులు, వారు చేసిన తప్పులను సరిదిద్దటానికే తమకు సగం సమయం సరిపోతోందని చెప్పారు. ఖజానాను ఆర్థిక కష్టాలు వెంటాడుతున్నా అభివృద్ధి, సంక్షేమం విషయంలో రాజీపడబోమని స్పష్టం చేశారు. ఆ రెండింటినీ జోడెడ్లలాగా పరుగులు పెట్టిస్తామనీ, తద్వారా రాష్ట్రాన్ని ప్రగతి పథంలో పయనింపజేస్తామని చెప్పారు. ‘నవతెలంగాణ దినపత్రిక’ పదో వార్షికోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక ఇంటర్వ్యూ విశేషాలు…
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు 19 నెలలు పూర్తయింది. ఈ కాలంలో పరిపాలన తీరుతెన్నుల గురించి మీ అభిప్రాయం…
‘మా పరిపాలన పట్ల మేం సంతృప్తికరంగా ఉన్నాం. ప్రజలు మాపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నాం. వారి అంచనాలకు తగినట్టుగా పాలన సాగిస్తున్నాం. ఇంకా చేయాల్సింది చాలా ఉంది. ప్రతి దానికి లక్ష్యాలను నిర్దేశించుకుని పని చేస్తున్నాం. పదేండ్ల విధ్వంసాన్ని సరిదిద్ది… తెలంగాణను ప్రపంచంతో పోటీపడే రాష్ట్రంగా నిలబెట్టాలన్న సంకల్పంతో పని చేస్తున్నాం…’

మ్యానిఫెస్టో ప్రకారం వెళుతున్నారు కదా? వాటి సాధ్యాసాధ్యాలు ఎలా ఉన్నాయి..?
‘మా మ్యానిఫెస్టో మాకు ఓ భగవద్గీత, ఖురాన్, బైబిల్, గురుగ్రంధ్ సాహిబ్. దాంట్లో పేర్కొన్న వాటిల్లో మెజారిటీ అంశాలను ఇప్పటికే అమలు చేస్తున్నాం. మిగిలిన ఒకట్రెండు ఏవైనా ఉంటే వాటిని కూడా అమలు చేస్తాం. ప్రజా ప్రభుత్వం అనే ట్యాగ్‌లైన్‌ను నూటికి నూరు శాతం నిజం చేసి చూపిస్తాం…’
మీరు అనుకున్న లక్ష్యాల మేరకు పని చేయగలుగుతున్నారా?
‘మేం పెట్టుకున్న లక్ష్యాల సాధనకు శక్తివంచన లేకుండా పని చేస్తున్నాం. అయితే ఆర్థికపరమైన ఇబ్బందులు కొంత ఆటంకంగా ఉన్నాయి. గత ప్రభుత్వం చేసిన ఆర్థిక విధ్వంసం మా వేగానికి కొంత ఆటంకంగా మారింది. మేం ఊహించిన దానికంటే వాళ్లు ఎక్కువ అప్పులు చేసి పోయారు. అధిక అప్పులు చేయడమే కాదు… అధిక వడ్డీలకు అప్పులు తెచ్చారు. వాటి భారం రాష్ట్ర ప్రగతికి సమస్యగా మారింది. అందుకే అప్పులపై వడ్డీ భారాలను తగ్గించాలంటూ కేంద్ర ప్రభుత్వాన్ని కోరాం. తాజాగా డిస్కంలపై కూడా లోతైన సమీక్ష చేశాను. వాటిని అప్పుల ఊబి నుంచి బయటపడేయాల్సిన అవసరముంది. విద్యుత్ సంస్థలు 10 శాతం వడ్డీకి తెచ్చిన అప్పులను ఆరు శాతానికి తగ్గించుకునేలా ప్రయత్నిస్తున్నాం. గత పాలకులు ఒక్క ఆర్థిక రంగాన్నే కాదు.. అన్ని రంగాలనూ విధ్వంసం చేశారు. వాటన్నింటినీ గాడిలో పెట్టడానికే సగం సమయం సరిపోతోంది. ఓ వైపు రాష్ట్రాన్ని గాడిన పెడుతూ మరోవైపు అభివృద్ధి, సంక్షేమాన్ని జోడెద్దుల్లా నడిపిస్తున్నాం. తద్వారా రాష్ట్రాన్ని ప్రగతి పథంలో పరుగులు పెట్టిస్తాం’
రాష్ట్రంలోని ప్రతిపక్షం నుంచి సహకారం సంపూర్ణంగా అందుతోందా ?

‘ప్రతిపక్షం బలంగా ఉంటేనే ప్రజాస్వామ్యం శోభిస్తుందని నేను నమ్ముతాను. అందుకే ప్రధాన ప్రతిపక్ష నేతకు పదే పదే విజ్ఞప్తి చేస్తున్నాను. ఏ అంశంపైనైనా రాష్ట్ర శాసనసభలో చర్చిద్దామని కోరుతున్నాను. ఆయన అసెంబ్లీకి వచ్చి తన అనుభవంతో సలహాలు, సూచనలు ఇస్తే స్వీకరిస్తాం. మాకు బేషజాలు లేవు. రాష్ట్ర ప్రగతి కోసం, ప్రజల మేలు కోసం అందరి సలహాలు, సూచనలు తీసుకుని ముందుకు వెళ్లాలన్నదే మా విధానం. మేం ఒంటెత్తు పోకడలు పోవడం లేదు. కుల గణన నుంచి ఎస్సీ వర్గీకరణ వరకు మీరు ఏ కీలకమైన అంశమైనా తీసుకోండి. విస్తృత సలహాలు, సంప్రదింపులు, స్టేక్ హౌల్డర్ల నుంచి అభిప్రాయాలు తీసుకుని మేం పని చేస్తున్నాం. మేం మేధావులం..మాకు అన్నీ తెలుసు… అన్నట్టు మేం ఎక్కడా వ్యవహరించడం లేదు. ఒక్క ప్రధాన ప్రతిపక్షం తప్ప… ఈ రాష్ట్రంలోని అన్ని సంఘాలు, వ్యవస్థలు, మేధావుల నుంచి మాకు సలహాలు, సూచనలు అందుతున్నాయి. దురదృష్టవశాత్తూ రాష్ట్రంలో ప్రతిపక్షం ఎలా ఉందో మీకు కూడా తెలుసు. ప్రతిపక్ష నేత సభకు రాడు, నోరు విప్పడు… ఆ పార్టీలో మిగతా వాళ్లకు బాధ్యత లేదు. వారి సొంత పార్టీలో ఆధిపత్య పోరులో భాగంగా నాపైనా, మంత్రులపైనా, ప్రజా ప్రభుత్వంపైనా అసభ్యకరమైన విమర్శలు చేస్తున్నారు. ఇక బీజేపీకి ఎప్పుడూ ప్రజా సమస్యలు పట్టవు. ఆ పార్టీ వాళ్లది ఎంతసేపు ఒకటే అజెండా… భావోద్వేగాలు సృష్టించి లబ్దిపొందడమే వాళ్ల పని. బీజేపీ సిద్ధాంతం ఈ రాష్ట్రానికి సెట్ కాదు…’
పదేపదే ఢిల్లీకి వెళుతున్నారు. కేంద్రం నుంచి ఆశించిన సహకారం అందడం లేదని చెబుతున్నారు. ఈ క్రమంలో ఏం చేద్దామనుకుంటున్నారు…?
‘ఢిల్లీ దేశ రాజధాని. మనది సమాఖ్య వ్యవస్థ… మనకు సంబంధించిన అన్ని అంశాలూ కేంద్ర జాబితా, రాష్ట్ర జాబితా, ఉమ్మడి జాబితాగా విభజించబడి ఉన్నాయి. ఉమ్మడి జాబితాలోని అంశాల సాధనకు కేంద్రంతో సంప్రదింపులు చేయకతప్పదు. కేంద్రంతో ఘర్షణాత్మక వైఖరి అవలంభించడం వల్ల మనకు నష్టమే తప్ప లాభం ఉండదు. గత పదేండ్ల కాలంలో బీఆర్‌ఎస్‌ది బీజేపీతో రాజకీయ సంబంధం. మాది బీజేపీతో పరిపాలనా సంబంధం. వాళ్లది రహస్య స్నేహం… మాది రాష్ట్రం కోసం పరస్పర సహకార విధానం. వాళ్ల పంథా వల్ల తెలంగాణ ప్రజలు ఎంతో నష్టపోయారు.. బీజేపీకి దేశంలో ఏకైక ప్రత్యామ్నాయం కాంగ్రెస్సే. మేం ఆ పార్టీతో రాజకీయంగా నేరుగా కొట్లాడుతాం. అదే సమయంలో కేంద్ర ప్రభుత్వంతో సామరస్యపూర్వకంగా వెళతాం. రాజకీయం, పరిపాలనా రెంటినీ భిన్నంగా చూడాల్సిన అవసరం ఉంది. అలా వెళ్లడం వల్లనే మామూనూరు ఎయిర్‌పోర్ట్ సాధించగలిగాం.. మెట్రో… ఆర్‌ఆర్‌ఆర్, రింగ్ రైలు, డిఫెన్స్ భూముల బదిలీ వంటి అంశాల్లో సానుకూలత తేగలిగాం. పార్లమెంట్ ఎన్నికలయ్యే వరకూ నేను పీసీసీ అధ్యక్షునిగా ఉన్నాను. మా అధిష్టానం ఢిల్లీలోనే ఉంటుంది. ఈ నేపథ్యంలో ఎక్కువసార్లు ఢిల్లీ వెళ్లాల్సి ఉంటుంది. నేనేం ఇస్లామాబాదో, బీజింగో వెళ్లడం లేదు కదా? నేనేం ఫాంహౌస్‌లకూ వెళ్లడం లేదు. ప్రజల కోసమే ఢిల్లీకి వెళుతున్నాను…’
ఆర్ధిక ఇబ్బందుల నేపథ్యంలో ఆరు గ్యారంటీల అమలు పరిస్థితి ఎలా ఉంది?

‘మీకు ముందే చెప్పినట్టు బీఆర్‌ఎస్ చేసిన అప్పులు, ఆర్థిక విధ్వంసం ఊహించ నంతగా ఉంది. సాధ్యమైనంత వరకు
వృధా ఖర్చులను తగ్గిస్తున్నాం. గతంలో ముఖ్యమంత్రి ఢిల్లీ వెళితే ప్రత్యేక విమానాల్లో రూ.లక్షలు వ్యయం చేసేవారు. నేను రెగ్యులర్ ఫ్లైట్‌లోనే వెళుతున్నా.. ఇబ్బందులున్నప్పటికీ ఇప్పటికే రూ.20 వేల కోట్లకుపైగా రుణమాఫీకి వెచ్చించాం.. రైతు భరోసా ఇస్తున్నాం. సన్న వడ్లకు క్వింటాకు రూ.500 బోనస్ అందిస్తున్నాం. పేదల ఇండ్లకు 200 యూనిట్లు లోపు ఉచిత విద్యుత్, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించాం. ఉచిత బస్సు పథకంపై బీఆర్‌ఎస్ వాళ్లు సెటైర్లు వేసారు. ఎగతాళి చేశారు. కానీ, అదొక సామాజిక మార్పుకు కారణమైంది. ఇటీవలే రూ.200 కోట్ల జీరో టికెట్ల మైలు రాయి దాటింది. ఆడబిడ్డల జీవితాల్లో గొప్ప మార్పు తెచ్చిన పథకం ఇది. పలు సర్వేల ప్రకారం ఆడబిడ్డలు చిన్న చిన్న ఆరోగ్య సమస్యలతో దగ్గరలో ఉన్న పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రులకు వెళ్లి చికిత్స చేయించుకునే వారి సంఖ్య పెరిగింది. ఆడపిల్లలు పాఠశాలలు, కళాశాలలకు వెళ్లడానికి ఫ్రీ బస్ ఉపయోగపడుతోంది. ఆర్టీసీలో ఆడబిడ్డల ఆక్యూపెన్సీ 35 నుండి 60 శాతానికి పెరిగింది. అన్నింటికంటే గమనించాల్సిన విషయమేమంటే… ఆర్టీసీ తిరిగి జీవం పోసుకుంది. మేం అధికారంలోకి వచ్చే నాటికి ఆ సంస్థ రేపో మాపో మూత పడుతుందనే పరిస్థితి. ఒకనాడు వెలుగు వెలిగిన ఆర్టీసీ ఇక చరిత్ర పుటల్లో కలిసిపోతుందన్న పరిస్థితి. అక్కడ నుండి ఈ రోజు ఆర్టీసీని ఉచిత బస్సు పథకం రక్షించింది. ఆ సంస్థను నిలబెట్టింది. ప్రగతి రథ చక్రం తిరిగి పరుగులు పెడుతోంది. ఇది నాకు ఎంతో సంతృప్తిని ఇచ్చింది. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం వేగంగా సాగుతోంది.. రాజీవ్ ఆరోగ్య శ్రీ పరిమితిని రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచాం…76 వేల ఉద్యోగ నియామకాలు చేపట్టాం.. రూ.500కే గ్యాస్ సిలిండర్ పంపిణీ చేస్తున్నాం..హామీ ఇవ్వకపోయినా సన్న బియ్యాన్ని పంపిణీ చేస్తున్నాం…’
వచ్చే డిసెంబరు నాటికి మీ సర్కార్ ఏర్పడి రెండేండ్లు పూర్తవుతుంది. ఈ సందర్భంగా ప్రజలకు మీరిచ్చే సందేశం…

కేసీఆర్ కుటుంబం తెలంగాణను ఆర్థికంగా, సామాజికంగా, సాంస్కృతికంగా విధ్వంసం చేసింది. ప్రజల స్వేచ్ఛను హరించింది. ప్రజల పక్షాన ప్రశ్నించే వారి గొంతు నొక్కింది. మేం అధికారంలోకి రాగానే ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించాం. పదేండ్ల బీఆర్‌ఎస్ పాలనలో వందేళ్ల విధ్వంసం జరిగింది. ఆ తప్పులన్నింటినీ సరిదిద్ది… ప్రస్తుతం రాష్ట్రాన్ని గాడిలో పెడుతున్నాం. పరిస్థితి బాగోలేదని మేం ప్రజల సంక్షేమం విషయంలో రాజీ పడలేదు. హామీల అమలుకు మేం ఎన్నికల వరకు వేచి ఉండలేదు. చెప్పిన గడువు లోగా రుణమాఫీ చేశాం. రైతు భరోసా పథకాన్ని విజయవంతంగా అమలు చేశాం. సన్న బియ్యం సంక్షేమ చరిత్రలో సరికొత్త అధ్యాయాన్ని సృష్టించింది. పదేండ్లపాటు పేదలు ఎదురు చూసిన రేషన్ కార్డులను ఇప్పుడు ఇస్తున్నాం. లక్ష్యం మేరకు ఇందిరమ్మ ఇండ్ల గ్రౌండింగ్ జరుగుతోంది. తెలంగాణ రైతులు రికార్డు స్థాయిలో ధాన్యం పండిస్తే ప్రతి గింజా కొన్నాం. చెప్పిన మాట ప్రకారం సన్నాలకు రూ.500 బోనస్ ఇస్తున్నాం. అదే సమయంలో తెలంగాణను అభివృద్ధిలో ప్రపంచంతో పోటీ పడేలా ప్రణాళికలు రచిస్తున్నాం. విదేశీ పర్యటనలతో రూ.లక్షల కోట్ల పెట్టుబడులు సాధించాం. ఫోర్త్ సిటీ నిర్మాణానికి శ్రీకారం చుట్టాం. హైదరాబాద్‌ను అంతర్జాతీయ కంపెనీ లకు కేరాఫ్ అడ్రస్‌గా మార్చుతున్నాం. ప్రతి కంపెనీ తన జీసీసీ (గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లు)ను హైదరాబాద్‌లో పెట్టాలన్న ఆలోచన కల్పించాం. మూసీ పునరుద్ధరణ హైదరాబాద్‌కు తలమానికంగా నిలుస్తుంది. త్రిబుల్ ఆర్ ఉత్తర భాగంతో పాటు దక్షిణ భాగాన్నీ శరవేగంగా పూర్తి చేయడానికి ప్రయత్నిస్తున్నాం. హైదరాబాద్ టు బందర్ పోర్టు వయా అమరావతి గ్రీన్ ఫీల్డ్ హైవేకు కేంద్రంతో సంప్రదింపులు జరుపుతున్నాం. డ్రై పోర్టు నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధమయ్యాయి. ఇదీ అదీ కాదు… 2035 నాటికి తెలంగాణను వన్ ట్రిలియన్ డాలర్ ఎకానమీగా తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తున్నాం. 2047 నాటికి దేశానికి స్వాతంత్య్రం వచ్చి వందేండ్లు పూర్తవుతుంది. ఆ నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా తెలంగాణ ఉంటుంది. వచ్చే పదేళ్లు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుంది.
స్థానిక సంస్థల ఎన్నికల్లో మీ వ్యూహం ఎలా ఉండబోతోంది ?

‘ప్రత్యేకంగా వ్యూహమంటూ ఏమీ లేదు. చేసిన పనులు మమ్మల్ని గెలిపిస్తాయి…’ఈ రాష్ట్రంలో యువత, మహిళ, రైతు, పేదల ప్రభుత్వం ఇది. సామాజిక న్యాయ సాధన మిషన్ సాధించే ప్రభుత్వం ఇది. అందుకే నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలను నేను కోరుతున్నాను. మీ కలల సాధనలో మేం రాజీ పడం. మాకు అండగా నిలవడంలో మీరు రాజీ పడొద్దు. ప్రజా ప్రభుత్వానికి మీరే కర్త, కర్మ, క్రియ. ప్రజల సహకారంతో వచ్చే పదేండ్లు ప్రజా ప్రభుత్వం గొప్ప విజయాలను సాధించి… ప్రపంచ వేదికపై తెలంగాణ జెండాను సగర్వంగా ఎగరేస్తుంది. కేసీఆర్, ఆయన కుటుంబం పదేళ్లు రాష్ట్రాన్ని దోచుకుతిన్నారు.. అవినీతి, అక్రమాలు, అహంకారంతో తెలంగాణ ప్రతిష్టను భూస్థాపితం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది మొదలు రుణమాఫీ, ఉచిత బస్సు ప్రయాణం, రూ.500కే గ్యాస్ సిలిండర్, ఉద్యోగ నియామకాలు, సన్న బియ్యం పంపిణీ, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్ల వంటి కార్యక్రమాలతో ప్రజా సంక్షేమం విషయంలో రాజీ లేకుండా పని చేస్తున్నాం… తెలంగాణ ప్రజలు ప్రతిపక్షాల మాయలో పడకుండా ప్రజా ప్రభుత్వానికి అండగా నిలవాలి..’
కాళేశ్వరం, ఫోన్ ట్యాపింగ్ తదితర అంశాల్లో మీ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందని బీఆర్‌ఎస్ ఆరోపిస్తోంది. దీనికి మీ సమాధానం…?
‘కాళేశ్వరం బీఆర్‌ఎస్ హయంలోనే కూలిపోయింది. అప్పుడే నేషనల్ డ్యాం సేఫ్టీ అధికారులు రంగంలోకి దిగారు. ఒక తప్పిదం జరిగినప్పుడు అది ఎలా జరిగిందీ, దానికి కారకులు ఎవరనేది ప్రభుత్వం తెలుసుకోవాలి… అందులో భాగంగానే మేం న్యాయ కమిషన్ వేశాం.. ఆ కమిషన్ అధికారులు, నాటి ప్రజా ప్రతినిధులను విచారించింది. అందులో కక్ష సాధింపు ఏముంది? ఫోన్ ట్యాపింగ్ కేసు మేం ప్రత్యేకంగా పెట్టింది కాదు. పోలీస్ స్టేషన్‌లో కొన్ని పరికరాలు పోయాయని గుర్తించి, తీగ లాగితే డొంక కదిలినట్టు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఇప్పుడు మాపై తప్పుడు విమర్శలు చేస్తున్న ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ ఎన్నికలకు ముందు బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడి హోదాలో ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారంటూ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. దానిపై విచారణ చేపట్టాలంటూ నాటి డీజీపీని ఎన్నికల సంఘం ఆదేశించింది. ఇందులో కక్ష సాధింపు ఎక్కడుంది? ఏదైనా చట్టబద్ధంగా జరుగుతుంది. బీఆర్‌ఎస్ వాళ్లకు నొప్పి కలుగుతోందని చట్టాన్ని అతిక్రమించి, చట్టం చేతులు కట్టేసి మేం వ్యవహరించలేం…’
బీసీ రిజర్వేషన్లపై ఎలా ముందుకు వెళ్ళబోతున్నారు?
‘బీసీ రిజర్వేషన్లపై మేం వంద శాతం చిత్తశుద్ధితో పని చేస్తున్నాం. విద్యా, ఉపాధి రంగాల్లో 42 శాతం, స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్లకు సంబంధించి శాసనసభలో బిల్లులు ఆమోదించి కేంద్ర ప్రభుత్వానికి పంపాం.. వాటిని అమలు చేయాలని ప్రధానమంత్రి మొదలు కేంద్ర మంత్రుల వరకూ అందర్నీ కోరాం…

మరోవైపు కాంగ్రెస్‌కు లోక్‌సభ, రాజ్యసభలో ఉన్న 120కుపైగా ఎంపీలను సమావేశపరిచి రాష్ట్రంలో చేపట్టిన సామాజిక, ఆర్థిక, విద్యా, ఉపాధి, రాజకీయ, కుల సర్వే, దాని ఆధారంగా చేసిన రిజర్వేషన్ల బిల్లులపై పూర్తిగా వివరించాం. వాటి ఆమోదానికి పార్లమెంట్‌లో కాంగ్రెస్ ఎంపీలు రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖర్గే నేతృత్వంలో పోరాడతారు. ఢిల్లీ జంతర్‌మంతర్‌లో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి నేను ఆందోళన చేస్తా. అప్పటికీ కేంద్రం ఆ బిల్లులను ఆమోదించకపోతే తగిన వ్యూహంతో ముందుకు సాగుతాం. సామాజిక న్యాయ సాధనలో ఇప్పుడు మేం చేస్తోన్న పోరాటం దేశ చరిత్రలో నిలిచిపోతుంది. ఇకపై ఎవరు సామాజిక న్యాయం గురించి మాట్లాడాలన్నా అందులో తెలంగాణ ప్రస్తావన, మా ప్రజా ప్రభుత్వ సంకల్పం గురించి మాట్లాడాల్సిన అనివార్యత ఉంటుంది. దేశ చరిత్రలో వందేళ్ల తర్వాత కుల గణన చేసిన రికార్డు తెలంగాణకే దక్కుతుంది…’