బీఆర్‌ఎస్ సర్కారు పెండింగ్‌లో పెట్టిన మూడు డీఏలిచ్చాం
బకాయిల భారం తప్పించుకునేందుకు ఉద్యోగ విరమణ వయస్సు పెంచింది వాస్తవం కాదా?
ఉద్యోగుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం : డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
గత ప్రభుత్వం ప్రతి నెలా 15వ తేదీ తర్వాత జీతాలిస్తే తమ ప్రభుత్వం ప్రతి నెలా ఒకటో తేదీనే ఇస్తున్నదనీ, ఇది ఉద్యోగుల పట్ల తమకున్న చిత్తశుద్ధి అని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క చెప్పారు. బీఆర్‌ఎస్ సర్కారు మూడు డీఏలను పెండింగ్‌లో పెట్టిపోతే వాటిని క్లియర్ చేశామని చెప్పారు. ఆనాడు మూడు డీఏలు పెట్టిపోకపోతే ఇప్పుడు డీఏలు పెండింగ్‌లో పడేవా? అని హరీశ్‌రావును ప్రశ్నించారు. సోమవారం శాసనసభలో ప్రశ్నోత్తరాల సమయంలో వేతన సవరణ కమిషన్, నివేదిక, నూతన వేతన స్కేలు అమలు, రిటైర్డ్ ఉద్యోగుల బకాయిలు, ఐదు పెండింగ్ డీఏలపై బీఆర్‌ఎస్ ఎల్పీ ఉపనేత టి.హరీశ్‌రావు, బీఆర్‌ఎస్ సభ్యులు కేపీ.వివేకానంద, కల్వకుంట్ల సంజయ్ అడిగిన ప్రశ్నలకు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క సమాధానాలిచ్చారు.
రిటైర్డ్ ఉద్యోగుల బకాయిల భారం తప్పించుకునేందుకు గత ప్రభుత్వం ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును మరో మూడేండ్లకు పెంచింది వాస్తవం కాదా? అని ప్రశ్నించారు. ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు పెంచడంతో 17వేల మంది ఉద్యోగుల పదవీ విరమణ ప్రయోజనాల భారం ప్రజా ప్రభుత్వం పైపడిందని తెలిపారు. బీఆర్‌ఎస్ చేసిన తప్పిదాలను తమపై రుద్దాలనుకోవడం సబబు కాదనీ, ఉద్యోగులకు చేయాల్సిన అన్యాయం చేసి ఇప్పుడు వారి కోసం మాట్లాడుతున్నట్టు నటిస్తున్నారని విమర్శించారు. తమ ప్రభుత్వం ఉద్యోగుల మెడికల్ బిల్లులను క్లియర్ చేసిందని చెప్పారు. తమ ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చేనాటికి గత ప్రభుత్వం రూ.40, 150 కోట్లు బకాయిలు పెట్టిందనీ, ఆ బకాయిల్లో ఉద్యోగులకు సంబంధించి రూ. 4,575 కోట్లు ఉన్నాయని తెలిపారు.
ఉద్యోగుల పెండింగ్ బిల్లులు క్లియర్ చేసేందుకు ప్రతినెల 700 కోట్లు క్రమం తప్పకుండా చెల్లిస్తున్నామనీ, రాబోయే రోజుల్లో బకాయిలు త్వరితగతిన క్లియర్ చేసేందుకు ప్రతినెలా చెల్లించే రూ. 700 కోట్లను రూ.1000 కోట్లకు పెంచాలని విధానపరమైన నిర్ణయం తీసుకునే ఆలోచనలో తమ ప్రభుత్వం ఉందని తెలిపారు. తమ క్యాబినెట్‌కు మానవీయ కోణం ఉంది కాబట్టే ఉద్యోగులకు నగదు రహిత వైద్య చికిత్స కార్డులను అందుబాటులోకి తీసుకురాబోతుమనీ, ఉద్యోగి ప్రమాదవశాత్తు చనిపోతే రూ.1.20 కోట్ల బీమా అమలు చేయబోతున్నామని చెప్పారు.
బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో పదేండ్లుగా ఇదే విషయాన్ని ఉద్యోగులు అడిగితే ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. ఇప్పటివరకు ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి దాదాపు 6,146 కోట్లు క్లియర్ చేశామని తెలిపారు. పీఆర్సీ నివేదిక రాగానే పరిశీలించి కొత్త పీఆర్సీ అమలుపై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ప్రస్తుతం ఉద్యోగులకు నాలుగు డీఏలు పెండింగ్‌లో ఉన్నాయనీ, వాటిపై విధానపరమైన నిర్ణయం తీసుకుంటామని హామీనిచ్చారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో ఆర్థిక విధ్వంసం సృష్టించి వ్యవస్థలను ధ్వంసం చేసిపోయారనీ, ఉద్యోగులకు జీతాలు ఇచ్చే పరిస్థితి లేకుండా చేశారని విమర్శించారు.



