Sunday, February 1, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంఅమెరికాతో న్యాయమైన చర్చలకు సిద్ధం

అమెరికాతో న్యాయమైన చర్చలకు సిద్ధం

- Advertisement -

కానీ బెదిరింపు నీడలో మాత్రం అంగీకరించం : ఇరాన్‌

అంకారా : అమెరికాతో న్యాయమైన చర్చలకు సిద్ధమేనని ఇరాన్‌ ప్రకటించింది. అయితే సైనిక బెదిరింపుల వాతావరణంలో మాత్రం ఎలాంటి చర్చలకూ అంగీకరించబోమని ఇరాన్‌ విదేశాంగ మంత్రి అబ్బాస్‌ అరఘ్చీ స్పష్టం చేశారు. అలాగే ఇరాన్‌ క్షిపణి కార్యక్రమం ఎట్టి పరిస్థితుల్లోనూ చర్చకు వచ్చే అంశం కాదని ఆయన తేల్చి చెప్పారు. టర్కీ పర్యటనలో ఉన్న అరఘ్చీ.. టర్కీ విదేశాంగ మంత్రి హాకాన్‌ ఫిదాన్‌తో కలిసి నిర్వహించిన సంయుక్త విలేకరుల సమావేశంలో ఈ వ్యాఖ్యలు చేశారు. ”ఇరాన్‌కు చర్చలపై అభ్యంతరం లేదు. కానీ బెదిరింపుల నీడలో జరిగే చర్చలను మేం అంగీకరించం” అని ఆయన అన్నారు. ఇరాన్‌ రక్షణ, క్షిపణి సామర్థ్యాలు పూర్తిగా దేశ భద్రతకు సంబంధించినవనీ, వాటిపై చర్చించే హక్కు ఇతర దేశాలకు లేదని అరఘ్చీ స్పష్టం చేశారు. దేశాన్ని కాపాడేందుకు అవసరమైనంత వరకూ రక్షణ సామర్థ్యాలను విస్తరించుకుంటామని తెలిపారు.

కాగా అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌.. ఇరాన్‌పై ఒత్తిడి పెంచుతున్నారు. ”భారీ నౌకాదళాన్ని” ఇరాన్‌ వైపు పంపుతున్నట్టుగా ఆయన ప్రకటించగా.. అవసరమైతే సైనిక చర్య కూడా తీసుకుంటామని హెచ్చరించారు. అయితే ఒప్పందం కుదిరితే మంచిదేననీ, లేకపోతే పరిణామాలు ఎలా ఉంటాయో చూడాల్సి ఉంటుందని ట్రంప్‌ బెదిరించారు. 2018లో ఇరాన్‌ అణు ఒప్పందం నుంచి అమెరికా ఏకపక్షంగా వైదొలిగిన విషయం విదితమే. ప్రస్తుతం అమెరికా.. యురేనియం శుద్ధి పూర్తిగా నిలిపివేయాలని ఇరాన్‌పై ఒత్తిడి తెస్తోంది. అయితే అణ్వాయుధాల అభివృద్ధి ఆరోపణలను ఇరాన్‌ పదే పదే ఖండిస్తోంది. ఈ ఉద్రిక్తతల నడుమ టర్కీ, సౌదీ అరేబియా, యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ (యూఏఈ) వంటి దేశాలు మధ్యవర్తిత్వ ప్రయత్నాలు చేస్తున్నాయి. టర్కీ అధ్యక్షుడు రెసెప్‌ తయ్యిప్‌ ఎర్డోగాన్‌ అమెరికా-ఇరాన్‌ మధ్య సంధానకర్తగా వ్యవహరించేందుకు సిద్ధమని ఇప్పటికే తెలిపారు. అణు చర్చలు తిరిగి ప్రారంభమైతే.. ఇరాన్‌పై ఆంక్షల ఎత్తివేతకు మార్గం సుగమం అవుతుందని టర్కీ విదేశాంగ మంత్రి హాకాన్‌ ఫిదాన్‌ అన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -