Saturday, January 3, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంఅమెరికాతో చర్చలకు సిద్ధం

అమెరికాతో చర్చలకు సిద్ధం

- Advertisement -

చమురు నిల్వల కోసమే దాడులు
వెనిజులా అధ్యక్షుడు మదురో వ్యాఖ్యలు

కరాకస్‌ : అమెరికాతో చర్చలకు సిద్ధమని వెనిజులా అధ్యక్షుడు నికోలస్‌ మదురో ప్రకటించారు. మాదకద్రవ్యాల అక్రమ రవాణా పేరుతో ట్రంప్‌ కరేబియన్‌ సముద్ర తీరంలో దాడులు తెగబడుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో యునైటెడ్‌ స్టేట్స్‌తో ఒప్పందానికి సిద్ధంగా ఉన్నట్లు మదురో తెలిపారు. ఆ దేశ టెలివిజన్‌లో గురువారం ప్రసారమైన ఒక ఇంటర్వ్యూలో మదురో ఈ వ్యాఖ్యలు చేశారు. వెనిజులాలో ప్రభుత్వాన్ని మార్చాలని, దేశంలోని విస్తారమైన చమురు నిల్వలను స్వాధీనం చేసుకోవాలని అమెరికా కోరుకుంటోందని మదురో స్పష్టం చేశారు. ఆగస్టులో కరేబియన్‌ సముద్రంలో భారీ సైనిక మోహరింపుతో ప్రారంభమైన దాడులు నెలల తరబడి కొనసాగించడానికి ఇదే కారణమయని ఆయన పేర్కొన్నారు. ”వారు ఏమి కోరుకుంటున్నారు? బెదిరింపులు, భయపెట్టడం, బలవంతం ద్వారా తమను తాము రుజువు చేసుకోవాలని వారు కోరుకుంటున్నారని స్పష్టమవుతోంది” అని మదురో అన్నారు. రెండు దేశాలు ” డేటా ఆధారంగా చర్చించడానికి ” ఇదే సరైన సమయమన్నారు.

చమురు పెట్టుబడులకు ఆహ్వానం
మాదకద్రవ్యాల అక్రమ రవాణాకు సంబంధించిన ఒప్పందంపై చర్చించాలనుకుంటే, అందుకు తాము సిద్ధంగా ఉన్నామన్న విషయం అమెరికా ప్రభుత్వానికి తెలుసునని మదురో తెలిపారు. ”వారు చమురును కోరుకుంటే, వెనిజులా అమెరికా పెట్టుబడులకు సిద్ధంగా ఉంది, చెవ్రాన్‌ కంపెనీ మాదిరిగా, వారికి ఎప్పుడు కావాలంటే అప్పుడు, ఎక్కడ కావాలంటే అక్కడ ఎలా కావాలంటే అలా సరఫరా చేస్తాం” అని ఆయన అన్నారు. వెనిజులా ముడి చమురును అమెరికాకు ఎగుమతి చేస్తున్న ఏకైక ప్రధాన చమురు సంస్థ చెవ్రాన్‌ కార్పొరేషన్‌. ఈ సంస్థను ఇటీవలే అమెరికా నిలుపుదల చేసింది.. మదురో ప్రసంగిస్తున్న రోజే ఐదు పడవలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేసినట్లు అమెరికా సైన్యం ప్రకటించడం గమనార్హం. అమెరికా వెల్లడించిన డేటా ప్రకారం, తాజా దాడులతో సహా మొత్తం 35 పడవలపై దాడులు జరిగాయి. ఈ దాడుల్లో 115 మంది మరణించారు. ఇందులో సాధారణ మత్స్యకారులున్నారని వెనిజులా తెలిపింది.

సీఐఏ డ్రోన్‌ దాడి
వెనిజులాలోని డాకింగ్‌ ప్రాంతంలో గత వారం సీఐఏ డ్రోన్స్‌తో దాడి చేసింది. అమెరికా దాడులు ప్రారంభించినప్పటి నుంచి వెనిజులా గడ్డపై జరిగిన మొట్టమొదటి ప్రత్యక్ష దాడి ఇదే. ఈ విషయాన్ని ట్రంప్‌ ఒక మీడియా సమావేశంలో పరోక్షంగా వెల్లడించారు. అక్రమ మాదక ద్రవ్యాలు, ఉగ్రవాదం పేరుతో మదురోపై అమెరికా ఒత్తిడి పెంచుతూనే ఉంది. మదురోకి రాజీనామా తప్ప వేరే ప్రత్యామ్నాయం లేదని ట్రంప్‌ బెదిరించిన సంగతి తెలిసిందే. ఈ డ్రోన్‌ దాడి గురించి త్వరలో మాట్లాడతానని మదురో తెలిపారు…

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -