ఢిల్లీకి కాదు
బ్లాక్‌మెయిల్‌కు బ్రాండ్ అంబాసిడర్ రేవంత్‌రెడ్డి
ముఖ్యమంత్రి పదవి కూడా అలానే వచ్చిందేమో
కేసీఆర్ విచారణతో తెలంగాణ ఉద్యమం రోజులు గుర్తుకొచ్చాయి
పాలనా వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికే సిట్ పేరుతో డ్రామా
సీఎం 60 సార్లు ఢిల్లీకి వెళ్లి సాధించింది ఏంటీ…
ప్రభుత్వాన్ని నడపండి… బడ్జెట్‌పై దృష్టిపెట్టండి
సజ్జనార్ జడ్జి కాదు
ఫోన్ ట్యాపింగ్‌లో ఆధారాలుంటే కోర్టుకివ్వాలి
దావోస్ పెట్టుబడులపై శ్వేతపత్రం ప్రకటించాలి : మీడియాతో చిట్‌చాట్‌లో కేటీఆర్
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
తాము తెలంగాణ ప్రజలకు గులాం, ఢిల్లీకి గులాం కాదనీ బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె తారక రామారావు (కేటీఆర్) అన్నారు. తెలంగాణ ప్రజలకు బానిసలుగా ఉంటామని చెప్పారు. సోమవారం హైదరాబాద్ నందినగర్‌లోని తన నివాసంలో మీడియాతో కేటీఆర్ చిట్‌చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బ్లాక్‌మెయిల్‌కు బ్రాండ్ అంబాసిడర్ రేవంత్‌రెడ్డి అని విమర్శించారు. ఆర్టీఐ ద్వారా బ్లాక్‌మెయిల్ చేయడం ఆయన వృత్తి అని అన్నారు. ముఖ్యమంత్రి పదవిని కూడా బ్లాక్‌మెయిల్ చేసి తెచ్చుకున్నాడేమోనని ఎద్దేవా చేశారు.
కేసీఆర్‌ను సిట్ విచారణ చేసిన నేపథ్యంలో ఆదివారం దాదాపు ఏడు వేలకుపైగా గ్రామాలు, పట్టణాల్లో నిరసనలు, సీఎం రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మ దహన కార్యక్రమాలు, బైక్ ర్యాలీలు జరిగాయని అన్నారు. తెలంగాణ ఉద్యమం రోజులు, ఉద్యమ స్ఫూర్తి గుర్తుకొచ్చాయని చెప్పారు. తమలో స్ఫూర్తిని నింపిన బీఆర్‌ఎస్ కార్యకర్తలకు, వారిని తట్టిలేపిన సీఎం రేవంత్‌రెడ్డికి కృతజ్ఞతలు ప్రకటించారు. కేసీఆర్ సిట్ విచారణకు రావాల్సిన అవసరం లేదన్నారు. కోర్టుకు వెళ్లే అవకాశముందని అన్నారు. అధికారికంగా 900 మంది పోలీసులు, అనధికారికంగా రెట్టింపు మంది ఉన్నారని వివరించారు.
పాలనా వైఫల్యంతో ఇబ్బంది
పరిపాలనా వైఫల్యంతో సీఎం రేవంత్‌రెడ్డి ఇబ్బంది పడుతున్నారని కేటీఆర్ అన్నారు. మేడారం జాతర తెలంగాణ కుంభమేళా అని చెప్పారు. అధికారంలో ఎవరున్నా ఏర్పాట్లు ఘనంగా ఉంటాయని వివరించారు. నామమాత్రంగా మంత్రివర్గ సమావేశాన్ని ములుగులో నిర్వహించారని అన్నారు. ఏర్పాట్లు సరిగ్గా చేయనందుకు జాతర సందర్భంగా మంత్రి కారు అద్దాలను పగలగొట్టారని చెప్పారు. సుల్తాన్‌బజార్‌లో పట్టపగలు ఉదయమే ఏటీఎం వద్ద కాల్పులు జరిపి రూ.లక్ష ఎత్తుకెళ్లారని అన్నారు. శాంతిభద్రతల నిర్వహణలో ప్రభుత్వ వైఫల్యం ఉందన్నారు. సహజ వనరులను, జల వనరుల దోపిడీని ప్రభుత్వం కాపాడ్డం లేదని చెప్పారు.
పాత బాసు చంద్రబాబు, కేసుల కోసం కేంద్రాన్ని ఏమీ అనడం లేదన్నారు. సింగరేణిలో సీఎం రేవంత్‌రెడ్డి బామ్మర్ది సృజన్‌రెడ్డి దోపిడీపై బయటపెట్టినా భట్టి, కిషన్‌రెడ్డి సరైన సమాధానం చెప్పకుండా బుకాయిస్తున్నారని విమర్శించారు. సీబీఐ లేదా సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించడానికి వచ్చిన ఇబ్బంది ఏంటని ప్రశ్నించారు. సింగరేణిలో ఎంత మంది సైట్ విజిట్‌కు వచ్చారో శ్వేతపత్రం ప్రకటించాలని డిమాండ్ చేశారు. దానికోసం సృజన్‌రెడ్డి ఫోన్ చేసిన కాల్ డేటాను చూస్తే అన్ని విషయాలు బయటకొస్తాయని అన్నారు. పాలనా వైఫల్యం, భూదోపిడీ, జలదోపిడీ, బొగ్గు దోపిడీ, శాంతి భద్రతల వైఫల్యం కప్పిపుచ్చుకోవడానికి, ప్రజల దృష్టిని మరల్చడం కోసమే కేసీఆర్‌కు సిట్ నోటీసుల పేరుతో డ్రామా నడిపించారని విమర్శించారు.
సజ్జనార్ అత్యుత్సాహం మంచిది కాదు
సిట్ చీఫ్ సజ్జనార్ జడ్జి కాదని కేటీఆర్ అన్నారు. ఫోన్‌ట్యాపింగ్‌కు సంబంధించి ఆయన వద్ద ఏమైనా సమాచారం ఉంటే కోర్టుకు ఇవ్వాలని సూచించారు. చట్టబద్ధమా? చట్టవిరుద్ధమా? అనేది కోర్టు నిర్ణయిస్తుందన్నారు. సజ్జనార్‌కు అత్యుత్సాహం మంచిది కాదని చెప్పారు. తమ పార్టీ నాయకుడు కేసీఆర్‌ను అక్రమ కేసులతో వేధిస్తే ఊరుకుంటామా?, తప్పకుండా స్పందిస్తామని అన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి మూడుసార్లు దావోస్ పర్యటనకు వెళ్లారని చెప్పారు. ఆ పెట్టుబడులపై శ్వేతపత్రం ప్రకటించాలనీ, ఎన్ని పరిశ్రమలు నెలకొల్పారో చెప్పాలని డిమాండ్ చేశారు. సీఎం రేవంత్, మేఘా కృష్ణారెడ్డి జూబ్లీహిల్స్‌లోనే ఉన్నా దావోస్‌కు వెళ్లి ఒప్పందం చేసుకున్నారని ఎద్దేవా చేశారు.
మున్సిపల్ ఎన్నికల్లో సత్తాచాటుతాం
మున్సిపల్ ఎన్నికల్లో సత్తాచాటుతామని కేటీఆర్ అన్నారు. ఎక్కడికక్కడ స్థానికంగా ప్రచారం చేస్తున్నామని చెప్పారు. రోడ్‌షోలు, అట్టహాసం చేయడం లేదన్నారు. బీఆర్‌ఎస్ హయాంలో 143 మున్సిపాల్టీల్లో 135 వరకు గెలిచామని అన్నారు. ఇప్పుడు 116 మున్సిపాల్టీలు, ఏడు కార్పొరేషన్లలో మెజార్టీ స్థానాలను గెలుస్తామని చెప్పారు. సిర్పూర్, షాద్‌నగర్ మున్సిపాల్టీలను తప్పకుండా గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. బీఆర్‌ఎస్ అభ్యర్థులకు మంగళవారం బీంఫామ్‌లను అందజేస్తామన్నారు. రాష్ట్రంలో కేసీఆర్‌కు సరితూగే నాయకుడు లేరని అన్నారు. కవిత వ్యాఖ్యలపై ఎందుకు స్పందించడం లేదని విలేకర్ల ప్రశ్నకు కేటీఆర్ స్పందిస్తూ పార్టీ ఒక నిర్ణయం తీసుకుందనీ, ఇక పదేపదే స్పందించాల్సిన అవసరం లేదని చెప్పారు. ఈ కార్యక్రమంలో మాజీమంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్, ఎమ్మెల్సీ ఎల్ రమణ, బీఆర్‌ఎస్ ప్రధాన కార్యదర్శి రావుల చంద్రశేఖర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
మోడీ హయాంలో రూ.153 లక్షల కోట్ల అప్పు
2014 వరకు రూ.55 లక్షల కోట్ల అప్పు ఉండేదని కేటీఆర్ చెప్పారు. మోడీ ప్రభుత్వం రూ.153 లక్షల కోట్లు అప్పు చేసిందన్నారు. దీంతో భారత్ మొత్తం అప్పు రూ.208 లక్షల కోట్లకు చేరిందని వివరించారు. ఒక్కొక్కరిపై లక్ష అప్పు ఉందని అన్నారు. ఉపాధి హామీ చట్టాన్ని కుదించిందని చెప్పారు. ఎరువుల సబ్సిడీకి కోతలు విధించిందనీ, ఆహార సబ్సిడీకి కేటాయింపులు తగ్గించిందని వివరించారు. స్వచ్ఛ భారత్ మిషన్‌కు నిధులు తగ్గాయని అన్నారు. బయో ఫార్మాకు రూ.పది వేల కోట్లు కేటాయించినా తెలంగాణకు రూ.పది కూడా ఇవ్వలేదన్నారు.
బయో ఫార్మా కాపిటల్ హైదరాబాద్ అని చెప్పారు. 60 సార్లు సీఎం రేవంత్ ఢిల్లీకి వెళ్లినా ఏం సాధించారని ప్రశ్నించారు. భౌగోళికంగా హైదరాబాద్ వివిధ నగరాలకు మధ్యలో ఉండడం వల్లే హైస్పీడ్ రైళ్లను కేంద్రం ప్రకటించిందని అన్నారు. సిట్ విచారణ నేపథ్యంలో బెదిరించినట్టు ఏ వ్యాపారవేత్త ఫిర్యాదు చేయలేదన్నారు. సీఎం రేవంత్‌కు ఎలా సమాచారం వస్తుందో గతంలో కేసీఆర్‌కు అలాగే వచ్చిందని గుర్తు చేశారు. చట్టవిరుద్ధంగా ఏమీ జరగలేదనీ, ఈ ఘట్టాన్ని ముగించాలని కోరారు. దుష్ప్రచారం, లీకులు, అబద్ధాలను మీడియా ప్రచురించొద్దని సూచించారు.



