Sunday, November 2, 2025
E-PAPER
Homeజాతీయంగెలిచేది మేమే : తేజస్వియాదవ్‌ ఇంటర్వ్యూ

గెలిచేది మేమే : తేజస్వియాదవ్‌ ఇంటర్వ్యూ

- Advertisement -

నవతెలంగాణ – పాట్నా : ఎన్‌డిఎ కూటమి, మహాగట్బంధన్‌ కూటమిల మధ్యే పోటీ నెలకొనడంతో ఇప్పుడు అందరి దృష్టి బీహార్‌ ఎన్నికల వైపే ఉంది. ఓటింగ్‌ సమయం దగ్గర పడుతున్న కొద్దీ ఆయా కూటమి నేతలు కూడా ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్నారు. ఈ ఎన్నికల్లో ఎన్‌డిఎ కూటమి ఘోరంగా ఓడిపోతుందని, తామే ఈసారి అధికారంలోకి వచ్చేదని మహాగట్బంధన్‌ సిఎం అభ్యర్థి తేజస్వియాదవ్‌ ధీమా వ్యక్తం చేశారు. ఇరవై ఏళ్లుగా నితీష్‌ ప్రభుత్వంతో ప్రజలు విసిగిపోయారని.. వారు మార్పును కోరుకుంటున్నారని.. ఆ విషయం ఎన్నికల ప్రచారంలో మాకు స్పష్టంగా కనిపిస్తుందని తేజస్వియాదవ్‌ అంటున్నారు. ఆంగ్ల పత్రిక ది హిందూకిచ్చిన ఇంటర్వ్యూలో ఆయన పంచుకున్న విషయాలు..

మీ ఎన్నికల ప్రచారం ఎలా సాగుతుంది?
బాగా జరుగుతోంది. ఈ ఎన్నికల్లో మహాగట్బంధన్‌ విజయం సాధిస్తుంది. ఈసారి కచ్చితంగా మార్పు వస్తుందని ప్రజలు నాకు ప్రచారంలో చెబుతున్నారు. వారు కొత్త బీహార్‌ గురించి, కొత్త ప్రభుత్వ ఏర్పాటు చేయడం గురించే మాట్లాడుకుంటున్నారు. విద్య, నీటిపారుదల, వైద్యం, ఉద్యోగాలు గురించి చెబుతున్నవారే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారని ప్రజలు అంటున్నారు. బీహార్‌ ప్రజలు మహాగట్బంధన్‌ ప్రభుత్వాన్ని ఎన్నుకుంటారని నాకు పూర్తిగా నమ్మకముంది.

ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్‌ షా బీహార్‌కు వచ్చినప్పుడల్లా ప్రతిపక్షాలను జంగిల్‌ రాజ్‌ అనే ట్యాగ్‌ లైన్‌తో ఎగతాళి చేస్తున్నారు? దీనిపై మీ స్పందన
వారికి మాట్లాడటానికి వేరే సమస్యలే లేవు. ప్రధాని, అమిత్‌ షా ఉపయోగించే పదాలను, వాక్యాలను శ్రద్ధగా వింటే మీకే తెలుస్తుంది. వారెంత ప్రతికూల ఆలోచనలతో నిండి ఉన్నారో స్పష్టమవుతుంది. మేము సానుకూల, ప్రగతిశీల రాజకీయాలకే ప్రాధాన్యతనిస్తాము. మేము అభివృద్ధి, దార్శనికత గురించే మాట్లాడతాము.

మీరు ముఖేష్‌ సహానీని ఉపముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించారు. ముస్లిం డిప్యూటీ సిఎం గురిం ఏమైనా చర్చిస్తున్నారా?
ఆరోజు విలేకరుల సమావేశంలో ముఖేష్‌జీ కాకుండా మరొక డిప్యూటీ సిఎం కూడా ఉంటారని నేను స్పష్టంగా చెప్పాను. సరైన సమయంలో రెండవ డిప్యూటీ సిఎం గురించి కూడా ప్రకటన చేస్తామని నేను అనుకుంటున్నాను.
ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత.. ఇప్పుడు మీపై మరిన్ని బాధ్యతలున్నాయని అనుకుంటున్నారా?
గతసారి కూడా నన్ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించారు. మోసం జరగకపోయి ఉంటే.. అప్పుడే ముఖ్యమంత్రి అయ్యేవాడిని. మేము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేవాళ్లం. ఏదేమైనా.. ప్రస్తుత ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోవడం వల్ల ప్రజలు విసిగిపోయారు. మార్పు కావాలని కోరుకుంటున్నారు. 20 ఏళ్లుగా అధికారంలో ఉన్నా.. బీహార్‌ పేదరిక రాష్ట్రంగానే ఉంది. వలసలు, నిరుద్యోగం పెరిగిపోయాయి. తలసరి ఆదాయం చాలా తక్కువగా ఉంది. ఇక్కడ పరిశ్రమలు లేవు. పెట్టుబడులు లేవు. దీంతో ప్రజలు మార్పును కోరుకుటున్నారు.

ప్రశాంత్‌ కిషోర్‌ నేతృత్వంలోని జన సురాజ్‌ పార్టీని మీరు సవాల్‌గా భావిస్తున్నారా?
నాకు ఉన్న ఏకైక సవాలు నిరుద్యోగాన్ని నిర్మూలించడం. ప్రస్తుతం దీనితో నేను బిజీగా ఉన్నాను. చాలా రాజకీయ పార్టీలు వస్తుంటాయి.. పోతుంటాయి. నేను అలాంటి పార్టీలను పట్టించుకోను. బీహార్‌ను నెంబర్‌ వన్‌ రాష్ట్రంగా మార్చాలని మాత్రమే నేను కోరుకుంటున్నాను.

చాలా స్థానాల్లో మహాగట్బంధన్‌ దాని మిత్రపక్ష పార్టీల మధ్యే పోటీ ఉంది? దీనిపై మీరేమంటారు?
ఇది వ్యూహాత్మకంగా జరిగింది. జార్ఖండ్‌లో కూడా ఇదే చేశాము. అక్కడ మేము సీట్లు గెలుచుకున్నాము.

బీహార్‌లో మార్పు తీసుకురావడం గురించి మీరు మాట్లాడుతున్నారు? మీకు ఎలాంటి మార్పు కావాలి?
బీహార్‌ ప్రజలెవరూ కూడా ఉద్యోగాలు, విద్య, మెరుగైన వైద్యం కోసం వేరే రాష్ట్రాలకు వెళ్లాల్సిన అవసరం లేదు. బీహార్‌లోనే అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉండాలి. అన్ని మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉండాలి. బీహార్‌ను ఐటి హబ్‌గా మార్చాలని, ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లు, వ్యవసాయ ఆధారిత పరిశ్రమలను ఏర్పాటు చేయాలని నేను కోరుకుంటున్నాను.

ప్రతి కుటుంబం నుంచి ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని మీరు హామీ ఇచ్చారు. దీని సాధ్యాసాధ్యాలపై అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి దీనిపై మీ అభిప్రాయం?
ప్రజలు ప్రశ్నలను లేవనెత్తనీయండి. నా పని నేను చేసుకుంటూనే ఉంటాను. ప్రజలకు ఉద్యోగాలు వచ్చినప్పుడు ప్రశ్నించిన వారిని అప్పుడు నేనడుగుతాను. నేను అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తాను.

బీహార్‌లో ఎస్‌ఐఆర్‌ నిర్వహించడం జరిగింది. దీని ప్రభావం ఎన్నికలపై పడుతుందా?
ఈ విషయంలో సుప్రీంకోర్టు తీసుకున్న నిర్ణయాలకు నేను కృతజ్ఞత తెలుపుతున్నాను. సుప్రీంకోర్టు మా డిమాండ్లను నెరవేర్చింది. ఎస్‌ఐఆర్‌ నిర్వహణలో పారదర్శకత గురించి కానీ.. ఆధార్‌ లింక్‌ గురించి కానీ అనేకసార్లు ఎన్నికల కమిషన్‌ను సుప్రీంకోర్టు మందలించింది. దీనివల్ల మనందరికీ ప్రయోజనం కలిగింది.

రాహుల్‌ గాంధీ, మీరు బెయిల్‌పై బయట ఉన్నారని ప్రధాని మోడీ అన్నారు కదా?
అవును. ప్రధానమంత్రి ఇడి, సిబిఐలను ఉపయోగించి ఎవరిపైనైనా కేసు నమోదు చేయాలనుకుంటే.. దానిని చేయగలరు. ఆ సమయంలో మేము బెయిల్‌ తీసుకోవాలి. అదే బిజెపిలో చేరితే.. ఎలాంటి మరకలు లేకుండా ఉంటారు. అవినీతి పరులను వారు ముఖ్యమంత్రులను చేస్తారు. మహారాష్ట్రనే చూడండి. వాళ్లకి తగినట్టుగా ప్రయోజనం దక్కింది. అవినీతిపరులే రాజా హరిశ్చంద్రులయ్యారు. అస్సాంనే చూడండి. అవినీతిపరుడినే ముఖ్యమంత్రిని చేశారు. ఎవరైనా బిజెపిలో చేరితో పాపాలన్నీ తొలగిపోతాయి. బిజెపిలోని అవినీతిపరులందరినీ పాలతో కడుగుతారు.

గత ఎన్నికల్లో చిరాగ్‌ పాశ్వాన్‌ ఒంటరిగా పోటీ చేశారు. ఇప్పుడేమో ఎన్‌డిఎలో భాగమయ్యారు?
ఈసారి ముఖేష్‌ సహానీ జీ మాతో ఉన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో చిరాగ్‌ పాశ్వాన్‌ ఎన్‌డిఎకే కాదు.. మహాగ్టబంధన్‌కు కూడా నష్టం కలిగించారు.

మై (ముస్లింలు – యాదవులు) మీ ప్రధాన ఓటు బ్యాంకు. కానీ మీరు ఆ ఓటు బ్యాంకును కాదనుకుంటున్నట్లు కనిపిస్తోంది?
నేను అందరినీ నా ఓటు బ్యాంకుగానే భావిస్తాను. నేను అందరినీ కలుపుకుంటూ వెళ్లాలనుకుంటున్నాను. అందరితో కలిపి కొత్త బీహార్‌ను నిర్మించాలనుకుంటున్నాను.

మీ అన్నయ్య తేజ్‌ ప్రతాప్‌ యాదవ్‌ ఆర్‌జెడి అభ్యర్థిపై పోటీ చేస్తున్నారు? మీరు అతనికేం చెబుతారు?
ప్రజాస్వామంయలో ప్రతి ఒక్కరికీ ఎన్నికల్లో పోటీ చేసే హక్కు ఉంది. బీహార్‌ ప్రజలు మా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నారు. దీంతో ఆయన మహాగట్బంధన్‌పై ఎటువంటి ప్రభావం చూపరు.

నితీష్‌ కుమార్‌తో ఎన్నికల తర్వాత పొత్తు కుదుర్చుకునే అవకాశం ఉందా?
అలాంటిదేమీ లేదు. మేము అలాంటి పుకార్లను నమ్మము. ఎన్నికల తర్వాత జెడియు పార్టీనే ఉండదు. ఒకవేళ ఆ పార్టీ టికెట్‌పై గెలిచివారు కొందరు బిజెపిలోకి… కొందరు ఆర్‌జెడిలోకి చేరతారు.

నితీష్‌కుమార్‌ను బిజెపి మళ్లీ ముఖ్యమంత్రిని చెయ్యదని మీరెలా అనుకుంటున్నారు?
బిజెపి మాస్క్‌ వేసుకుంది. అమిత్‌షానే మొత్తం పరిపాలనను నియంత్రిస్తున్నారు. డిజిపి నుంచి చీఫ్‌ సెక్రటరీ వరకు అందరూ ఆయనకే చెబుతున్నారు. గతంలో ఎప్పుడూ ఇలా జరగలేదు. ఎస్‌పిలతో వారే సమీక్షలు నిర్వహిస్తున్నారు. గతంలో నితీష్‌ అధికారంలో ఉన్నా.. ఎప్పుడూ ఇలా జరగలేదు.

నితీష్‌కుమార్‌ మిమ్మల్ని బచ్చా అంటారు?
అవును. అతనికి నేను బచ్చానే. కానీ రాజ్యాంగబద్దంగా పెద్దవాడిని. ఇప్పుడు తండ్రిని కూడా.

మీరు బిజెపినే విమర్శిస్తుంటారు.. నితీష్‌కుమార్‌ను విమర్శించరు ఎందుకలా?
నాకు ఆయనపట్ల సానుభూతి ఉంది. ప్రస్తుతం ఆయన అలాంటి స్థితిలో ఉన్నారు. ఆయన గురించి మాట్లాడడం నాకు పెద్దగా ఇష్టం లేదు. బిజెపి నేతలు ఆయన్ని నాశనం చేశారు. బిజెపి నేతలే కాదు.. ఆయన పార్టీలో బిజెపి మైండ్‌సెట్‌ ఉన్న రిటైర్ట్‌ అధికారులు కూడా ఆయనకు ఎక్కువ నష్టాన్ని కలిగించారు.

గతంలో మతతత్వ శక్తులను దూరంగా ఉంచాలనే నితీష్‌ కుమార్‌ ప్రతిపాదనను మీరు అంగీకరించారు. మళ్లీ అలానే జరిగితే.. మీరు ఆయన్ని కలుపుకుంటారా?
నితీష్‌ జీ పార్టీ ఉనికిలోనే ఉండదు. మా భావజాలాన్ని నమ్మేవారు ఆర్జేడీలో చేరతారు. వారి భావజాలాన్ని నమ్మేవారు బిజెపిలో చేరతారు.

గత అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే కాంగ్రెస్‌ పనితీరు ఎలా ఉంది?
గతం కంటే ఇప్పుడు కాంగ్రెస్‌ పనితీరు మెరుగ్గానే ఉంది. ఈసారి ఎక్కువ సీట్లలో గెలిచే అవకాశం ఉంది. ఎందుకంటే గెలిచే అభ్యర్థులనే పోటీలో నిలిపింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -