Wednesday, September 3, 2025
E-PAPER
spot_img
Homeజాతీయంమేం ఆదేశించొచ్చు

మేం ఆదేశించొచ్చు

- Advertisement -

– కాలపరిమితిలోపు నిర్ణయం తీసుకోవాలంటే తప్పేముంది?
– బిల్లుల ఆమోదంలో గవర్నర్‌, రాష్ట్రపతి జాప్యంపై సుప్రీంకోర్టు వ్యాఖ్య


నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
కాలపరిమితి లోపు నిర్ణయం తీసుకోవాలని కోర్టులు ఆదేశించవచ్చని అత్యున్నత న్యాయస్థానం పేర్కొంది. రాష్ట్ర అసెంబ్లీ ఆమోదించిన బిల్లులను క్లియర్‌ చేయడంలో గవర్నర్‌, రాష్ట్రపతి జాప్యంపై తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ ఆరో రోజైన మంగళవారం కూడా కొనసాగింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ బీఆర్‌ గవాయ్‌, జస్టిస్‌ సూర్యకాంత్‌, జస్టిస్‌ విక్రమ్‌నాథ్‌, జస్టిస్‌ పిఎస్‌ నరసింహ, జస్టిస్‌ ఎఎస్‌ చందూర్కర్‌లతో కూడిన ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం విచారణ జరిపింది. తమిళనాడు రాష్ట్రం తరఫున సీనియర్‌ న్యాయవాది అభిషేక్‌ మను సింఘ్వీ తమిళనాడు గవర్నర్‌ కేసులో ఇద్దరు న్యాయమూర్తుల ధర్మాసనం నిర్ణయించిన మూడు నెలల కాలపరిమితిని సమర్థిస్తూ వాదనలు వినిపించారు. గవర్నర్లు బిల్లులను నిరవధికంగా నిలిపివేసిన సందర్భాలు పదేపదే జరుగుతున్నాయనీ, నిర్ణీత కాలపరిమితి అవసరమని వాదించారు. రాష్ట్రపతి, గవర్నర్‌ అధికారాలను వినియోగించడానికి ఆర్టికల్‌ 142 కింద స్ట్రెయిట్‌ జాకెట్‌ ఫార్ములాను రూపొందించగలమా? అని సీజేఐ గవారు ప్రశ్నించారు. దీనికి సింఘ్వీ స్పందిస్తూ ఐవరీ-టవర్‌ దృక్పథాన్ని తీసుకోవద్దని, భారీ జాప్యాన్ని పరిష్కరించాలని కోరారు. ఆర్టికల్‌ 200, 201 కింద అధికారాలను వినియోగించడానికి సాధారణ కాలక్రమం అవసరమని చెప్పారు. ఈ ఆర్టికల్స్‌లో ఎలాంటి కాలక్రమాన్ని పేర్కొనలేదనీ, సాధారణ కాలక్రమాన్ని నిర్దేశించడం ఆచరణాత్మకంగా రాజ్యాంగాన్ని సవరించడమే అవుతుందని జస్టిస్‌ విక్రమ్‌నాథ్‌ తెలిపారు. కాలక్రమాలను విధించడానికి రాజ్యాంగాన్ని సవరించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. అయితే గవర్నర్‌, రాష్ట్రపతి గడువును పాటించకపోవడం వల్ల కలిగే పరిణామాలపై ధర్మాసనం ప్రశ్నించింది. ముఖ్యంగా జస్టిస్‌ నరసింహ, జస్టిస్‌ విక్రమ్‌నాథ్‌ గవర్నర్‌, రాష్ట్రపతిని కోర్టు ధిక్కారానికి పాల్పడినందుకు అరెస్టు చేయవచ్చా? అని ప్రశ్నించారు. దీనికి సీనియర్‌ న్యాయవాది అభిషేక్‌ మను సింఘ్వీ బదులిస్తూ బిల్లులకు సమ్మతిగా భావించడమే పర్యవసానంగా ఉంటుందని అన్నారు. ఇటీవలి అనర్హత పిటిషన్లపై మూడు నెలల్లో నిర్ణయం తీసుకోవాలని తెలంగాణ స్పీకర్‌ను ఆదేశిస్తూ ఆ కేసుకు సంబంధించి నిర్దిష్ట ఆదేశాన్ని జారీ చేసిందని సీజేఐ బీఆర్‌ గవాయ్‌ గుర్తు చేశారు. అయితే స్పీకర్లందరూ అనర్హత పిటిషన్లను మూడు నెలల్లోగా నిర్ణయించాలని తాము ఆదేశించలేదని, ఇది కేసు వాస్తవాలు, పరిస్థితులకు ప్రత్యేకమైనదని అన్నారు. అయితే దీనికి సింఘ్వీ స్పందిస్తూ రాజీవ్‌గాంధీ హత్య కేసులో దోషుల శిక్ష మినహాయింపు దరఖాస్తులపై గవర్నర్‌ వ్యవహరించిన తీరు తరువాత, వారిని విడుదల చేయాలని కోర్టు ఆదేశించిన పెరారివలన్‌ కేసును గుర్తు చేశారు. దీనికి సీజేఐ గవాయ్‌ స్పందిస్తూ అవి వ్యక్తిగత విషయాలని, భిన్నమైన వాస్తవిక పరిగణనలు ఉండవచ్చని అన్నారు. అయితే గవర్నర్‌ బిల్లులపై చర్య తీసుకోనేందుకు నిరాకరించిన ప్రతిసారీ రాష్ట్రం కోర్టును ఆశ్రయించాల్సి వస్తే, అది ఆలస్యాన్ని పెంచుతుందని సింఘ్వి అన్నారు. కేసు టూ కేసు విధానం సమస్యను పరిష్కరించదని, ఆర్టికల్స్‌ 200, 201 సాధారణ కాలక్రమాన్ని తప్పనిసరి చేస్తాయని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిసారీ కోర్టుకు తిరిగి రావడం కోర్టు ఉద్దేశం కాకూడదని పేర్కొన్నారు. కాలక్రమాన్ని నిర్దేశించిన తరువాత, దాన్ని పాటించకపోతే ఏం చేయాలని జస్టిస్‌ నరసింహ అన్నారు. అందుకే సాధ్యమైనంత త్వరగా అని రాజ్యాంగంలో పేర్కొన్నారని తెలిపారు. గవర్నర్‌ సాధ్యమైనంత త్వరగా నిర్ణయం తీసుకోవాలని ఆర్టికల్‌ 200 పేర్కొందని, అది సరిపోదా? అని జస్టిస్‌ నరసింహ ప్రశ్నించారు. ఈ సాధారణ ఆదేశం సరిపోదని వివిధ రాష్ట్రాల్లో గవర్నర్లు బిల్లులు ఆమోదించని కేసులు స్పష్టం చేస్తున్నాయని సింఘ్వీ తెలిపారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad