Saturday, January 17, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలుభూములివ్వలేం..

భూములివ్వలేం..

- Advertisement -

విద్య ద్వారానే జీవితాల్లో మార్పు
నిరుద్యోగుల్ని బీఆర్‌ఎస్‌ మోసం చేసింది
వారి ఉద్యోగాలు పోతేనే.. మీకు ఉద్యోగాలొస్తున్నాయి
రెండేండ్లలో 70 వేల ఖాళీలు భర్తీ చేశాం
అశోక్‌ నగర్‌ నుంచి ఉస్మానియా వరకు అన్నీ తెలుసు
నిబద్ధతతో పని చేసి ప్రభుత్వానికి మంచి పేరు తేవాలి
గ్రూప్‌ 3 అభ్యర్థులకు నియామక పత్రాలు ఇచ్చిన సీఎం రేవంత్‌రెడ్డి


నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
ప్రజలకు పంచేందుకు భూముల్లేవనీ, విద్యను మాత్రమే అందించి వారి జీవితాల్లో మార్పు తీసుకొస్తామని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. పదేండ్ల పాలనలో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం నిరుద్యోగ యువతను మోసం చేసిందని తెలిపారు. వివిధ శాఖల్లో గ్రూప్‌ 3 ఉద్యోగాలకు ఎంపికైన 1,370 మందికి శుక్రవారం హైదరాబాద్‌లోని శిల్ప కళా వేదికలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన నియామక పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ పదేండ్లలో ఆ పార్టీ నేతలు సొంత లాభం చూసుకున్నారే తప్ప నిరుద్యోగులను పట్టించుకోలేదన్నారు. ఓయూ విద్యార్థులు ఉద్యమకారులై ప్రాణత్యాగాలు చేసి సాధించిన తెలంగాణలో వారొక్క కుటుంబమే బాగుపడిందని ఆరోపించారు. వారి ఉద్యోగాలు ఊడితే తమకు ఉద్యోగాలు వస్తాయని భావించిన యువత ప్రజా ప్రభుత్వాన్ని తెచ్చుకుందని అన్నారు. 14 ఏండ్ల పాటు గ్రూప్‌-1 ఖాళీలు భర్తీ చేయకపోవడమే ఇందుకు నిదర్శనమని పేర్కొన్నారు. ఒకట్రెండు నోటిఫికేషన్లు ఇచ్చినా పేపర్‌ లీక్‌లతో పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ విశ్వసనీయతను బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం దెబ్బతీసిందని వ్యాఖ్యానించారు.

తాము అధికారం చేపట్టిన తర్వాత టీజీపీఎస్‌సీని బలోపేతం చేసి విద్యావంతులను, నిష్ణాతులను సభ్యులుగా నియమించామని చెప్పారు. ఇటీవల గ్రూప్‌-1 నియామక పత్రాలు ఇచ్చే సమయంలో కూడా కోర్టుకు వెళ్లి కుట్రలు చేశారని ఆరోపించారు. అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదిలో 60 వేలు, రెండో ఏడాది 10 వేలు, మొత్తం రెండేండ్లలో 70 వేల ఉద్యోగ నియామక పత్రాలు అందించామని సీఎం తెలిపారు. ”కొత్తగా ఉద్యోగాలకు ఎంపికైన మీరు మీ తల్లిదండ్రుల కండ్లల్లో సంతోషం నింపాలి. పుట్టిన బిడ్డ ప్రయోజకుడైతే వారి ఆనందా నికి అవధులుండవు. ఉద్యోగాలు భర్తీ చేయడం మా బాధ్యత. కానీ మీకు జీవితకాల విజయం. ఉద్యోగం మీ కుటుంబంలో భవిష్యత్‌ తరాలకు దిక్సూచిగా మారుతుంది. కేవలం వేతనం తీసుకునేది మాత్రమే కాదని.. ఉద్యోగం భావోద్వేగం అని గుర్తుంచుకోండి. తెలంగాణ పునర్నిర్మాణంలో కలిసి రావాలి. అందరు కలిసికట్టుగా పని చేస్తే ప్రపంచంలో అగ్రగామిగా నిలుస్తాం. రాష్ట్ర ప్రభుత్వంలో 10.5 లక్షల మంది ఉద్యోగులు వివిధ దశల్లో ఉన్నారు. వారి అడుగు జాడల్లో నడిచి సర్కార్‌కు మంచి పేరు తేవాలి” అని సీఎం వారికి దిశా నిర్దేశం చేశారు.

విద్యతోనే అభివృద్ధి
ఏ దేశమైనా, ఏ సమాజమైనా విద్యతోనే అభివృద్ధి చెందుతుందని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. దేశ మొదటి ప్రధాని పండిట్‌ జవహార్‌ లాల్‌ నెహ్రూ మొదటి ప్రాధాన్యతగా విద్య, వ్యవసాయాన్ని తీసుకున్నారని గుర్తు చేశారు. దేశంలోని అన్ని యూనివర్సిటీలు, శ్రీశైలం, నాగార్జున సాగర్‌, ఎస్‌ఆర్‌ఎస్‌పీ లాంటి ప్రాజెక్ట్‌లను కాంగ్రెస్‌ ప్రభుత్వం నిర్మించిందని అన్నారు. అయితే నేడు విద్య, ఆహారం అందరికీ అందుతున్నా నాణ్యమైనది దొరకడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని 26 వేల ప్రభుత్వ పాఠశాలల్లో 26లక్షల మంది, 11 వేల ప్రయివేట్‌ పాఠశాలల్లో 33 లక్షల మంది విద్యార్థులు చదువుకుంటున్నారని అన్నారు. ఈ వ్యత్యాసం ఎందుకుంది? తల్లిదండ్రులు తమ పిల్లల్ని ఎందుకు ప్రయివేట్‌ స్కూళ్లలో చదివిస్తున్నారో ఆలోచించాలన్నారు.

వరి ఉత్పత్తిలో తెలంగాణ దేశంలోనే మొదటి స్థానంలో ఉన్నా మన పిల్లలకు నాణ్యమైన ఆహారాన్ని ఎందుకు అందించలేకపోతున్నామని ప్రశ్నించారు. ఈ క్రమంలో తమ సర్కార్‌ నాణ్యమైన విద్య, ఆహారాన్ని పిల్లలకు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నదని చెప్పారు. పిల్లలు తాము అభ్యసించిన విద్యలో నాణ్యత లేక పోతే అవకాశాలు కూడా దొరకవని హెచ్చరించారు. ”రాష్ట్రంలో ఏటా 1.10లక్షల మంది ఇంజినీరింగ్‌ పట్ట భద్రులు వస్తున్నా వారికి తగిన ఉద్యోగం రావడం లేదు. డిమాండ్‌ ఉంది. సరఫరా ఉంది. కాని స్కిల్స్‌ లేకపోవడమే కారణం. రేపటి రోజుల్లో స్కీల్స్‌ అభివృద్ధి చేయాలి. ఇవ్వడానికి భూముల్లేవు. కానీ విద్య ఒక్కటే మన జీవితాల్లో మార్పు తెస్తుంది. సీఎస్‌, డీజీపీ వరకు ఉద్యోగాలు అందరికి విద్య ద్వారానే వచ్చాయి. ప్రసుత్తం నియామక పత్రాలు అందుకుంటున్న 1,370 మందికి ఉద్యోగాలు విద్య వల్లనే వచ్చాయి. ఈ ప్రభుత్వానికి వారధులు, సారధులు మీరే. 2047 నాటికి దేశ ఆర్థిక వ్యవస్థను 30 ట్రిలియన్‌ డాలర్లకు తీసుకుపోవాలనేది కేంద్ర సర్కార్‌ లక్ష్యం.

అదే స్పూర్తితో తెలంగాణ ఎకానమిని 2047 నాటికి 3 ట్రిలియన్‌ డాలర్ల మార్క్‌కు చేర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. దేశ జనాభాలో 2.5 శాతంగా ఉన్న మనం 5 శాతం ఎకానమిని అందిస్తున్నాం. 2047 నాటికి 10 శాతం అందించాలనేదే లక్ష్యం. ఈ లక్ష్య సాధనలో మీరందరూ నిబద్ధతతో పని చేయండి. విధుల్లో చేరిన రోజు ఎంత నిబద్ధతతో పని చేశారో.. అదే నిబద్ధతతో రిటైర్మెంట్‌ వరకూ పని చేయాలి” అని సీఎం రేవంత్‌ రెడ్డి వారికి సూచించారు. కొత్తగా ఉద్యోగంలో చేరిన వారు తమ తల్లిదండ్రులను గౌరవంగా చూసుకోవాలని విజ్ఞప్తి చేశారు. నిర్లక్ష్యం చేసిన వారి జీతంలోంచి 15 శాతం కోత విధించి తల్లిదండ్రుల ఖాతాల్లో జమ చేస్తామని చెప్పారు. ”అశోక్‌నగర్‌ నుంచి ఉస్మానియా యూనివర్సిటీ వరకు ఏం జరుగుతుందో నాకు అవగాహన ఉంది. రాబోయే రోజుల్లో అన్ని ఉద్యోగాలను భర్తీ చేస్తాం. ప్రయివేట్‌లో సైతం భారీ పెట్టుబడులు తెచ్చి ఉద్యోగాలు కల్పిస్తాం” అని సీఎం నిరుద్యోగులకు భరోసా ఇచ్చారు.

మా పని తీరుకు నిదర్శనం: పొన్నం
గత రెండేండ్లలో 70 వేల ఉద్యోగాలు భర్తీ చేయడమే తమ సర్కార్‌ పని తీరుకు నిదర్శనమని మంత్రి పొన్నం పేర్కొన్నారు. ”బీఆర్‌ఎస్‌ పదేండ్ల పాలనలో నియామకాలు ఆగిపోయాయి. కానీ మా సర్కార్‌ ఖాళీలను వెంట వెంటనే గుర్తించి వాటిని భర్తీ చేస్తోంది. పదేండ్లలో ఆర్టీసీలో ఒక్క ఉద్యోగ నోటిఫికేషన్‌ రాలేదు. కానీ నేడు మేం 3,500 ఉద్యోగాలు భర్తీ చేసేందుకు నోటిఫికేషన్‌ ఇచ్చాం” అని పొన్నం అన్నారు.

నిబద్ధతతో పని చేయండి : సీఎస్‌
‘ఉద్యోగం కోసం ఎంత కష్టపడ్డారో మీ తల్లిదండ్రులకు తెలుసనీ, దాన్ని గుర్తుంచుకుని ముందుకు సాగాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు అన్నారు. ”ఈ పోటీలో 5.5లక్షల మంది దరఖాస్తు చేసుకుంటే 2.5లక్షల మంది రాశారు. అందులో 1,370 మంది సర్టిఫికెట్లను అందుకుంటున్నారు. మీరు సాధించిన విజయం వ్యక్తిగతం. కాని నేటి నుంచి ప్రజల కోసం అని గుర్తుంచుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజలకు చేరువ చేయడంలో కీలక పాత్ర పోషించాలి” అని సీఎస్‌ సూచించారు. ప్రభుత్వ ఫలాలు సమాజంలోని చిట్ట చివరి వరకు అందేలా సేవలందించాలని కోరారు. నిబద్ధతతో పని చేసి తెలంగాణ రైజింగ్‌లో భాగస్వామ్యం కావాలని అన్నారు. ఈ సందర్భంగా ఉద్యోగ నియామక పత్రాలు అందుకున్న వారితో సీఎస్‌ ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం పలువురు అభ్యర్థులకు నియామక పత్రాలను సీఎం అందజేశారు. ఈ కార్యక్రమంలో మైనార్టీ శాఖ మంత్రి అజారుద్దీన్‌, ప్రభుత్వ సలహాదారులు వేంనరేందర్‌రెడ్డి, హర్కార్‌ వేణుగోపాల్‌ ఎంపీలు బలరాం నాయక్‌, అనిల్‌కుమార్‌ యాదవ్‌ తదితరులు పాల్గొన్నారు

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -