హైకోర్టు ఉత్తర్వులు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ) వార్డుల డీలిమిటేషన్, కొత్త డివిజన్ల ఏర్పాటులో జోక్యం చేసుకోబోమని జస్టిస్ బి విజయ్ సేన్‌రెడ్డి చెప్పారు. వార్డులు, వాటి మ్యాప్‌లను అధికారిక వెబ్‌సైట్‌లో పెట్టాలన్న తమ ఉత్తర్వులను డివిజన్ బెంచ్ కోర్టుకు వచ్చినా రెండు వార్డులకే పరిమితం చేసిందని గుర్తు చేశారు. ఆర్టికల్ 243 జెడ్‌జి అధికరణ కింద ఎన్నికల ప్రక్రియ మొదలైన తర్వాత జోక్యానికి వీల్లేదన్న ఏజీ వాదనల తర్వాత పై విధంగా చెప్పారు. వార్డుల డీలిమిటేషన్, కొత్త వార్డుల ఏర్పాటు ప్రక్రియపై అత్యవసరంగా విచారణ చేయాలంటూ సోమవారం 80 లంచ్‌మోషన్ పిటిషన్లను న్యాయమూర్తి విచారించారు. వారంలోగా సమర్పించిన అభ్యంతరాలను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకున్నందున తమ ముందున్న పిటిషన్లల్లో జోక్యం చేసుకోవడం లేదని చెప్పారు.
గీతం వర్సిటీకి నిరాశ
విద్యుత్ బిల్లుల బకాయి రూ.118 కోట్లు ఉన్న హైదరాబాద్ గీతం యూనివర్సిటీకి సోమవారం హైకోర్టులో నిరాశే ఎదురైంది. విద్యుత్ బకాయి చెల్లించకపోవడంతో ఆ శాఖ అధికారులు విద్యుత్ సరఫరాను నిలిపేశారు. విద్యుత్ బకాయిలు చెల్లించాలన్న విద్యుత్ శాఖ నోటీసును, విద్యుత్ సరఫరాను నిలిపేయడాన్ని సవాల్ చేసిన వాటిలో జోక్యం చేసుకునేందుకు న్యాయమూర్తి నిరాకరించారు. విద్యుత్ బకాయిల్లో 50 శాతం చెల్లిస్తేనే పునరుద్ధరణకు ఆదేశాలి స్తామని చెప్పారు. గతంలో ఆదేశించిన మేరకు విద్యుత్ శాఖ ఎస్‌ఈ సోమవారం విచారణకు హాజరయ్యారు.
విద్యుత్ సరఫరాను పునరుద్ధరించాలని గీతం వర్సిటీ అత్యవసరంగా మధ్యంతర పిటిషన్‌లో ఉత్తర్వుల జారీకి జస్టిస్ నగేశ్ భీమపాక నిరాకరించారు. వీబీసీ ఫెర్రో ఎల్లాయిస్ కంపెనీకి యూనివర్సిటీకి సంబంధం లేదనీ, విద్యుత్ బకాయిల బాధ్యత వీబీసీ ఫెర్రో ఎల్లాయిస్ కంపెనీకే సంబంధమని యూనివర్సిటీ లాయర్ వాదించారు. కోర్టుకు వచ్చిన యూనివర్సిటికీ మధ్యంతర స్టే ఆదేశాలు జారీ కానందున విద్యుత్ సరఫరా ఆపేసినట్టు వివరించారు. వీబీసీ ఫెర్రో ఎల్లాయిస్ కంపెనీ కూడా గీతం వర్సిటీదేనని ఆ వర్సిటీని ఉద్దేశించి న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. సగం ‘బకాయి చెల్లిస్తేనే విద్యుత్ సరఫరా జరిగేలా ఆదేశాలిస్తాం’అని అన్నారు. విచారణ ఈ నెల 24వ తేదీకి వాయిదా వేశారు.
మళ్లీ వినతిపత్రం ఇవ్వండి
శంషాబాద్ ఎయిర్‌పోర్టు నిమిత్తం సేకరించిన భూమూల్లో 97 ఎకరాలు అన్యాక్రాంతం అవుతుంటే అధికారులు పట్టించుకోవడం లేదనే పిల్‌ను సోమవారం హైకోర్టు విచారించింది. పూర్తి వివరాలతో రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌కు తిరిగి వినతిపత్రం ఇవ్వాలని పిటిషనర్‌ను ఆదేశించింది. ఇప్పటికే పిటిషనర్ కలెక్టర్‌కు సమర్పించిన వినతి పత్రంలో వివరాలు అసమగ్రంగా ఉన్నాయని తెలిపింది. భూ ఆక్రమణ చట్టం-1905 ప్రకారం కలెక్టర్‌కు నాలుగు వారాల్లో వినతిపత్రం ఇవ్వాలని సూచించింది. దీనిపై కలెక్టర్ చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని కోరింది. వర్టెక్స్ డెవలపర్స్ ఎల్‌ఎఫ్‌పీ అనే నిర్మాణ సంస్థ హెచ్‌ఎండీఏ నుంచి నిర్మాణాలకు అనుమతులు పొందిందంటూ తుక్కు గూడకు చెందిన కె కృష్ణ వేసిన పిల్‌ను చీఫ్ జస్టిస్ ఏకే సింగ్, జస్టిస్ మొహియుద్దీన్ బెంచ్ విచారణను క్లోజ్ చేసింది.
జీహెచ్‌ఎంసీ వార్డుల విభజనలో జోక్యం చేసుకోలేం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



