అపరిచితుడిలా ఆయన మాటలు
కేరళంలో విద్యారంగానికి 24 శాతం నిధులు..తెలంగాణలో 8 శాతమే
రాష్ట్రంలో వైద్యం వ్యాపారమయం… కేరళంలో అందుబాటులో వైద్యం
కడు పేదలు లేని తెలంగాణను తీర్చిదిద్దడం మీకు సాధ్యమా? : సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
కేరళం పర్యటనలో కేరళం సీఎం పినరయి విజయన్‌కు ఓటేస్తే మోడీకి ఓటేసినట్టేననీ, అది మోడీ బ్రదర్స్ విజయమవుతుందని మన రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి మాట్లాడటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్టు సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ ప్రకటించారు. ఒకనాడు తెలంగాణకు ప్రధాని మోడీ వస్తే పెద్దన్న అని పొగిడి, ఇప్పుడు విజయన్, మోడీ బ్రదర్స్ అని మతిభ్రమించి అపరిచితుడిలా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. బుధవారం ఈ మేరకు జాన్‌వెస్లీ ఒక ప్రకటన విడుదల చేశారు. దేశంలోనే తెలంగాణ ఫస్ట్ అనీ, కేరళంలోనూ యూడీఎఫ్‌ను గెలిపించాలనటం విడ్డూరంగా ఉందని విమర్శించారు. కేరళంలో ఎల్‌డీఎఫ్ ప్రభుత్వం విద్యారంగానికి 24 శాతం నిధులు కేటాయిస్తుంటే తెలంగాణలో 8 శాతం కూడా కేటాయించలేదని ఎత్తిచూపారు. కేరళంలో ప్రజలకు ఉచిత వైద్యం అందిస్తుంటే తెలంగాణలో వైద్యాన్ని వ్యాపారమయం చేశారని విమర్శించారు. పేదల ప్రాణాలు గాల్లో పోతున్నా పట్టించుకునేవారే లేరన్నారు.
‘ఇచ్చిన హామీ మేరకు ఉద్యోగాల భర్తీ చేయలేదు. మహిళలకు రూ.2500 ఇవ్వలేదు. వ్యవసాయ కూలీలకు రూ.12 వేలు, కౌలు రైతులకు రూ.15 వేలు ఇవ్వలేదు. పేదలకు ఇంకా ఇండ్లు కట్టివ్వలేదు. ఇవన్నీ అమలు చేయనప్పుడు దేశంలోనే తెలంగాణ ఎలా ఫస్ట్ అవుతుంది’ అని సూటిగా ప్రశ్నించారు. కడు పేదలు లేని రాష్ట్రంగా కేరళంను తీర్చిదిద్దడం ఎల్‌డీఎఫ్ ప్రభుత్వంతోనే సాధ్యమైందని స్పష్టం చేశారు. ఒక్క కాంగ్రెస్ పాలిత రాష్ట్రంలోగానీ, బీజేపీ పాలిత రాష్ట్రంలోగానీ కడుపేదలు లేరని ఎందుకు ప్రకటించలేదు? అని నిలదీశారు. అందరూ అక్షరాస్యులుగా మారటానికి, ఉపాధి అవకాశాలు కలగడానికి ఎల్‌డీఎఫ్ ప్రభుత్వం చేసిన కృషిని ఎవ్వరూ కాదనలేరని పేర్కొన్నారు. కేరళం ప్రజలు విజ్ఞానవంతులనీ, అందరూ ఆలోచించి యూడీఎఫ్ కూటమికి తగిన బుద్ధి చెబుతారని తెలిపారు. మతసామరస్యాన్ని కాపాడటంలో, సామాజిక న్యాయం పాటించడంలో, సంక్షేమ పథకాల అమలులో, దోపిడీ వర్గాలకు వ్యతిరేకంగా కొట్లాడటంలో, విద్యావైద్యం అందుబాటులో ఉంచడంలో దేశంలోనే కేరళం మొదటి వరుసలో ఉందనీ, ఆ రాష్ట్ర ప్రజలు మళ్లీ ఎల్‌డీఎఫ్‌కే పట్టం కడతారని ఆశాభావం వ్యక్తం చేశారు.
విజయన్‌పై రేవంత్‌రెడ్డి వ్యాఖ్యల్ని ఖండిస్తున్నాం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



