ఇచ్చిన హామీలను ఈ బడ్జెట్ సమావేశాల్లోనే నెరవేర్చాలి : సీపీఐ(ఎం)
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ఆశావర్కర్లు నిర్వహించిన చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని అడ్డుకోవడాన్ని, నాయకులను నిర్బంధించడాన్ని, అరెస్టులు చేయడాన్ని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ తీవ్రంగా ఖండించారు. వారికిచ్చిన హామీలను ఈ బడ్జెట్ సమావేశాల్లో నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు శనివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. వేతనాలు పెంచి ఉద్యోగ భద్రత కల్పిస్తామని ఆశావర్కర్లకు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను గుర్తుచేశారు. ఆ పార్టీ అధికారంలోకి వచ్చి రెండేండ్లు అవుతున్నా పట్టించుకోకపోవడాన్ని నిరసిస్తూ శాంతియుతంగా ఆశాలు ధర్నా నిర్వహిస్తుంటే పోలీసులు దౌర్జన్యంగా మహిళలను కొట్టడం, గాయపర్చడం అమానవీయమని పేర్కొన్నారు.
గత బీఆర్‌ఎస్, నేటి కాంగ్రెస్ ప్రభుత్వాలు ఆశాలకు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా నిర్లక్ష్యం చేస్తున్నాయని విమర్శించారు. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం తన నిర్లక్ష్య వైఖరిని విడనాడి, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ఆశాలకు ఫిక్స్డ్ వేతనం రూ. 18 వేలు నిర్ణయించాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం పెంచిన రూ.1500 పారితోషికాన్ని అమలు చేయాలనీ, ఇతర సమస్యల పరిష్కారం కోసం సరిపడా నిధులు కేటాయించాలని కోరారు. మార్చి 30న రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో హైవే రహదారులపై ఆశాలు నిర్వహించే రాస్తారోకో కార్యక్రమానికి తమ పార్టీ మద్దతు ఉంటుందని ప్రకటించారు.



