Thursday, January 8, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంవెనిజులాపై అమెరికా దాడిని ఖండిస్తున్నాం

వెనిజులాపై అమెరికా దాడిని ఖండిస్తున్నాం

- Advertisement -

సీఐటీయూ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు చుక్క రాములు, పాలడుగు భాస్కర్‌
రాష్ట్రవ్యాప్తంగా సీఐటీయూ ఆధ్వర్యంలో నిరసనలు


నవతెలంగాణ – ముషీరాబాద్‌
వెనిజులాపై అమెరికా సామ్రాజ్యవాద దురహంకారంతో దాడి చేసి ఆ దేశాధ్యక్షులు మదురోను, అతని భార్యను అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షప్రధాన కార్యదర్శులు చుక్క రాములు, పాలడుగు భాస్కర్‌ అన్నారు. వెనిజులాకు సంఘీభావంగా, అమెరికా దాడికి వ్యతిరేకంగా సోమవారం రాష్ట్రవ్యాప్తంగా పలు చోట్ల సీఐటీయూ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపట్టారు. సీఐటీయూ గ్రేటర్‌ హైదరాబాద్‌ సెంట్రల్‌ సిటీ కమిటీ ఆధ్వర్యంలో నగరంలోని గోల్కొండ చౌరస్తాలో జరిగిన కార్యక్రమంలో చుక్క రాములు పాల్గొని మాట్లాడారు. అమెరికా సామ్రాజ్యవాద కాంక్షతో ఒక స్వతంత్ర దేశమైన వెనిజులాపై దాడి చేయడమే కాకుండా ఆ దేశాధ్యక్షున్ని కిడ్నాప్‌ చేయడం అమెరికా నిరంకుశ ధోరణికి పరాకాష్టని తెలిపారు. కిడ్నాప్‌ చేయడమే కాకుండా ఆ దేశంలో సామాన్య ప్రజల మీద బాంబులు వేయడంతో అనేకమంది ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. ఈ ఘటనపై భారతదేశ ప్రధాని మోడీ ఇప్పటివరకు స్పందించకపోవడంపై బీజేపీ ప్రభుత్వం ట్రంప్‌ ప్రభుత్వానికి లొంగుబాటు ధోరణిని సూచిస్తోందన్నారు.

సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాడి స్వాతంత్య్రం సాధించిన భారతదేశం, గతంలో యుద్ధాలకు వ్యతిరేకంగా నిలిచిన వారసత్వాన్ని కొనసాగిస్తూ అమెరికా దుశ్చర్యను ఖండించాల్సిన అవసరం ఉందన్నారు. అలా చేయకుంటే.. మనదేశం మీదికి సైతం అమెరికా వస్తే మనకు సహకరించే వాళ్లు ఉండరన్నారు. కేవలం వెనిజులాలో ఉన్న చమురు నిల్వలపై ఆధిపత్యం కోసమే ఈ దాడి జరిగిందని తెలిపారు. అమెరికా ఆరోపణలను అంతర్జాతీయ న్యాయస్థానాల ముందు నిరూపించాల్సి ఉందన్నారు. వెనిజులా అధ్యక్షులు మదురోను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ గ్రేటర్‌ హైదరాబాద్‌ సెంట్రల్‌ సిటీ కమిటీ అధ్యక్షులు ఎం.దశరథ్‌, కార్యదర్శి జె.కుమారస్వామి, నగర ఉపాధ్యక్షలు సి.మల్లేష్‌, టి.మహేందర్‌, జి.రాములు, నగర సహాయ కార్యదర్శి జి.నరేష్‌, నాయకులు జి.కిరణ్‌, ఆర్‌.అశోక్‌, పి.మల్లేష్‌, వికలాంగుల హక్కుల వేదిక నాయకులు ఆర్‌.వెంకటేష్‌ పాల్గొన్నారు.

అమెరికా సామ్రాజ్యవాద దాడులను వ్యతిరేకించాలి
జిల్లాల్లోనూ ప్రజాసంఘాల ఆధ్వర్యంలో నిరసనలు

వెనిజులాపై అమెరికా నావిక, వైమానిక దళాలతో బాంబుల దాడి చేయడంతోపాటు ఆ దేశ అధ్యక్షులు మదురో, అతని భార్యను అమెరికాకు తరలించి, నిర్బంధించడాన్ని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు ఎన్‌. బిక్షపతి తీవ్రంగా ఖండించారు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో సీఐటీయూ ఆధ్వర్యంలో ప్లకార్డులు పట్టుకుని నిరసన తెలిపారు. అమెరికన్‌ సామ్రాజ్యవాద దాడులను వ్యతిరేకించాలని సీఐటీయూ జోగులాంబ గద్వాల జిల్లా అధ్యక్షులు ఉప్పేర్‌ నరసింహ కార్మికవర్గానికి పిలుపునిచ్చారు.

జిల్లా కేంద్రంలోని స్థానిక పాత బస్టాండ్‌లో నిరసన తెలిపారు. వికారాబాద్‌ జిల్లా వికారాబాద్‌ మండల పరిధిలోని సిద్దులూరు గ్రామంలో నిరసన చేపట్టారు. నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో రైతు సంఘం జిల్లా అధ్యక్షులు వీరేపల్లి వెంకటేశ్వర్లు, సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి డాక్టర్‌ మల్లు గౌతమ్‌రెడ్డి ఆధ్వర్యంలో సాగర్‌ రోడ్డులోని అంబేద్కర్‌ చౌరస్తా వద్ద నల్లజెండాలు పట్టుకుని నిరసన ప్రదర్శన నిర్వహించారు. మంచిర్యాల జిల్లా జన్నారంలోని పొన్కల్‌లో వ్యవసాయ కార్మిక సంఘం, రైతు సంఘం, సీఐటీయూ ఆధ్వర్యంలో నల్లజెండాలు పట్టుకుని నిరసన వ్యక్తం చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -