– 1నుంచి 3 తేదీల వరకు పత్తి టారిఫ్ మినహాయింపు
నోటిఫికేషన్లను దహనం చేయండి : అన్ని శాఖలకు ఏఐకేఎస్ విజ్ఞప్తి
న్యూఢిల్లీ : అమెరికాకు జౌళి ఎగుమతుల సాకుతో 60 లక్షల మంది పత్తి రైతులను కార్పొరేట్లు లూటీ చేయడానికి మోడీ ప్రభుత్వం అనుమతిస్తోందని అఖిల భారత కిసాన్ సభ విమర్శించింది. ఈ పరిస్థితుల్లో ఎస్కేఎం పిలుపిచ్చినట్టుగా సెప్టెంబరు 1-3 తేదీల్లో గ్రామాల్లో పత్తి టారిఫ్ మినహాయింపు నోటిఫికేషన్లను దహనం చేయాల్సిందిగా ఏఐకేఎస్ విజ్ఞప్తి చేసింది. అలాగే పత్తి పండే ప్రాంతాల్లో పార్లమెంట్ సభ్యుల కార్యా లయాలకు ప్రదర్శనలు నిర్వహించాల్సిందిగా కూడా కోరింది.
పత్తి దిగుమతులకు డిసెంబరు 31వరకు సుంకాల మినహాయింపును ఆర్థిక శాఖ పొడిగించింది.ఈ మేరకు ఆగస్టు 28న ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తంగా దేశ జౌళి ఎగుమతుల్లో కేవలం ఆరు శాతం మాత్రమే అమెరికాకు ఎగుమతి అవుతాయి.
మొత్తంగా జౌళి పరిశ్రమ విలువతో పోల్చుకుంటే 10.5శాతం కన్నా తక్కువగానే వుంటుంది. గతేడాదిలో దేశంలో జౌళి, దుస్తుల పరిశ్రమ మార్కెట్ విలువ రూ.15,13,850కోట్లు కాగా, అందులో రూ.12,34,400 కోట్ల వ్యాపారం దేశీయ మార్కెట్ నుండే వచ్చింది. ఎగుమతి మార్కెట్ విలువ కేవలం రూ.3,21,900 కోట్లుగా వుంది. దాంట్లో మళ్లీ అమెరికా ఎగుమతులు గతేడాది కేవలం రూ.20,984 కోట్లు మాత్రమే. అయినా భారత్‌పై అమెరికా 50శాతం టారిఫ్‌లు విధించిన కారణంగా జౌళి ఎగుమతి రంగంలో సంక్షోభం నెలకొందన్న సాకుతో మోడీ ప్రభుత్వం పత్తి దేశీయ ధరలను తగ్గించేందుకు గానూ దిగుమతులపై జీరో శాతం టారిఫ్‌తో కార్పొరేట్ కంపెనీల గుత్తాధిపత్యానికి అనుమతించింది. దీనివల్ల 60లక్షల మంది పత్తి రైతులు దోపిడీకి గురవుతారని ఏఐకేఎస్ విమర్శించింది. వారు ఇప్పటికే తీవ్రమైన దుస్థితిని ఎదుర్కొంటూ ఆత్మహ త్యలకు పాల్పడుతున్నారని పేర్కొంది. ఈ మేరకు ఏఐకేఎస్ అధ్యక్షుడు అశోక్ ధావలె, ప్రధాన కార్యదర్శి విజ్జూ కృష్ణన్‌లు ఒక ప్రకటన విడుదల చేశారు. అమెరికా ఎగుమతుల్లో 6శాతం అంతరాన్ని తట్టుకుని నిలబడే సామర్ధ్యం భారత దేశీయ ఆర్థిక వ్యవస్థకు వుంది. ఈ ఎగుమతి సంక్షోభాన్ని అధిగమించేందుకు అన్వేషించే మార్గాల్లో ప్రజల కొనుగోలు శక్తిని పెంచడం కూడా ఒక అవకాశం.
ఈ దిశగా రైతులకు ప్రోత్సాహక ధరలు, కార్మికులకు కనీస వేతనాలు ఇచ్చేలా అవసరమైన విధానాలు రూపొందించడం అవస రం. ఆ విధానాలు క్రియాశీలమైన దేశీయ మార్కెట్‌కు, అలాగే ప్రపంచ మార్కెట్‌లో పోటీ పడేందుకు చాలా అవసరం. చిన్న, మధ్య తరహా సంస్థ లకు పత్తిని చవకగా, సబ్సిడీరేట్లకు సరఫరా చేసి దేశీయ వాణిజ్యాన్ని పెంచ డంతో పాటూ ఎగుమతి మార్కెట్‌లో పోటీ పడేలా చేయడాల్సిన అవసరం వుంది. కాని దానికి బదులుగా, కార్పొరేట్ కంపెనీలు జౌళి రంగం పెంపు పేరుతో, లాభార్జనే ధ్యేయంగా చవక దిగుమతులను అనుమతిస్తూ పత్తి రైతులను దెబ్బ తీస్తున్నాయని ఏఐకేఎస్ విమర్శించింది. ఈ పరిస్థితుల్లో రైతులు ఐక్యంగా నిలబడి, ఇటువంటి రైతు వ్యతిరేక నిర్ణయాలను ఎంత మాత్రమూ సహించేది లేదని స్పష్టం చేయాలని వారు కోరారు. లేనిపక్షంలో అమెరికా ఒత్తిడికి మోడీ ప్రభుత్వం తలొంచుతుందని, ఇతర పంటలకు కూడా ఇలాంటి నిర్ణయాలే తీసుకుంటుందని విమర్శించారు. గత 11ఏండ్లలో దేశంలో పత్తి ఉత్పత్తి గణనీయంగా క్షీణించింది. 2014-15లో 65.6 లక్షల మెట్రిక్ టన్నులుండగా, 2023-24 నాటికి అదికేవలం 55 లక్షలకు పడిపోయింది. కనీస మద్దతు ధర ఇవ్వకపోవడం వల్ల 60లక్షల మంది పత్తి రైతులు గతేడాది నష్టపోయిన మొత్తం రూ.18,850కోట్లుగా వుంటుందని అంచనా. ఇటువంటి పరిస్థితుల్లో పత్తి దిగుమతులపై 11శాతం టారిఫ్‌కు స్వస్తి చెప్పడానికి అనుమతిస్తున్న నోటిఫికేషన్‌ను రద్దు చేయాల్సిందిగా ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు ఆందోళనను ఉధృతం చేయాలని అన్ని శాఖలకు ఎఐకెఎస్ పిలుపిచ్చింది. సంయుక్త కిసాన్ మోర్చా పిలుపిచ్చిన మేరకు సెప్టెంబరు 1-3 తేదీల్లో గ్రామాల్లో నోటిఫికేషన్ కాపీలను దగ్ధం చేయాల్సిందిగా రైతులకు విజ్ఞప్తి చేసింది. అలాగే రాష్ట్ర స్థాయిలో ఎస్కేఎం నాయకత్వం పిలుపిచ్చిన మేరకు పత్తి పండే ప్రాంతాల్లో పార్లమెంట్ సభ్యుల కార్యాలయాలకు ప్రదర్శనలు నిర్వహించాల్సిందిగా కూడా రైతులకు విజ్ఞప్తి చేసింది.
ఎగుమతుల సాకుతో పత్తి రైతుల లూటీ వద్దు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES