కొత్త చట్టానికి వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపాలి
చలో రాజ్‌భవన్, చలో అసెంబ్లీ నిర్వహిస్తాం
ఈనెల 28 నుంచి జనవరి 8వరకు గ్రామాల్లో నిరసనలు
జనవరి 8 నుంచి 18 వరకు జాతాలు
19న జిల్లా కేంద్రాల్లో నిరసనలు
జనవరి 26న ‘ఉపాధి’ని కాపాడుకుంటామంటూ గాంధీ విగ్రహాల ఎదుట ప్రతిజ్ఞ
వ్యవసాయ కార్మిక సంఘం రౌండ్ టేబుల్ సమావేశంలో నిర్ణయం
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ఎంతో మంది పేదల పొట్టగొట్టే వీబీ జీ రామ్ జీ చట్టం వద్దనీ, దాని స్థానంలో నరేగా చట్టాన్నే పునరుద్ధరించి అమలు చేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల్లో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపాలని రాష్ట్ర సర్కారును వ్యవసాయ కార్మిక సంఘం రౌండ్ టేబుల్ సమావేశం డిమాండ్ చేసింది. వీబీ జీ రామ్ జీని వ్యతిరేకిస్తూ చలో అసెంబ్లీ, చలో రాజ్‌భవన్ కార్యక్రమాలు నిర్వహిస్తామని ప్రకటించింది. ఈనెల 28 నుంచి జనవరి 8వ తేదీ వరకు గ్రామాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టాలనీ, జనవరి 8 నుంచి 18వ తేదీ వరకు జాతాలను, 19న జిల్లా కేంద్రాల్లో తలపెట్టిన నిరసనలను జయప్రదం చేయాలని ప్రజలకు పిలుపునిచ్చింది. ‘నరేగా చట్టాన్ని కాపాడుకుంటాం’ అని రిపబ్లిక్ డే రోజు గాంధీ విగ్రహాలు, చిత్రపటాల వద్ద ప్రతిజ్ఞలు చేయాలని కోరింది.
బుధవారం హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ‘వికసిత్ భారత్ జీ రామ్ జీ’ని రద్దు చేయాలి. మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ చట్టాన్ని అమలు చేయాలి’ అంశంపై రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్సీ చెరుపల్లి సీతారాములు మాట్లాడుతూ…సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో రాష్ట్రంలో చేపట్టిన కూలీ పోరాటాలను గుర్తుచేశారు. ఒక దగ్గర శ్రమను ధారబోసి మరో దగ్గర వెతుక్కోవద్దనీ, పని చేసిన దగ్గర కొట్లాడి జీతాన్ని పెంచుకోవాలని చేసిన పోరాటాలను ప్రస్తావించారు. వామపక్ష పార్టీల పోరాటాలు, పార్లమెంట్‌లోని లెఫ్ట్‌పార్టీల 64 మంది ఎంపీల ఒత్తిడితో యూపీఏ -1 ప్రభుత్వం మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ చట్టాన్ని తీసుకొచ్చిందని గుర్తు చేశారు. ఆ చట్టం వచ్చినప్పటి నుంచి గ్రామీణ పేద ప్రజల జీవన ప్రమాణాలు కొంత మేర పెరిగాయని తెలిపారు.
కూలీలకు కూలిని డిమాండ్ చేసే ధైర్యం పెరిగిందని చెప్పారు. పట్టణ ప్రాంతాల్లోనూ వేతన డిమాండ్ పెరిగిందన్నారు. అందుకే గ్రామీణ ధనవంతులు, కార్పొరేట్లు ఆ చట్టాన్ని తీసేయాలని ఒత్తిడి తీసుకువస్తున్నారనీ, ఆ క్రమంలోనే ఆ చట్టాన్ని క్రమంగా మోడీ సర్కారు నిర్వీర్యం చేసుకుంటూ పోతున్నదని విమర్శించారు. గాంధీ పేరును తొలగించడం చట్ట విరుద్ధమన్నారు. దేవుడి పేరు పెట్టి పేద ప్రజల పొట్టగొట్టడమేంటని ప్రశ్నించారు. నరేగాను యధావిధిగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. వ్యవసాయ కార్మిక రాష్ట్ర అధ్యక్షులు జి.నాగయ్య మాట్లాడుతూ.. రాష్ట్రాలు 40 శాతం వాటాను భరించాలనీ, వాటిని ఖర్చు చేస్తేనే విడుదల చేస్తామని చట్టంలో కేంద్రం పేర్కొనటం దుర్మార్గమన్నారు.
ఇప్పటికే ఆర్థిక వనరులను లాక్కున్న కేంద్రం రాష్ట్రాలపై మరింత భారం మోపడం సరిగాదని చెప్పారు. ఎంతో మంది పేదలకు ఉపయోగపడుతున్న చట్టాన్ని కార్పొరేట్లకు, కాంట్రాక్టర్లకు లాభం చేకూర్చేలా కేంద్రం మార్చడం తగదన్నారు. వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్.వెంకట్రాములు మాట్లాడుతూ..విబీ జీ రామ్ జీ ని వెనక్కి తీసుకోవాలనీ, నరేగాను కొనసాగించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రాలపై భారం మోపడాన్ని ఆపి పూర్తి చట్టాన్ని కేంద్రమే అమలు చేయాలని కోరారు. వ్యవసాయ సీజన్‌లో 60 రోజుల పాటు పనులను బంద్ చేసే నిబంధనను ఎత్తేయాలనీ, 200 రోజులకు పని దినాలు పెంచాలని అన్నారు. రోజువారీ వేతనం రూ.800 ఇవ్వాలని కోరారు. పట్టణ పేదలకూ చట్టాన్ని వర్తింపజేయాలని డిమాండ్ చేశారు.
సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి జె.వెంకటేశ్, గిరిజన సంఘం రాష్ట్ర కార్యదర్శి ఆర్.శ్రీరాంనాయక్, రాష్ట్ర అధ్యక్షులు ధర్మానాయక్, మహిళా కూలీల సంఘం రాష్ట్ర కన్వీనర్ బి.పద్మ, సీఐటీయూ రాష్ట్ర కోశాధికారి వంగూరు రాములు, డీవైఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్షులు కోట రమేశ్, కేవీపీఎస్ రాష్ట్ర నాయకులు మహేందర్, వ్యకాస రాష్ట్ర ఉపాధ్యక్షులు లంక రాఘవులు, వ్యకాస నాయకులు ఆర్.ఆంజనేయులు తదితరులు మాట్లాడుతూ…ఉపాధి హామీ చట్టానికి కేంద్రం తూట్లు పొడవడాన్ని మానుకోవాలనీ, రాముడి పేరు పెట్టి పేదల పొట్టగొట్టొద్దని కేంద్రానికి హితవు పలికారు. వ్యవసాయ కార్మిక సంఘం తలపెట్టిన పోరాట కార్యాచరణకు తమ సంఘాల మద్దతు ఉంటుందని ప్రకటించారు.



