త్వరలో ఇన్‌చార్జులను నియమిస్తాం : బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌతంరావు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
అధిక సంఖ్యలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలను గెలుపొందడంపై ఫోకస్ పెట్టామనీ, ప్రతి జెడ్పీటీసీ స్థానానికీ ముఖ్య నేతలను ఇన్‌చార్జులుగా పెట్టనున్నామని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌతం రావు తెలిపారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థిత్వంపై ఒపీనియన్స్ తీసుకున్న తర్వాత అభ్యర్థిని ప్రకటిస్తామన్నారు. ఈ నెల ఎనిమిదో తేదీన జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాల ఇన్‌చార్జులతో హైదరాబాద్‌లో సమావేశం ఉంటుందని చెప్పారు. ఆదివారం హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు వేముల అశోక్, వీరేందర్‌గౌడ్, అధికార ప్రతినిధి, మీడియా ఇన్‌చార్జి ఎన్వీవీ. సుభాష్‌తో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. పదాధికారుల సమావేశంలో కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్‌రెడ్డి, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షులు డీకే. అరుణ, బీజేపీ ఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి, శాసనమండలి పక్షనేత ఏవీఎన్‌రెడ్డి, కర్నాటక, తమిళనాడు రాష్ట్రాల సహా ఇన్‌చార్జి పొంగులేటి సుధాకర్ రెడ్డి, బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, రాష్ట్ర పదాధికారులు పాల్గొన్నారని తెలిపారు.
రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిస్థితులను అనుకూలంగా మార్చుకుని క్షేత్రస్థాయిలో బలపడతామన్నారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం పంచాయతీలను నిర్వీర్యం చేసిన తీరును, కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై విస్తృతంగా ప్రజల్లో ప్రచారం చేస్తామని చెప్పారు. బీసీ రిజర్వేషన్లపై 22 నెలలుగా కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రలు చేస్తున్నదని విమర్శించారు. పాత, కొత్త అనే తేడా లేకుండా పార్టీ కోసం పనిచేసే నాయకులందరికీ సమప్రాధాన్యం ఇస్తామని చెప్పారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ప్రజాప్రతినిధులు, జిల్లా అధ్యక్షులు, రాష్ట్ర పదాధికారులు, మాజీ పదాధికారులను జెడ్పీటీసీ స్థానాల ఇన్‌చార్జులుగా నియమిస్తామని తెలిపారు. అభ్యర్థుల ఎంపికకు సంబంధించిన కమిటీలను తమ పార్టీ అధ్యక్షులు రాంచందర్‌రావు త్వరలోనే ప్రకటిస్తారని తెలిపారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై హైదరాబాద్, సికింద్రాబాద్ పార్లమెంట్ స్థానాల పరిధిలోని నాయకులంతా కేంద్రీకరించి పనిచేయాలని నిర్ణయం తీసుకున్నామన్నారు.