Sunday, November 2, 2025
E-PAPER
Homeజాతీయంతీవ్ర పేదరికం నుంచి విముక్తి చెందాం

తీవ్ర పేదరికం నుంచి విముక్తి చెందాం

- Advertisement -

కేరళ రాష్ట్రావతరణ సందర్భంగా శాసనసభ
ప్రత్యేక సమావేశంలో సీఎం పినరయి విజయన్‌ ప్రకటన
తిరువనంతపురంలో బహిరంగ సభ
ప్రముఖ సినీ నటులు మమ్ముట్టికి
నివేదిక అందచేసిన సీఎం

ప్రతి సంవత్సరం మనం ఉత్సాహంతో ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకుంటాం. కానీ ఈ సంవత్సరం జరుగుతున్న వేడుక కేరళ ప్రజల కోసం నూతన శకానికి ప్రారంభాన్ని అందిస్తోంది. ఇది చరిత్రలో నిలిచిపోయి కలకాలం గుర్తుంటుంది. దేశంలో తీవ్రమైన పేదరికం నుంచి బయటపడిన తొలి రాష్ట్రంగా కేరళను మార్చేశాం.– కేరళ సీఎం పినరయి విజయన్‌
ఇది వామపక్ష ప్రభుత్వ చారిత్రాత్మక విజయం సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి ఎంఏ బేబీ
ఆకలిని జయించడమే అసలైన అభివృద్ధి. అది కేరళ సాధించింది. – ప్రముఖ సినీ నటులు మమ్ముట్టి
తిరువనంతపురం : దేశంలో తీవ్రమైన పేదరికాన్ని నిర్మూలించిన తొలి రాష్ట్రంగా అవతరించామని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ ప్రకటించారు. కేరళ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా శనివారం జరిగిన శాసనసభ ప్రత్యేక సమావేశంలో 300వ నిబంధన కింద ఆయన ఈ మేరకు ప్రకటన చేశారు.
ఈ మైలురాయి సమ్మిళిత వృద్ధిలో కేరళ నమూనాకు ఓ శాసనంగా నిలిచిపోయిందని విజయన్‌ చెప్పారు. స్థానికంగా తీసుకున్న చర్యలు, ప్రజల క్రియాశీల భాగస్వామ్యం ద్వారానే ఇది సాధ్యపడిందని ఆయన అన్నారు. 2021లో కేరళలో ఎల్డీఎఫ్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారి జరిగిన క్యాబినెట్‌ సమావేశంలో అనేక ప్రధాన నిర్ణయాలు తీసుకున్నారు. తీవ్ర పేదరికం నుంచి రాష్ట్రాన్ని బయటపడేయాలన్నది అందులో ఒకటి. శాసనసభ ఎన్నికల సందర్భంగా ప్రజలకు ఇచ్చిన ఈ హామీని అమలు చేయడానికి ప్రభుత్వం నడుం బిగించింది. అధికారాన్ని చేపట్టిన రెండు నెలల సమయంలోనే తీవ్ర పేదరికంతో బాధపడుతున్న కుటుంబాలను గుర్తించే ప్రక్రియను చేపట్టింది. లక్ష్య సాధనలో అన్ని ప్రభుత్వ విభాగాలు, స్థానిక సంస్థలు, ప్రజలు భాగస్వాములయ్యారు. తీవ్ర పేదరికాన్ని గుర్తించేందుకు ముందుగా వడక్కన్‌చెరీ మున్సిపాలిటీని, అంచుతెంగు, తిరునెల్లి గ్రామ పంచాయతీలను ఎంచుకున్నారు. పైలట్‌ దశ విజయవంతం కావడంతో రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు ప్రక్రియను చేపట్టారు.

కార్యాచరణ ఇలా…
అత్యంత పేద కుటుంబాలుగా గుర్తించిన 64,006 కుటుంబాల్లో 55,861 కుటుంబాలు…అంటే 96.13 శాతం కుటుంబాలకు సెప్టెంబర్‌ 15వ తేదీ నాటికి తీవ్ర పేదరికం నుంచి విముక్తి లభించింది. మిగిలిన 2,148 కుటుంబాలను కూడా గత నెల 31వ తేదీతో తీవ్ర పేదరికం నుంచి బయటపడేశారు. దీంతో శనివారం నాటికి రాష్ట్రంలో అత్యంత పేద కుటుంబాలే లేకుండా పోయాయని శాసనసభ సమావేశాల్లో ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ ప్రకటన చేశారు.

మాట ఇచ్చాం…చేసి చూపాం
బహిరంగసభలో సినీ నటులు మమ్ముట్టికి నివేదిక అందచేసిన సీఎం పినరయి విజయన్‌ శాసనసభ సమావేశాల అనంతరం తిరువనంతపురంలో శనివారం సాయంత్రం నిర్వహించిన బహిరంగ సభలో ‘తీవ్ర పేదరిక విముక్త రాష్ట్రం’ లక్ష్య సాధనలో నాలుగేండ్ల ప్రస్తావనంపై నివేదికను మళయాళ సుప్రసిద్ధ నటుడు మమ్ముట్టికి సీఎం పినరయి విజయన్‌ అందచేశారు. ఈ సందర్భంగా అక్కడి కార్యక్రమంలో సీఎం మాట్లాడుతూ కడు పేదలను దారిద్య్రం నుంచి బయటపడేసి, వారికి ఉపాధి అవకాశాలను కూడా మెరుగుపరిచామని తెలిపారు. రేషన్‌కార్డులు, ఆధార్‌ కార్డులు అందచేసి, కుటుంబశ్రీ కార్యక్రమం ద్వారా క్రమం తప్పకుండా ఆయా పేద కుటుంబాలకు ఆహారం, ఆరోగ్య సేవలు, మందులు, వ్యాక్సినేషన్లు, ఉపశమనం కలిగించే సంరక్షణ చర్యలు, అవయవాల మార్పిడి వంటి అనేక కార్యక్రమాలతో పాటు ఇండ్ల నిర్మాణం కూడా పూర్తిచేశాకే ఈ ఘనత సాధ్యమైందని వివరించారు. ఈ సందర్భంగా దారిద్య్రం, అధిక జననాల రేటు వంటి సమస్యలను కేరళ ఎదుర్కొంటోందని 1970ల నాటి అకడమిక్‌ జర్నల్స్‌, ఐక్యరాజ్య సమితి నివేదికలను ఉటంకిస్తూ విజయన్‌, ఆనాటి రోజుల నుండి రాష్ట్రం ఇప్పుడు ప్రశంసనీయమైన పురోగతిని సాధించిందని తెలిపారు. వ్యవసాయ కార్యకలాపాల్లో సంస్కరణలు, ఆరోగ్య, విద్యా రంగాల్లో ప్రభుత్వ ప్రమేయంతో పాటు ప్రగతిశీల ప్రభుత్వాలు, ప్రజా ఉద్యమాలు నిరంతర జోక్యం వల్లే ఈ పురోగతి సాధ్యమైందన్నారు. ఇల్లు, భూమి లేకపోవడమనే సమస్యను పారద్రోలేందుకు గతంలో తీసుకున్న చర్యల కొనసాగింపే ఈ తీవ్రమైన పేదరిక నిర్మూలన ప్రక్రియ అని విశ్లేషించారు. ఈ సందర్భంగా ఐక్యరాజ్య సమితి పేర్కొన్న సుస్థిర అభివృద్ధి సూచికలో కేరళ గణనీయమైన పురోగతి సాధించిందని సంతోషం వ్యక్తం చేశారు. పేదరికం నుంచి బయటపడిన వారెవరూ కూడా మళ్లీ ఆ పేదరికపు కూపంలోకి పడిపోకుండా వుండేలా జాగ్రత్తలు తీసుకుంటూ, దానికోసం నిర్దిష్ట కాల వ్యవధుల్లో తనిఖీలు చేపట్టాల్సి ఉటుందని చెప్పారు.

ఆకలిని జయించడమే అసలైన అభివృద్ధి-మమ్ముట్టి
ఆకలిని జయించడమే అసలైన అభివృద్ధి అని ప్రముఖ సినీ నటులు మమ్ముట్టి కేరళ రాష్ట్ర పురోగతిని ప్రసంసించారు. తిరువనంతపురంలోని నిశాగంధీ ఆడిటోరియయంలో మంత్రి కె రాజన్‌ అధ్యక్షతన నిర్వహించిన బహిరంగ సభను ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ ప్రారంభించిన అనరతరం ఆయన మాట్లాడారు. అభివృద్ధి అంటే ఆకాశహర్మ్యాలు, నిర్మాణాలు చేపట్టడం కాదని స్పష్టం చేశారు. కేరళ పురోభివృద్ధిలో ఇదో గొప్ప ముందడుగు అని చెప్పారు. దీన్ని కొనసాగించేందుకు ప్రజలంతా కలిసికట్టుగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. అనేక సామాజిక, సంక్షేమ సూచీల్లో కేరళ..ప్రపంచానికే ఆదర్శనంగా నిలుస్తోందని హర్షం వ్యక్తం చేశారు.

కేరళ ఖ్యాతి చిరస్మరణీయం : ఎంఎ బేబీ
కేరళ ప్రజానీకానికి, ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ నేతృత్వంలోని ఎల్‌డిఎఫ్‌ ప్రభుత్వానికి సీపీఎం ప్రధానకార్యదర్శి ఎంఎ బేబీ ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. కేరళ సాధించిన ఈ విజయం చరిత్ర పుటల్లో చెరగని సువర్ణాక్షరాలతో లిఖితమైందని పేర్కొన్నారు. ఈ మేరకు సామాజిక మాధ్యమాల్లో ఒక వీడియోను ఆయన విడుదల చేశారు. కేరళ చరిత్రలోనే కాకుండా యావత్‌ భారతదేశ చరిత్రలోనే నవంబరు 1, 2025 చిరస్మరణీయంగా నిలిచిపోతుందన్నారు. తీవ్ర దుర్బిక్షంలో బతుకెళ్లదీసిన నిరుపేదల జీవనోపాదులను మెరుగుపర్చి సమిష్టి కృషితో కేరళ ఈ ఘనత సాధించిందని కొనియాడారు. ఈ విజయాన్ని స్ఫూర్తిగా తీసుకుంటూ కేరళ ప్రజానీకం మరింత విశ్వాసంతో ఇతర సమస్యల పరిష్కరానికి సమిష్టిగా కృషి చేయాలని ఆకాంక్షించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -