Monday, March 2, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలుమాకేం భేషజాలు లేవు

మాకేం భేషజాలు లేవు

- Advertisement -

సమాచార లోపంతోనే శారదా పీఠం భూములపై గందరగోళం
పొరపాట్లు దొర్లితే సరిదిద్దుకుంటాం
మతాన్ని అడ్డుపెట్టుకొని దుష్ప్రచారం తగదు
పీఠానికి అండగా ఉంటాం : శారదాపీఠం భూముల్ని సందర్శించిన మంత్రి శ్రీధర్‌బాబు


నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
కోకాపేట్‌లోని శారదాపీఠం భూముల వ్యవహారంలో ‘సమాచార లోపం’ వల్లే గందరగోళం తలెత్తిందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అన్నారు. ఆ భూములు పీఠానికే చెందుతాయని, ఇందులో ఎలాంటి సందేహం లేదన్నారు. పీఠం అభివృద్ధి, ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ప్రభుత్వం అన్ని రకాలుగా అండగా ఉంటుందని స్పష్టంచేశారు. ఆదివారం కోకాపేటలోని శారదాపీఠాన్ని ఆయన సందర్శించారు. రాజశ్యామల అమ్మవారి ఆలయం, ఇతర నిర్మాణాలను పరిశీలించారు. అనంతరం ఉత్తర పీఠాధిపతులు స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామీజీతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు.

ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అన్ని మతాలను సమానంగా గౌరవిస్తుందని చెప్పారు. తప్పులు దొర్లితే ఎప్పటికప్పుడు సరిదిద్దుకునేందుకు సిద్ధంగా ఉన్నామనీ, దానికోసం తమకేం భేషజాలు లేవని అన్నారు. దానిలో భాగంగానే శారదాపీఠం భూముల విషయంలో జరిగిన పొరపాటును వెంటనే సరిదిద్దుకున్నామన్నారు. రాబోయే రోజుల్లో ఇలాంటివి పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామన్నారు. మతాన్ని అడ్డుపెట్టుకొని బీజేపీ, బీఆర్‌ఎస్‌కు చెందిన కొందరు నాయకులు నీచ రాజకీయాలకు పాల్పడుతున్నారని విమర్శించారు. బాపు ఘాట్‌ అభివృద్ధి విషయంలో ప్రజాభీష్టం మేరకే ముందుకెళ్తామనీ, స్థానికులు తప్పుడు ప్రచారాన్ని నమ్మొద్దని విజ్ఞప్తి చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -