Saturday, August 30, 2025
E-PAPER
spot_img
Homeప్రధాన వార్తలువిద్యాసంస్థల్లో ముఖం చూపాల్సిందే

విద్యాసంస్థల్లో ముఖం చూపాల్సిందే

- Advertisement -

విద్యార్థులు, బోధనా సిబ్బందికి ఫేషియల్‌ రికగ్నైజేషన్‌ అమలు
స్కూళ్లు, కాలేజీలు, వృత్తి విద్యా కళాశాలలకూ వర్తింపు
ఒకే విభాగం పరిధిలోకి విద్యాశాఖ నిర్మాణాలు
గ్రీన్‌చానల్‌ ద్వారా మధ్యాహ్న భోజనం బిల్లులు
ప్రతి విద్యాసంస్థలో క్రీడలకు ప్రాధాన్యం
బోధనలో నాణ్యతా ప్రమాణాలను పెంచాలి: విద్యాశాఖ సమీక్షలో సీఎం రేవంత్‌రెడ్డి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

పాఠశాలలు మొదలు విశ్వవిద్యాలయాల వరకు ప్రతి విద్యాసంస్థలోనూ మెరుగైన బోధన సాగాలనీ, విద్యా బోధనలో నాణ్యతా ప్రమాణాలు మరింత పెంచాలని ముఖ్యమంత్రి ఎ రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. పాఠశాలలు, కళాశాలలు, వృత్తి విద్యా కోర్సులు బోధించే కాలేజీల్లో విద్యార్థులు, బోధనా సిబ్బందికి ఫేషియల్‌ రికగ్నిషన్‌ అటెండెన్స్‌ (ఎఫ్‌ఆర్‌ఎస్‌) తప్పనిసరి చేయాలన్నారు. ముఖ గుర్తింపుతో హాజరు శాతం మెరుగవడంతోపాటు వృత్తి విద్యా సంస్థల్లో లోటుపాట్లను అరికట్టవచ్చని అన్నారు. హైదరాబాద్‌లోని ఇంటిగ్రేటెడ్‌ కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ (ఐసీసీసీ)లో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి శుక్రవారం విద్యాశాఖపై సమీక్ష నిర్వహించారు. విద్యాశాఖ పరిధిలో అదనపు గదులు, వంట గదులు, మూత్రశాలలు, మరుగుదొడ్లు, ప్రహరీ గోడల నిర్మాణం వివిధ విభాగాలు చేపట్టడం సరికాదని సీఎం అబి óప్రాయపడ్డారు. ఈ నిర్మాణాల నాణ్యతా ప్రమాణాలు, వాటి పర్యవేక్షణ, నిధుల మంజూరు, జవాబుదా రీతనానికిగానూ ఒకే విభాగం కింద ఉండాలని సూచించారు. యంగ్‌ ఇండియా ఇంటిగ్రేటెడ్‌ రెసిడెన్షియల్‌ స్కూళ్ల నిర్మాణాన్ని పర్యవేక్షిస్తున్న విద్యా, సంక్షేమ వసతుల అభివృద్ధి సంస్థ (టీజీఈడబ్ల్యూఐడీసీ) కిందనే రాష్ట్రంలోని అన్ని విద్యా సంస్థల నిర్మాణాలూ కొనసాగాలని సీఎం ఆదేశించారు. ఈ సంస్థకు అవసరమైన ఇంజినీరింగ్‌, ఇతర సిబ్బందిని ఇతర విభాగాల నుంచి వెంటనే డిప్యూటేషన్‌పై తీసుకోవాలని సూచించారు. మధ్యాహ్న భోజన బిల్లుల చెల్లింపును గ్రీన్‌చానల్‌ ద్వారా చేపట్టాలనీ, ఈ విషయంలో ఎటువంటి అలసత్వం చూపొద్దని సీఎం అన్నారు.

కంటైనర్‌ కిచెన్లకు ప్రాధాన్యమివ్వాలి
రాష్ట్రంలోని మహిళా కళాశాలలు, బాలికల పాఠశాలల్లో మూత్రశాలలు, మరుగుదొడ్లు, ప్రహరీ గోడల నిర్మాణాన్ని వేగవంతం చేయాలని రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. కంటైనర్‌ కిచెన్లకు ప్రాధాన్యమివ్వాలని సూచించారు. కంటైనర్లపైన సోలార్‌ ప్యానెళ్లతో అవసరమైన విద్యుత్‌ను వినియోగించుకోవచ్చని కోరారు. ప్రతి పాఠశాలలో క్రీడలకు ప్రాధాన్యం ఇవ్వాలని సీఎం సూచించారు. అవసరమైతే కాంట్రాక్ట్‌ పద్ధతిన వ్యాయామ ఉపాధ్యాయులను నియమించే అంశాన్ని పరిశీలించాలని అధికారులను ఆదేశించారు. అమ్మ ఆదర్శ పాఠశాలల కింద పాఠశాలల్లో పారిశుద్ధ్య పనులకు సంబంధించిన బిల్లులు తక్షణమే విడుదల చేయాలని సీఎం కోరారు. సంక్షేమ గురుకుల పాఠశాలల్లోని బాలికలకు వివిధ అంశాలపై కౌన్సిలింగ్‌ ఇచ్చేందుకు మహిళా కౌన్సిలర్లను నియమించాలని సూచించారు. విద్యారంగంపై పెడుతున్న ఖర్చును తాము ఖర్చుగా కాకుండా పెట్టుబడిగా చూస్తున్నామని చెప్పారు.

ప్రభుత్వ విద్యాసంస్థల్లో 90 శాతం ఎస్సీ,ఎస్టీ,బీసీ, మైనార్టీ విద్యార్థులే
యంగ్‌ ఇండియా ఇంటిగ్రేటెడ్‌ రెసిడెన్షియల్‌ స్కూళ్లతోపాటు విద్యారంగం అభివృద్ధికి తీసుకునే రుణాలను ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితిలో లేకుండా చూడాలని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌కు విజ్ఞప్తి చేశారని సీఎం వివరించారు. ప్రభుత్వ విద్యాసంస్థల్లో చదువుతున్న వారిలో 90 శాతానికిపైగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలే ఉన్నారని చెప్పారు. ఈ విషయాన్ని నిర్ధారించేందుకు గత పదేండ్లలో ప్రభుత్వ విద్యాసంస్థల్లో చదివిన వారి వివరాలపై నివేదిక రూపొందించాలని సీఎం అధికారులను ఆదేశించారు. ఈ సమీక్ష సమావేశంలో ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్‌ రెడ్డి, ముఖ్యమంత్రి ప్రత్యేక కార్యదర్శి బి అజిత్‌రెడ్డి, ముఖ్యమంత్రి ఓఎస్డీ వేముల శ్రీనివాసులు, విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి యోగితా రాణా, ఉన్నత విద్యా మండలి చైర్మెన్‌ వి బాలకిష్టారెడ్డి, సాంకేతిక విద్యాశాఖ కమిషనర్‌ శ్రీదేవసేన, పాఠశాల విద్యా శాఖ సంచాలకులు ఈ నవీన్‌ నికోలస్‌ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad