Sunday, September 7, 2025
E-PAPER
spot_img
Homeజాతీయంబీజేపీ కంటే ఒక్క సీటైనా ఎక్కువ పొందాల్సిందే

బీజేపీ కంటే ఒక్క సీటైనా ఎక్కువ పొందాల్సిందే

- Advertisement -

బీహార్‌లో సీట్ల సర్దుబాటుపై వీడని చిక్కుముడి
జేడీయూ డిమాండ్‌తో కొనసాగుతున్న ప్రతిష్టంభన
పాట్నా :
బీహార్‌ శాసనసభ ఎన్నికలలో సీట్ల సర్దుబాటుకు సంబంధించి అధికార జేడీయూ-బీజేపీ కూటమిలో ప్రతిష్టంభన కొనసాగుతూనే ఉంది. చెరి సగం స్థానాలకు (100-105 సీట్లు) పోటీ చేయాలని రెండు పార్టీలు ఒక అవగాహనకు వచ్చినప్పటికీ తుది ఒప్పందం మాత్రం కుదరలేదు. సీట్ల సర్దుబాటులో బీజేపీ కంటే కనీసం ఒక్క సీటైనా ఎక్కువ సాధించుకోవాలని జేడీయూ పట్టుదలగా ఉండడమే దీనికి కారణంగా కన్పిస్తోంది. సీట్ల సర్దుబాటుపై వచ్చే వారం తుది విడత చర్చలు జరుగుతాయని ఎన్డీఏ వర్గాలు తెలిపాయి. ఈ నెల 9న జరిగే ఉప రాష్ట్రపతి ఎన్నిక ఓటింగుకు సంబంధించి ఏర్పాటు చేసిన శిక్షణ శిబిరంలో పాల్గొనేందుకు ఎన్డీఏ ఎంపీలు, సీనియర్‌ నేతలు ప్రస్తుతం న్యూఢిల్లీ చేరుకుంటున్నారు. సీట్ల సర్దుబాటుపై వారితో కూడా సంప్రదింపులు జరుపుతారు.
‘మా పార్టీకి కేటాయించే స్థానాల కంటే కనీసం ఒక్క సీటైనా ఎక్కువ పొందాలని జేడీయూ కోరుకుంటోందని తెలిసింది. దీనివల్ల ముఖ్యమంత్రిగా నితీష్‌ కుమార్‌కు ఉన్న ప్రజాదరణ, ఆయన సామర్ధ్యంపై బీజేపీ నాయకత్వానికి ఉన్న నమ్మకం ఇనుమడిస్తాయి’ అని బీజేపీ సీనియర్‌ నేత ఒకరు చెప్పారు. ‘నరేంద్ర మోడీ నేతృత్వంలో మేము లోక్‌సభ ఎన్నికల బరిలో దిగాము. అప్పుడు బీజేపీ 17 స్థానాలకు పోటీ చేస్తే మేము 16 సీట్లలో పోటీ పడ్డాం. ఇప్పుడు నితీష్‌ కుమార్‌ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా చూపి శాసనసభ ఎన్నికలకు వెళుతున్నాం. కాబట్టి మాకు ఒక్క సీటైనా ఎక్కువ కేటాయించాలని కోరడం సమంజసమే’ అని జేడీయూ సీనియర్‌ నేత ఒకరు తెలిపారు.

అయితే ఇక్కడ ఓ సమస్య ఎదురవుతోంది. కేంద్ర ఫుడ్‌ ప్రాసెసింగ్‌ శాఖ మంత్రి చిరాగ్‌ పాశ్వాన్‌ నేతృత్వంలోని లోక్‌ జనశక్తి పార్టీ (రాం విలాస్‌) తనకు 40 సీట్లు కేటాయించాలని పట్టుపడుతోంది. ఈ పార్టీకి ప్రస్తుతం లోక్‌సభలో ఐదుగురు ఎంపీలు ఉన్నారు. కాగా చిరాగ్‌ పార్టీ కోరుతున్న స్థాయిలో సీట్లు కేటాయించేందుకు బీజేపీ కానీ, జేడీయూ కానీ సుముఖంగా లేవు. మహా అయితే ఆ పార్టీకి 20 సీట్లకు మించి వదిలే ప్రశ్నే లేదని చెబుతున్నాయి. పైగా కూటమిలో భాగస్వాములుగా ఉన్న ఉపేంద్ర కుష్వాహా నేతృత్వంలోని రాష్ట్రీయ లోక్‌మంచ్‌, జితన్‌ రామ్‌ మంజ్హీ నాయకత్వంలోని హిందుస్థాన్‌ ఆవామ్‌ మోర్చా పార్టీలకు కూడా కొన్ని సీట్లు కేటాయించాల్సి ఉంటుంది.
2020 శాసనసభ ఎన్నికలలో జేడీయూ 115, బీజేపీ 110 స్థానాలకు పోటీ చేశాయి. అయితే బీజేపీకి అత్యధికంగా 74 సీట్లు లభించగా జేడీయూకి 43 మాత్రమే వచ్చాయి.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad