- Advertisement -
- ఈ మూడు దేశాలకూ మంచి భవిష్యత్తు ఉండొచ్చు: ట్రంప్ కీలక వ్యాఖ్యలు
వాషింగ్టన్ : తియాన్‌జిన్‌లో ఇటీవల జరిగిన షాంఘై సహకార సదస్సు (ఎస్‌సీఓ) తర్వాత భారత్, రష్యాలను మనం చైనాకు కోల్పోయినట్టుగా కనిపిస్తోందని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ శుక్రవారం వ్యాఖ్యానించారు. ” చైనాకు భారత్, రష్యాలను మనం కోల్పోయినట్టుగా కనిపిస్తోంది. బహుశా ఆ మూడు దేశాలకు కలిపి మంచి భవిష్యత్తు ఉండవచ్చు !.” అంటూ ట్రంప్ తన సోషల్ మీడియా వేదిక అయిన ట్రూత్ సోషల్‌లో పోస్టు పెట్టారు. దీంతో పాటు ప్రధాని మోడీ, రష్యా, చైనా నేతలు పుతిన్, జిన్‌పింగ్ కలిసి వున్న పాత ఫోటోను కూడా జత పరిచారు.
రెండో ప్రపంచ యుద్ధంలో విజయం సాధించి 80 ఏండ్లు అయిన సందర్బాన్ని పురస్కరించుకుని చైనాలో జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన పుతిన్, ఉత్తర కొరియా నేత కిమ్ జోంగ్ ఉన్‌లతో కలిసి జిన్‌పింగ్ అమెరికాకు వ్యతిరేకంగా కుట్ర పన్నుతున్నారని ఆరోపిస్తూ గురువారం ట్రంప్ ఒక పోస్టు పెట్టారు. కాగా దీనిపై చైనా జాతీయ ప్రతినిధి స్పందిస్తూ, ఏ దేశంతోనైనా చైనా దౌత్య సంబంధాలు వృద్ధి చేసుకుందంటే తృతీయ దేశానికి వ్యతిరేకంగా ఎన్నటికీ కాదని స్పష్టం చేశారు. ఇటీవలే ట్రంప్ వాణిజ్య సలహాదారు పీటర్ నవరో ఆ ముగ్గురు నేతల మధ్య సామరస్యత కొంత ఆందోళనకరంగా ఉందని వ్యాఖ్యానించారు. అయినా మోడీ ఉండాల్సింది అమెరికా, యూరప్, ఉక్రెయిన్‌లతో కానీ రష్యాతో కాదని అన్నారు. ట్రంప్ పోస్టుపై వ్యాఖ్యానించడానికి భారత విదేశాంగ శాఖ తిరస్కరించింది. నవరో చేసిన అసంబద్ధమైన, తప్పుదారి పట్టించే ప్రకటనలను చూశామని, వాటిని తోసిపుచ్చుతున్నామని విదేశాంగ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ చెప్పారు.
- Advertisement -