ప్రతి జిల్లాలో చిల్డ్రన్స్ ట్రాఫిక్ అవేర్నెస్ పార్కులు
మరణాల రేటును ‘జీరో’కి తగ్గించాలి
కార్యక్రమాల్లో కొత్త సర్పంచ్‌లు, ప్రజాప్రతినిధుల భాగస్వామ్యం : రవాణాశాఖ అధికారుల సమీక్షలో మంత్రి పొన్నం ప్రభాకర్
నవతెలంగాణ-సిటీబ్యూరో
జనవరి ఒకటి నుంచి నెల రోజులపాటు దేశవ్యాప్తంగా నిర్వహించే జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రగామిగా నిలబెట్టాలని రవాణ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులను ఆదేశించారు. రోడ్డు భద్రతా మాసోత్సవాలపై రవాణా శాఖ అధికారులతో మంత్రి జూమ్ ద్వారా బుధవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రంలో నిత్యం రోడ్డు ప్రమాదాల వల్ల సుమారు 20 మంది మరణిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మరణాల రేటును జీరో స్థాయికి తగ్గించడమే లక్ష్యంగా అధికారులు పని చేయాలని సూచించారు.
కార్యాచరణ ఇలా..
ఈ మాసోత్సవాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జిల్లా కలెక్టర్లు, పోలీస్ అధికారులతోపాటు నూతనంగా ఎన్నికైన సర్పంచ్‌లనూ భాగస్వామ్యం చేయాలని మంత్రి చెప్పారు. ప్రతి గ్రామం నుంచి రాజధాని వరకు అన్ని పాఠశాలలు, కళాశాలలకు రవాణా శాఖ అధికారులు స్వయంగా వెళ్లాలని ఆదేశించారు. విద్యార్థులతో రోడ్డు భద్రతపై ప్రతిజ్ఞ చేయించి, నిబంధనలపై అవగాహన కల్పించాలన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంక్షేమ పాఠశాలల విద్యార్థులనూ ఇందులో భాగస్వామ్యం చేయాలన్నారు. ప్రతి జిల్లాలో ‘చిల్డ్రన్స్ ట్రాఫిక్ అవేర్నెస్’ పార్కులను ఏర్పాటు చేయాలని మంత్రి స్పష్టం చేశారు. విద్యార్థులతోపాటు లారీ డ్రైవర్లు, స్కూల్ బస్ డ్రైవర్లు, అంబులెన్స్ డ్రైవర్లు, ముఖ్యంగా డాక్టర్లను ఈ కార్యక్రమాల్లో భాగస్వామ్యం చేయాలని సూచించారు.
కార్యక్రమాలు ఇలా..
జిల్లాల వారీగా రోడ్డు భద్రతా ర్యాలీలు, వాక్‌థాన్‌లు, హెల్మెట్ అవగాహన కార్యక్రమాలు, రంగోలి, క్విజ్, వ్యాసరచన పోటీలు నిర్వహించాలని మంత్రి తెలిపారు. అలాగే సీట్ బెల్ట్ డ్రైవ్స్, కంటి పరీక్షలు, బ్లడ్ డొనేషన్ క్యాంపులు, పాఠశాల బస్సుల భద్రతా తనిఖీలు, పాదచారుల భద్రత, ఓవర్ లోడింగ్‌పై అవగాహన కల్పించాలన్నారు. రిపబ్లిక్ డే వేడుకల్లో రవాణా శాఖ శకటాల ప్రదర్శన ఉండాలని సూచించారు. ఎన్‌ఎస్‌ఎస్, లయన్స్ క్లబ్, రోటరీ క్లబ్ వంటి సేవా సంస్థలను భాగస్వామ్యం చేసి, జనవరి 26న వారికి ప్రశంసా పత్రాలు అందించాలన్నారు.
అధికారులకు ఆదేశాలు
జిల్లా రోడ్ సేఫ్టీ కమిటీ సమావేశాలను కలెక్టర్ సమక్షంలో ఏర్పాటు చేసి కార్యాచరణపై చర్చించాలని మంత్రి అన్నారు. జేటీసీలు, డీటీసీలు, ఎంవీఐలు, ఏఎంవీఐలు రోజువారీగా నిర్వహించిన కార్యక్రమాల నివేదికలు, ఫోటోలు, విజువల్స్ తప్పనిసరిగా ప్రధాన కార్యాలయానికి పంపాలని ఆదేశించారు. ఈ సమీక్షా సమావేశంలో రవాణాశాఖ కమిషనర్ ఇలాంబర్తి, జేటీసీలు ఎం.చంద్రశేఖర్ గౌడ్, సి.రమేష్, శివ లింగయ్య, డీటీసీలు, ఎంవీఐలు తదితరులు పాల్గొన్నారు.
రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో అగ్రగామిగా నిలవాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



