Sunday, February 8, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంసైబర్‌ క్రైమ్‌ పట్ల అప్రమత్తంగా ఉండాలి

సైబర్‌ క్రైమ్‌ పట్ల అప్రమత్తంగా ఉండాలి

- Advertisement -

మహిళలను కించపరిస్తే కఠిన చర్యలు : హైదరాబాద్‌ కమిషనర్‌ సజ్జనార్‌

నవతెలంగాణ- ఆదిబట్ల
సమాజంలో సైబర్‌ క్రైమ్‌ కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయని, వాటి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్‌ కమిషనర్‌ విసి.సజ్జనార్‌ సూచించారు. మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ‘సురక్షిత్‌ హైదరాబాద్‌’ కార్యక్రమంలో భాగంగా శనివారం జీహెచ్‌ఎంసీ పరిధిలోని ఆదిబట్ల సర్కిల్‌ పోలీసుస్టేషన్‌లో సైబర్‌ క్రైమ్‌, రోడ్డు భద్రతపై అవగాహనా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో సీపీ మాట్లాడారు. బంగారం, వెండి రేట్లు పెరగడంతో ఏపీకే ఫైల్‌, ఓటీపీ రూపంలో రోజుకు దాదాపు కోటి రూపాయల వరకు ప్రజలు మోసపోతున్నారని తెలిపారు. అవగాహన లోపంతో ప్రజలు సైబర్‌ క్రైమ్‌ వలలో పడి డబ్బులు పోగొట్టుకుంటున్నారని అన్నారు. చదువుకున్న వారు కూడా ఆశకు పోయి చివరకు మోసపోతున్నారన్నారు. గోల్డెన్‌ అవర్‌ సమయంలో డయల్‌ 100కు, లేదా 1930కి కాల్‌ చెసి ప్రజలు వారి సొమ్ము దక్కించుకోవచ్చని సూచించారు.

సైబర్‌ క్రైమ్‌పై పోలీసుశాఖ ఆధ్వర్యంలో అవగాహనా కార్యక్రమాలు చేపడుతున్నట్టు తెలిపారు. ప్రతి వాహనదారుడూ రోడ్డు భద్రత నియమాలు పాటించాలని సూచించారు. నిబంధనలు పాటించకపోవడంతో నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయని, వందల మంది ప్రాణం కోల్పోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. యువత మద్యానికి దూరంగా ఉండాలని సూచించారు. వాహనాలు నడిపేటప్పుడు ఎట్టిపరిస్థితుల్లోనూ మద్యం తాగొద్దని, ప్రమాదాలకు కారణం కావొద్దని కోరారు. సోషల్‌ మీడియా పట్ల మహిళలు జాగ్రత్తగా ఉండాలన్నారు. ప్రయివేట్‌ ఫొటోలు, వీడియోలు సోషల్‌ మీడియాలో పెట్టొద్దని సూచించారు. బస్టాండ్‌, రైల్వే స్టేషన్‌, ఇతర ప్రాంతాల్లో మహిళాలపై అఘాయిత్యాలు జరుగుతున్నాయని, వాటిని అరికట్టేందుకు పోలీసులు ఎల్లప్పుడూ రక్షణగా ఉంటున్నారని, షీటీమ్స్‌ బాగా పనిచేస్తున్నాయని చెప్పారు. మహిళలను కించపరిస్తే ఎవరినైనా వదిలేది లేదని, చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ‘సురక్షిత్‌ హైదరాబాద్‌’ కార్యక్రమం నగరం వ్యాప్తంగా నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఈ సమావేశంలో పోలీసు ఉన్నతాధికారులు, ఆదిబట్ల సీఐ రవికుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -