అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు యాదయ్య
నవతెలంగాణ – వనపర్తి
గ్రామాలు, పట్టణాలు పరిశుభ్రంగా ఉంచగలిగినపుడే జాతిపిత మహాత్మా గాంధీ కలలుగన్న స్వచ్ఛమైన, ఆరోగ్య భారతదేశాన్ని నిర్మించగలమని అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు యాదయ్య పేర్కొన్నారు. స్వచ్ఛత హి సేవా – 2025 లో భాగంగా సెప్టెంబర్ 17 నుండి అక్టోబర్ 2 వరకు జిల్లాలో పరిశుభ్రత కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. శనివారం లీడ్ బ్యాంక్ కార్యాలయం, వనపర్తి జిల్లా యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఉదయం స్థానిక అమ్మ చెరువు ట్యాంక్ బండ్ పరిసరాల్లో స్వచ్చ భారత్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా అక్కడికి వచ్చిన అధికారులు, ప్రజలు, అగ్ని వీర్ శిక్షణ అభ్యర్థులు తదితరులు ప్లాస్టిక్, చెత్త రహిత సమాజాన్ని నిర్మించేందుకు స్వచ్ఛతను పాటిస్తూ, తోటి వారికి సైతం పరిసరాల పరిశుభ్రతపై అవగాహన కల్పిస్తూ ముందుకు వెళ్తామని ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా ట్యాంక్ బండ్ పరిసరాల్లో ఉన్న చెత్త ను శుభ్రం చేసి ప్లాస్టిక్ కవర్లు, చెత్తను ట్రాక్టర్ ద్వారా డంపింగ్ యార్డును తరలించడం జరిగింది.
ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లడుతూ గ్రామాలు, పట్టణాలు పరిశుభ్రంగా ఉంచగలిగినపుడే జాతిపిత మహాత్మా గాంధీ కలలుగన్న స్వచ్ఛమైన, ఆరోగ్య భారతదేశాన్ని నిర్మించగలమని అన్నారు. పరిసరాల పరిశుభ్రత వల్ల అనారోగ్యం బారిన పడకుండా కాపాడుకోవచ్చు అని చెప్పారు. ప్రజలు ప్లాస్టిక్ వాడకాన్ని స్వచ్ఛందంగా తగ్గించుకోవాలని, ప్లాస్టిక్ వ్యర్థాల వల్ల భూమిలో ప్లాస్టిక్ జరుగకుండా భూమిలో నీటిని ఇంకనివ్వకుండా పర్యావరణాన్ని నాశనం చేస్తుందన్నారు.
ప్రతి ఒక్కరూ ప్లాస్టిక్ రహిత, చెత్త రహిత సమాజాన్ని నిర్మించేందుకు భాగస్వాములు కావాలన్నారు. అంతేకాకుండా, ప్రజలు తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, చెత్తను రోడ్ల పైన, కాలువల్లో కాకుండా తడి పొడి చెత్తను వేరు చేసి మున్సిపాలిటీ వాహనాల్లోనే వేయాలని సూచించారు. సింగిల్ యూస్ ప్లాస్టిక్ వాడకంపై దృష్టి సారించాలన్నారు. పరిసరాలు అపరిశుభ్రంగా ఉండడం వల్ల దోమలు ఈగలు పెరిగి అనేక అనారోగ్య సమస్యలకు కారణాలు అవుతాయని అన్నారు. అనారోగ్యాల వల్ల సంపాదించిన డబ్బులు ఆసుపత్రికి వెచ్చించాల్సి వస్తుందని, అందువల్ల పరిసరాల శుభ్రత వల్ల ఆరోగ్యాన్ని కాపాడుకోవడమే కాకుండా ఆర్థికంగా ఎదగడానికి దోహదపడుతుందన్నారు. స్వచ్ఛత హి సేవా కార్యక్రమంలో పి డి ఆర్ డి ఓ ఉమాదేవి, మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు, జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ అధికారి అఫ్జల్, లీడ్ బ్యాంకు మేనేజర్ శివకుమార్, సహాయ లీడ్ అధికారి సాయి కుమార్, పురపాలక సిబ్బంది, మెప్మా సిబ్బంది, ఇతర సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.