Thursday, November 20, 2025
E-PAPER
Homeరాష్ట్రీయండ్రగ్స్‌ నిర్మూలనకు నిరంతరం పోరాడాలి

డ్రగ్స్‌ నిర్మూలనకు నిరంతరం పోరాడాలి

- Advertisement -

– మత్తుకు యువత దూరంగా ఉండాలి
– వ్యసనాలు ఆర్థిక విధ్వంసాన్ని సృష్టిస్తాయి : ప్రొఫెసర్‌ ఎం.కోదండరామ్‌
– ‘ఎంజాయ్‌ పేరుతో గంజాయి వద్దు’ అనే నినాదంతో కళాయాత్ర ప్రారంభం
నవతెలంగాణ-హిమాయత్‌నగర్‌

సామాజిక రుగ్మతలకు మూలకారణమైన గంజాయి, డ్రగ్స్‌ను నిర్మూలించేందుకు నిరంతరం పోరాడాలని టీజేఎస్‌ అధ్యక్షులు, ప్రొఫెసర్‌ ఎం.కోదండరామ్‌ పిలుపునిచ్చారు. గ్రామాల్లోనూ యువత డ్రగ్స్‌కు బానిసలవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్ర సాంస్కృతిక శాఖ, తెలంగాణ ప్రజానాట్యమండలి సంయుక్త ఆధ్వర్యంలో ‘ఎంజారు పేరుతో గంజాయి వద్దు’ అనే నినాదంతో హైదరాబాద్‌ నిజాం కళాశాల ఆడిటోరియంలో సోమవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టనున్న కళాజాత బస్సు యాత్రను జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం కోదండరామ్‌ మాట్లాడుతూ.. డ్రగ్స్‌, గంజాయి వంటి వ్యసనాలు మనిషి శరీరాన్ని, మెదడును, మనస్సును నియంత్రిస్తాయని తెలిపారు. ఒకసారి డ్రగ్స్‌కు అలవాటు పడితే జీవితాలు నాశనమవుతాయని, ఆ వ్యసనం నుంచి బయటపడటం చాలా కష్టమని చెప్పారు. వ్యసనాలకు దూరంగా ఉండాలని, అవి ఆర్థిక విధ్వంసాన్ని సృష్టిస్తాయని, పర్యావరణానికి నష్టం కలిగిస్తాయని ఆందోళన వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లో అతి కొద్ది మంది సంపన్నులకే పరిమితమైన డ్రగ్స్‌ ప్రస్తుతం గ్రామాలకు చేరిందని, దాని నిర్మూలనకు విస్తృతమైన ప్రచారం చేపట్టాలని సూచించారు. బస్సు యాత్ర చేపడుతున్న ప్రజానాట్యమండలిని అభినందించారు.

నిజాం కళాశాల ప్రిన్సిపాల్‌ ప్రొఫెసర్‌ ఎ.వి.రాజశేఖర్‌ మాట్లాడుతూ.. డ్రగ్స్‌, గంజాయికి అలవాటు పడితే భవిష్యత్‌ అంధకారంగా మారుతుందని, వ్యసనాలకు అందరూ దూరంగా ఉండాలని సూచించారు. తెలంగాణ ప్రజానాట్యమండలి రాష్ట్ర అధ్యక్షులు కె.శ్రీనివాస్‌ మాట్లాడుతూ.. డ్రగ్స్‌, గంజాయి పట్ల రాష్ట్ర వ్యాప్తంగా మరింత అవగాహన కల్పించేందుకు బస్సు కళాజాత నిర్వహిస్తున్నామన్నారు. ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర భాష, సాంస్కృతిక, సామాజిక, ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు సలహా కమిటీ సభ్యులు పల్లె నర్సింహ మాట్లాడుతూ.. డ్రగ్స్‌, గంజాయిని నిర్మూలించేందుకు పాలమూరు, మహాత్మాగాంధీ, కాకతీయ, శాతవాహన, తెలంగాణ యూనివర్సిటీల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్టు వివరించారు. అంతకుముందు ఆడిటోరియంలో ‘మనిషి విలువలు, డ్రగ్స్‌ బారిన పడుతున్న విద్యార్థులు’ అంశంపై ప్రదర్శించిన వీధి నాటకం విద్యార్థులను ఎంతో ఆకట్టుకుంది.
డ్రగ్స్‌కు సంబంధించి పలు గేయాలను తెలంగాణ ప్రజానాట్యమండలి కళాకారులు ఆలపించారు. ఈ కార్యక్రమంలో నిజాం కళాశాల వైస్‌ ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ ఎస్‌.రేణుక, కో-ఆర్డినేటర్లు మంజుల, వెంకటేశ్వర్లు, సుదర్శన్‌, ప్రజానాట్యమండలి ఉపాధ్యక్షులు కె.లక్ష్మీనారాయణ, కె.ఉప్పలయ్య, సహాయ కార్యదర్శి ఎ.రవి, కళాకారులు రాము, సైదులు, విజరు, శ్యామ్‌, రాము తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -