Wednesday, October 1, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంవిద్యుత్‌ సంస్కరణలకు వ్యతిరేకంగా పోరాడాలి

విద్యుత్‌ సంస్కరణలకు వ్యతిరేకంగా పోరాడాలి

- Advertisement -
  • రజక వృత్తిదారుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పైళ్ల ఆశయ్య
  • సత్తెనపల్లి రామకృష్ణ 25వ వర్థంతి సందర్భంగా సెమినార్‌

    నవతెలంగాణ-ముషీరాబాద్‌
    విద్యుత్‌ సంస్కరణలకు వ్యతిరేకంగా వృత్తిదారులంతా పోరాడాలని రజక వృత్తిదారుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పైళ్ల ఆశయ్య పిలుపునిచ్చారు. విద్యుత్‌ ఉద్యమ అమరవీరుడు.. రజక వృత్తిదారుల సంఘం రాష్ట్ర మాజీ కన్వీనర్‌ సత్తెనపల్లి రామకృష్ణ 25వ వర్ధంతి సందర్భంగా సోమవారం హైదరాబాద్‌లోని గోల్కొండ చౌరస్తా లోని సీఐటీయూ సిటీ ఆఫీసులో ”ఉచిత విద్యుత్‌ పథకం-ఎదురవుతున్న సవాళ్లు’ అనే అంశంపై సెమినార్‌ నిర్వహించారు. సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎదునురు మధార్‌ అధ్యక్షతన జరిగిన ఈ సెమినార్‌ లో ఆశయ్య మాట్లాడారు. విద్యుత్‌ అమరవీరుల ఆశయాల దారిలో పయనించాలని, విద్యుత్‌రంగం ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా పోరాడాలని సూచిం చారు. కేంద్రం విద్యుత్‌ ప్రయివేటీకరణ బిల్లును పార్లమెంటులో ఆమోదించి రాష్ట్రాల విద్యుత్‌ సంస్థల ను కేంద్ర ప్రభుత్వ చట్ట పరిధిలోకి తెచ్చి.. ప్రయివేటు వ్యక్తులకు కట్టబెట్టి స్మార్ట్‌ మీటర్ల విధానం తీసుకు రావాలని కుట్ర పన్నుతున్నదన్నారు. దాని వల్ల పేదలకు, రైతులకు భవిష్యత్‌లో ఉచిత విద్యుత్‌ పథకాలు ఉండవని ఆవేదన వ్యక్తం చేశారు.

    రాష్ట్రంలో రజక, క్షౌర, చేనేత వివిధ వృత్తిదారు లకు ఇస్తున్న సబ్సిడీకి ప్రభుత్వం ఏటా నిధులు కేటాయించకపోవడంతో బకాయిలు పెరిగిపోయా యని, అధికారులు వృత్తిదారులను బిల్లులు కట్టాలని వేధిస్తున్నారని తెలిపారు. ఈ సమస్యను వెంటనే పరిష్కరించాలని కోరారు. వృత్తిదారుల సంక్షేమం, ఆధునీకరణ, ఉపాధికి కాంగ్రెస్‌ ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయాలని కోరారు.
    రూ.10 కోట్లతో 10 జిల్లాల్లో మోడ్రన్‌ ధోబిఘాట్లు నిర్మిస్తామని చెప్పారని, ప్రతి వృత్తిదారుడికీ రూ.10 లక్షల రుణం, రజక ఫెడరేషన్‌కు ఏటా వెయ్యి కోట్ల బడ్జెట్‌, పాలకవర్గాల నియామకాలను ప్రభుత్వం అమలు చేయలేదని విమర్శించారు. అమరవీరుల ఆశయ సాధనలో వృత్తిదారుల హక్కుల కోసం భవిష్యత్‌లో అనేక ఉద్యమాలు చేపడతామన్నారు. గొర్రెల, మేకల పెంపకదారుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉడత రవీందర్‌ మాట్లాడుతూ.. విద్యుత్‌ సంస్కరణలకు వ్యతిరేకంగా ఆనాడు వామపక్షాలు, ప్రజాసంఘాలు చేసిన పోరాట ఫలితంగా అనేక హక్కులు సాధించుకున్నామని తెలిపారు. గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీరామ్‌నాయక్‌, డీవైఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్షులు కోట రమేష్‌, నాయకులు గుమ్మడిరాజు నరేష్‌, రజక వృత్తిదారుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎం.బాలకృష్ణ, సి.మల్లేష్‌, జ్యోతి ఉపేందర్‌, మరియాల గోపాల్‌, సి.వెంకటస్వామి, యాదమ్మ, ఎస్‌.సుభద్ర, పి.భాస్కర్‌, సట్టు రవి, కె.యాదగిరి, సీహెచ్‌,నగేష్‌, అల్వాబాబు పాల్గొన్నారు.
- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -