మాజీ ఎమ్మెల్సీ చెరుపల్లి సీతారాములు ఎస్‌వీకేలో బైరు మల్లయ్య 5వ వర్ధంతి సభ
నవతెలంగాణ – ముషీరాబాద్
ఆర్థిక, రాజకీయ, సామాజిక, సాంస్కృతిక రంగాల్లో సమానత్వం సాధించడమే సామాజిక న్యాయమని, అందుకోసం పోరాడాలని మాజీ ఎమ్మెల్సీ చెరుపల్లి సీతారాములు అన్నారు. స్వాతంత్య్ర సమరయోధులు, కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర మాజీ అధ్యక్షులు బైరు మల్లయ్య 5వ వర్ధంతి సభ శనివారం హైదరాబాద్ బాగ్‌లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రం లో కేజీకేఎస్ రాష్ట్ర అధ్యక్షులు మేకపోతుల వెంకటరమణ అధ్యక్షతన జరిగింది. మల్లయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళ్లర్పించారు. ఈ సందర్భంగా చెరుపల్లి మాట్లాడుతూ.. మల్లయ్యతో తనకెంతో అనుబంధం ఉందని, ఆయన కల్లుగీత కార్మికుల హక్కుల కోసం పరితపించే వారన్నారు. గ్రామాలకు వెళ్లి వారిని చైతన్యపరచడంలో ఎంతో కృచేశారన్నారు. కష్టజీవుల తరపున నిలబడి దొరలకు, భూస్వాము లకు వ్యతిరేకంగా పోరాటం చేశారని గుర్తు చేశారు. 79 ఏండ్ల స్వతంత్ర భారతంలో ఇంకా ఆర్థిక, రాజకీయ, సామాజిక న్యాయం రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. లౌకిక, ప్రజాస్వామ్య విలువల కోసం పోరాడటమే మల్లయ్య ఇచ్చే నిజమైన నివాళి అన్నారు.
టీపీఎస్‌కే రాష్ట్ర అధ్యక్షులు భూపతి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో బీసీలకు 42 శాతం రిజర్వేషన్స్ అమలు చేయాలని కోరారు. గీత కార్మికులకు ఇచ్చిన హామీలన్నీ అమలు చేయాలన్నారు. కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బెల్లంకొండ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. గీత కార్మికులకు పెండింగ్ ఎక్స్‌గ్రేషియా డబ్బులు వెంటనే విడుదల చేయాలని, వృత్తి చేసే వారంద రికీ సేఫ్టీ కిట్టులు ఇవ్వాలని అన్నారు. 50 ఏండ్లు నిండిన వారందరికీ పెన్షన్ అమలు చేయాలని, నందనములోని నీరా, తాటి, ఈత ఉత్పత్తుల కేంద్రాన్ని ప్రారంభించాలని కోరారు. ఈ కార్యక్రమంలో గౌడ సంఘం సీనియర్ నాయకులు చింతల మల్లేశంగౌడ్, రజక వృత్తిదారుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.ఆశయ్య, మత్స్య కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లెల్లెల బాలకృష్ణ, గొర్రెలు మేకల పెంపకం దారుల సంఘం రాష్ట్ర కార్యదర్శి ఉడుత రవీందర్, కేజీకేఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు వి.వెంకట నరసయ్య, గౌడ ఐక్య సాధన సమితి రాష్ట్ర అధ్యక్షులు అంబాల నారా యణ గౌడ్, పొన్నం రాజయ్య, నాయకులు కప్పల లింగంగౌడ్, అంబాల శ్రీనివాస్ గౌడ్, బబ్బూరి వేణుగోపాల్ గౌడ్, రొడ్డ లలితగౌడ్ పాల్గొన్నారు.