Thursday, December 18, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంపసుపు రైతుల సంక్షేమానికి బాటలు వేయాలి

పసుపు రైతుల సంక్షేమానికి బాటలు వేయాలి

- Advertisement -

గిట్టుబాటు ధర కల్పించాల్సింది పసుపు బోర్డే
రైతు ఆధారిత పథకాలపై టర్మరిక్‌ సమ్మిట్‌లో మేధోమథనం జరగాలి : టర్మరిక్‌ వాల్యూచైన్‌ సమ్మిట్‌-2025లో మంత్రి తుమ్మల


నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
పసుపు రైతుల సంక్షేమం బాటలు వేయాలనీ, రైతు ఆధారిత పథకాలపై టర్మరిక్‌ సమ్మిట్‌లో మేధోమథనం జరగాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆకాంక్షించారు. మన దేశంలో పండే పసుపును ప్రపంచ మార్కెట్లలో పోటీపడే స్థాయికి తీసుకెళ్లేందుకు సమిష్టి చర్యలు అవసరమని అభిప్రాయపడ్డారు. పసుపు రైతులకు గిట్టుబాటు ధర కల్పించాల్సిన బాధ్యత పసుపుబోర్డుదే అని స్పష్టం చేశారు. బుధవారం హైదరాబాద్‌లో సీఐఐ తెలంగాణ, నేషనల్‌ టెర్మరిక్‌ వాల్యుచైన్‌ సమ్మిట్‌-2025లో ఆయన మాట్లాడారు. ప్రపంచవ్యాప్తంగా పసుపు సాగులో భారత్‌ అగ్రస్థానంలో ఉందని చెప్పారు. అగ్రి విజన్‌ రైజింగ్‌-2047లో పసుపు పాత్ర కీలకం కాబోతుందన్నారు. పసుపు పంట మన సంస్కృతి, సంప్రదాయాల్లో భాగమైందన్నారు. అది వంటింటికే పరిమితం కాకుండా మెడిసిన్‌, ఫంక్షనల్‌ ఫుడ్స్‌, న్యూట్రాస్యూటికల్స్‌ వంటి రంగాల్లో పసుపు వినియోగం పెరుగుతున్నదన్నారు. పసుపును పండించడంలో మన రాష్ట్రంలోని నిజామాబాద్‌, ఆర్మూర్‌ ప్రాంతాలు ప్రసిద్ధి పొందాయనీ, ఆర్మూర్‌ పసుపునకు జీఐ ట్యాగ్‌ కూడా దక్కిందని గుర్తుచేశారు. రాష్ట్రంలో పసుపు బోర్డు కార్యాలయం ఏర్పాటు చేసినప్పటికీ అది పూర్తిస్థాయిలో కార్యాచరణలో లేదన్నారు.

క్వింటా పసుపు ఉత్పత్తికి రైతు రూ.8 వేల నుంచి రూ.9 వేల వరకు ఖర్చుచేస్తున్నారనీ, మార్కెట్‌ ధరలు మాత్రం రూ.12 వేలకు అటుఇటుగా ఉంటున్నాయని చెప్పారు. రైతుకు గిట్టుబాటు ధర దక్కాల్సిన ఆవశ్యకతను నొక్కిచెప్పారు. ప్రపంచ ప్రమాణాలకు తగ్గట్టుగా పసుపు ఉత్పత్తికి చర్యలు తీసుకోవాలని సూచించారు. విజన్‌ 2047 ఇంటిగ్రేటెడ్‌ ఫార్మింగ్‌లో పసుపును భాగం చేయాలని సూచించారు. ఆయిల్‌ ఫామ్‌ వంటి పంటల్లో చెట్ల మధ్య ఖాళీ ప్రదేశాల్లో పసుపు వంటి స్పైస్‌ పంటలను అంతర పంటలుగా సాగు చేయడం ద్వారా తక్కువ రిస్కుతో రైతులకు ఎక్కువ లాభం దక్కుతుందని తెలిపారు. రాష్ట్రంలో పసుపు ప్రాసెసింగ్‌ సెంటర్లు ఏర్పాటు చేయాలనీ, న్యూట్రాస్యూటికల్స్‌, ఇమ్యూనిటీ ఉత్పత్తులు, కాస్మోటిక్స్‌, తదితర ఉత్పత్తుల తయారీకి రైతులను ప్రోత్సహించాలని సూచించారు. ఈ సమావేశంలో పసుపు బోర్డు చైర్మెన్‌ పల్లె గంగారెడ్డి, వ్యవసాయ శాఖ కార్యదర్శి సురేంద్రమోహన్‌, పసుపుబోర్డు కార్యదర్శి భవానీశ్రీ, సీఐఐ తెలంగాణ చైర్మెన్‌ శివప్రసాద్‌రెడ్డి, అగ్రి యూనివర్సిటీ మాజీ వీసీ ప్రవీణ్‌రావు, రైతు సంక్షేమ కమిషన్‌ సభ్యులు గంగాధర్‌, సింథైట్‌ ఇండస్ట్రీస్ స్ట్రాటజిక్‌ సోర్సింగ్‌ హెడ్‌ జయశంకర్‌, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -