Monday, August 4, 2025
E-PAPER
Homeప్రధాన వార్తలుఐక్యపోరాటాలకు సిద్ధం కావాలి

ఐక్యపోరాటాలకు సిద్ధం కావాలి

- Advertisement -

బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల కోసం
రేపు ఇందిరా పార్కు వద్ద ధర్నా
బీజేపీ ఎంపీలు కేంద్రంపై ఒత్తిడి తేవాలి..
లేదంటే రాజీనామా చేయాలి
ఈ విషయంలో సీఎం రేవంత్‌రెడ్డి
అందర్నీ కలుపుకుని పోవాలి : సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

రాష్ట్రంలో 42 శాతం బీసీ రిజర్వేషన్ల సాధన కోసం ఐక్యపోరాటాలకు సన్నద్ధం కావాలనీ, మంగళవారం ఇందిరాపార్కు వద్ద తలపెట్టిన మహాధర్నాను ప్రజలంతా జయప్రదం చేయాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ పిలుపునిచ్చా రు. ఈ విషయంలో రాష్ట్రం నుంచి ఎన్నికైన బీజేపీ ఎంపీలు కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలనీ, లేదంటే రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ పోరాటంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అందర్నీ కలుపుకుని ముందుకు సాగాలని సూచించారు. ఆదివారం ఈ మేరకు జాన్‌వెస్లీ ఒక ప్రకటన విడుదల చేశారు. ”రాష్ట్రంలో కులగణన పూర్తయిం ది. దాని ఆధారంగా బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టగా అన్ని పార్టీలూ మద్దతిచ్చాయి. రాష్ట్ర సర్కారు బిల్లును కేంద్రానికి పంపింది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం బీసీ రిజర్వేషన్లను అడ్డుకుంటున్నది. రాష్ట్ర సర్కారు ఆర్డినెన్స్‌ను పంపిస్తే గవర్నర్‌ జాప్యం చేస్తున్నారు. దీనివల్ల స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ ఆలస్యమవుతున్నది. దాన్ని సాకుగా చూపెట్టి గ్రామ పంచాయతీలకు రావాల్సిన నిధులను కేంద్రం అడ్డుకుంటున్నది. బీసీ రిజర్వేషన్లలో ముస్లింలను తొలగించాలనే అక్రమ డిమాండ్‌ను బీజేపీ ముందుకు తీసుకొస్తున్నది. గుజరాత్‌, ఉత్తరప్రదేశ్‌, రాజస్థాన్‌ లాంటి బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ముస్లింలకు రిజర్వేషన్లు అమలు చేస్తూ తెలంగాణలో మాత్రం అమలు చేయకూడదని అడ్డుతగలడమేంటి? దీనిపై సామాజిక న్యాయం కోరే శక్తులన్నీ దీన్ని ఆలోచించాలి. ముస్లింలలో దూదేకుల, అత్తర్‌సాహెబ్‌, రాళ్ళు కొట్టుకుని బతికేవాళ్ళు(కాసోళ్లు), ఫకీర్ల లాంటి చిన్నచిన్న వృత్తులు చేసుకునేవారికి బీసీ రిజర్వేషన్లు అమలవుతున్నాయి. డబ్బున్న ధనిక వర్గాలకు కాదు. హిందూ బీసీలకు రిజర్వేషన్లు అమలు చేసి, ఇస్లాం స్వీకరించిన బీసీలకు రిజర్వేషన్లు ఉండకూడదన్నది ఎట్లాంటి న్యాయం? అది సామాజిక న్యాయం ఎలా అవుతుంది? రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమైనది. ప్రభుత్వరంగాన్ని ప్రయివేటుపరం చేస్తూ, మొత్తం రిజర్వేషన్లను నిర్లక్ష్యంచేస్తూ బీజేపీ రాజ్యాంగాన్ని నిరుపయోగంగా మారుస్తున్నది. అందులో భాగంగానే బీసీల రిజర్వేషన్లకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నది. బీసీలకు అనుకూలమంటూనే బీజేపీ నాయకులైన బండి సంజరు, కిషన్‌రెడ్డి, రాష్ట్ర అధ్యక్షులు రాంచందర్‌రావు రిజర్వేషన్లను వ్యతిరేకిస్తున్నారు. రాష్ట్రంలో ఎనిమిది మంది బీజేపీ ఎంపీలున్నారు. 42 శాతం బీసీలకు రిజర్వేషన్లు అమలు జరపడానికి కేంద్రం మీద ఒత్తిడి తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకోవాలి కదా? అలా కాకుండా ఈ రిజర్వేషన్లకు అడ్డుపడే చర్యలకు బీజేపీ పాల్పడుతున్నది. రాష్ట్రంలోని బీజేపీ ఎంపీలు పార్లమెంటులో రిజర్వేషన్లకు అనుకూలంగా వ్యవహరించకపోతే వారి రాజీనామాకు ఒత్తిడి చేస్తూ ఆందోళనకు పూనుకుంటాం. సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో 42 శాతం రిజర్వేషన్లను అమలు చేయాలని డిమాండ్‌ చేస్తూ ఆందోళనా కార్యక్రమాలను నిర్వహిస్తున్నది. పార్లమెంటులో బిల్లును ఆమోదించాలని, చట్టం చేయాలని మంగళవారం ఇందిరాపార్కు దగ్గర మహాధర్నాను నిర్వహిస్తున్నాం. సామాజికన్యాయం కోరే శక్తులు, ప్రజానీకం అట్లాగే బీజేపీ, బీసీ రిజర్వేషన్ల వ్యతిరేక విషయాలన్నింటిన్ని కూడా ప్రచారం చేయడానికి, ప్రభుత్వం మీద ఒత్తిడి తేవడానికి ఈ ధర్నాకు అత్యధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం’ అని పేర్కొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -