అసలు చదువు అంటే ఏమిటి?
చదువుకు జ్ఞానానికి తేడా ఉన్నదా?
రెండూ ఒకటేనా?
చదువు వచ్చినవారికి చదువురానివారికి గల వ్యత్యాసాన్ని మనం ఎలా చూడాలి?
ఇవన్నీ ఆధునిక సమాజం వేసుకోవాల్సిన మౌలిక ప్రశ్నలు. ఈప్రశ్నలు వేసుకోకుండా, సమాధానాన్ని దొరకపుచ్చుకోకుండా మనం మన కాలాన్ని నెట్టేస్తున్నాము. మనం మనకు తెలియకుండానే మన భావితారాలకు (పిల్లలకు) అన్యాయం చేస్తున్నామేమోనన్న బాధ కలుగుతున్నది. మరో ప్రక్క మనం మన పూర్వీకుల నుండి ఏమీ నేర్చుకోక బండగ బతికేస్తున్నామేమోనన్న అనుమానం..? లేక దూసుకువస్తున్న సవాళ్లను ఎదుర్కోలేక పలాయనవాదులుగా (ఎస్కేపిస్టులుగా) మారిపోతున్నామా?
అన్న భయం వేస్తున్నది.
ముందుగా చదువు విషయానికి వస్తే, మన విద్యావ్యవస్థ అంతా బ్రిటీష్ వారి మెకాలె విద్యా వ్యవస్థ విడిచిపెట్టిన బూట్లల్లోనే మనం మన కాళ్లు పెట్టి నడిచేస్తున్నాం. వారి సామ్రాజ్యవాద దోపిడీకి అడుగులకు మడుగులొత్తే గుమస్తా గులాంగిరి (మానసిక బానిసత్వం) చదువు వద్దనే మన చదువు ఆగిపోయింది. అంటే కెరీర్ ఓరియంటెడ్. వ్యక్తిగతమైన స్వీయ ప్రయోజనం అభివృద్ధి తప్ప, దేశ ప్రయోజనం, సామాజిక హితం, పర్యావరణ పరిరక్షణ మొదలగు దిశానిర్దేశ చదువులు కానరాకుండా పోయాయి.
మన భారతదేశం పేరుకు ప్రజాస్వామ్యం. గణతంత్రరాజ్యం అయినప్పటికీ, మనిషి స్వేచ్ఛగా, సంపూర్ణంగా, హాయిగా ఎదిగేలా మన విద్యావ్యవస్థ తోడ్పడటం లేదు.
అసలు విద్య పట్ల వ్యక్తికైనా, వ్యవస్థకైనా వుండవలసిన దృక్పథం (పర్‌స్పెక్టివ్) ఏమిటి?
విశ్వకవి రవీంద్రుడు, మహాత్మాగాంధీ, కామ్రేడ్ లెనిన్ లేదా గౌతమబుద్ధుడు ఎవరు ఏ రూపంలో చెప్పినా రెండు ముఖ్య విషయాలు గుర్తు పెట్టుకోవాలి.
- మనిషి సత్యశోధనపై అడుగిడాలి. నిత్యం సత్యాన్ని శోధించాలి. సాధించాలి. అదే ఆచరణలో పెట్టాలి. మానవాళి ప్రగతికి ఇదే ఆధారం. మరో విధమైన అడ్డదారి ఏదీ లేదు.
- మనిషి నిత్యం స్పృహలో (ఎరుకలో) ఉండాలి. స్థూల – ఎరుక. ప్రాపంచిక దృష్టి (ఉదా: గాజాలో జరుగుతున్న యుద్ధదాడి) సూక్ష్మ ఎరుక. రోజువారి చేసే పనులు, బాధలు, బంధాలు, పోరాటాలు మొదలైనవి సహేతుకంగా తెలుసుకునే జ్ఞానాన్ని చదువు ఇవ్వగలగాలి.
ప్రస్తుతం ఈ రెండూ లేక మన విద్యావ్యవస్థ అగాధంలోకి జారిపోతున్నట్లు ఉన్నది కదూ…
చదువుకూ, జ్ఞానానికి తేడా వున్నదా..? అని ప్రశ్నిస్తే నూటికి తొంభైమంది లేదనే చెప్తున్నారు. ఉపాధ్యాయులతో సహా.
జ్ఞానం ఇంద్రియాల నుండి వస్తుందనే సత్యాన్ని మరచిపోయారు (నాలెడ్జ్ కేమ్ ఫ్రమ్ సెన్సెస్). జ్ఞానం పుట్టినప్పటి నుండి చనిపోయేంత వరకూ వస్తూనే వుంటుంది. కావల్సిందల్లా ఆ జ్ఞాన చక్షువులను (ఇంద్రియాలు – కన్ను, చెవి, ముక్కు, నాలుక, చర్మం) సమర్థవంతంగా పని చేసేలా చూసుకోవాలి. జ్ఞానవృద్ధి, వికాసం అలాగే జరుగుతుంది. చదువురాని వారికి కూడా ఈ వృద్దీ, వికాసం లభిస్తుంది. అయితే చదువు ఇంద్రియాలను మరింతగా పదును పెట్టే ఆకురాయి కావాలి.
చదువు అంటే అక్షరజ్ఞానం (లిటరరీ నాలెడ్జ్). ఒక విధంగా పరోక్ష జ్ఞానం. ఈ పరోక్ష జ్ఞానం ప్రత్యక్ష జ్ఞానంగా అంటే అనుభవ సహితంగా పరిణమించినప్పుడు మాత్రమే చదువు జ్ఞానంగా మారుతుంది. అంటే చదువు జ్ఞానవృద్ధికి వాహకమే తప్ప చదువే జ్ఞానం కాదు. ఈ సూక్ష్మం తెలిసినప్పుడు చదువును సమర్ధవంతంగా ఉపయోగించుకోగలం.
కానీ నేడు చదువు కెరీర్ ఓరియంటెడ్‌కు (వ్యక్తిగత వృద్ధి, ఉద్యోగం, సంపాదన) పరిమితమై మార్కులు, ర్యాంకుల హోరులో కొట్టుకుపోతున్నది. ప్రభుత్వ, ప్రయివేటు, కార్పొరేట్ విద్యావ్యవస్థలు అన్నీ అదేబాటలో కొట్టుకుపోవడం గమనిస్తున్నాం.
కాగా చదువు వచ్చినవారికి, చదువు రానివారికి ప్రధాన వ్యత్యాసం 1.చదవడం, 2. రాయడం.
చదవడం వస్తే పఠన భాష అలవడుతుంది. శిష్టవ్యాకరణం వుంటుంది. అందులోనూ మన తెలుగు అజంతా భాష. చక్కగా మాట్లాడడం ఒక కళ. చదువు వలన ఇది సులభ సాధ్యమవుతుంది. అందంగా చదవడం, అర్థవంతంగా చదవడం, ఆకర్షణీయంగా చదవడం, నాటకీయ శైలిలో పాత్రోచితంగా చదవడం… ఇవన్నీ దశలు. చదవడంతో పాటు అలా మాట్లాడటమూ వృద్ధి అవుతంది. చదువుకునే భాష ద్వారా సాహితీ సొబగులు తెలుస్తాయి. మనసు విశాలత్వపు లోతుల్లోకి పోయి ఆలోచనా స్థాయిని పెంచుతుంది. లోకంలోని భిన్న స్థితిగతులను వాస్తవిక దృష్టితో అర్థం చేసుకోవడానికి తోడ్పడుతుంది. మూర్ఖత్వం, మూఢత్వం పెరగకుండా అడ్డుకట్ట వేస్తుంది.
రాయడం వలన మనసులో చెలరేగే భావాలకు స్థిరరూపం వస్తుంది. గందరగోళం నుండి స్పష్టత వైపుకు ప్రయాణం సాధ్యమవుతుంది. మనసులోని అనుభూతులను సరిగా చెప్పుకోలేక, సరిగా రాయలేకపోవడం వలన మానసిక అనారోగ్యానికి గురౌతారని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
చదువు వచ్చినవారు రాస్తున్నకొద్దీ పరిణతి చెందుతారనేది యదార్థం. చదవడం, రాయడం రాకపోతే డిగ్రీలు చెంతన వున్నా నిరక్షరాస్యులుగానే మిగిలిపోతారు.
ఇప్పుడు చాలామంది విద్యార్థులు టెన్త్, ఇంటర్, ఇంజనీరింగ్ పాస్ అయినా, పట్టుమని పది వాక్యాలు సొంతంగా తప్పులు లేకుండా రాయలేకపోతున్నారు. రోజువారీ వచ్చే చిన్న చిన్న లెక్కలను సైతం చేయలేకపోతున్నారు. ఆ విధంగా వారు పునాది విద్యను (ఎఫ్.ఎల్.ఎన్ – ఫౌండేషన్ లిటరసీ న్యూమర్సీ) కోల్పోతున్నారు. కోవిడ్ అనంతరం మన విద్యావ్యవస్థ ఇలా మరింత గందరగోళంలోకి దిగజారిపోయింది. ఆన్‌లైన్ ఎడ్యుకేషన్ పద్ధతి వచ్చి ఉపాధ్యాయ బోధనా పద్ధతిని దెబ్బతీస్తున్నది. ముఖే ముఖే సరస్వతి, ప్రత్యక్ష చర్చాపద్ధతి (డైలాగ్, డిస్కోర్స్), ఆత్మీయ బోధన మొదలైనవి అటకెక్కుతున్నాయి. చాలామంది ఉపాధ్యాయులు ఈ ఒరవడిలో యాంత్రికంగా మారిపోయారు. పిల్లలు – చదువు పట్ల నిర్లక్ష్యంగా వుంటూ కాలక్షేపం చేస్తున్నారు. వృత్తి బాధ్యతలను విస్మరిస్తున్నారు. ఆన్‌లైన్ ఎద్యుకేషన్‌ను ఒక సవాలుగా తీసుకుని దానితో జతకట్టి, అంతకంటే మెరుగ్గా పిల్లలకు పాఠాలు ఎలా నేర్పుగా బోధించవచ్చో అతికొద్దిమంది మాత్రమే గ్రహించిపాటిస్తున్నారు.
ఎ.ఐ. (ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్) ను మనిషి నడుపుతున్నాడా? లేక మనిషే అందులో (ఎ.ఐ.లో) ఇరుక్కుపోతున్నాడా? అనేది నేటి మిలియన్ డాలర్ల ప్రశ్న. కృత్రిమమేధస్సును రూపొందించేది, నడిపించేది మనిషే అన్న సత్యం ప్రతి ఉపాధ్యాయుడికి విస్పష్టంగా వుండాలి.
చిన్నప్పటి నుండి మన విద్యావ్యవస్థలో శాస్త్రీయ ఆలోచన, హేతువాద దృష్టి లోపించడంతో ఉపాధ్యాయులు సైతం గందరగోళంలో చిక్కుకుని మత మౌఢ్యాన్ని నూరిపోస్తున్నారు.
ఒక పక్క మౌఢ్యం (అశాస్త్రీయ అజ్ఞానం), మరోపక్క ఆన్‌లైన్ డిజిటల్ యాంత్రికత, ఇంకోపక్క అర్థం పర్థం లేని బట్టీ ర్యాంకుల రొడ్డు కొట్టుడు… ఇలా ముప్పేట దాడిలో నేటి మన విద్యార్థి అచేతనంగా, నిస్సహాయకంగా మిగులుతున్నాడు. ఆత్మస్థైర్యం కరువై ఆత్మహత్యలకు చేరువవుతున్నాడు. చదువులా.. చావులా అన్న దుస్థితి దాపురించింది.
దీనికి విరుగుడు ఒక్కటే. అయ్యవారు వచ్చేదాకా అమావాస్య ఆగదు అన్నట్టు ఎక్కడికక్కడ సృజనశీల శిక్షణాకేంద్రాలు ఏర్పాటు చేసుకోవాలి. జీవితం పట్ల ఆశను, అనురక్తినిరేకెత్తించేలా భవిత పట్ల విశ్వాసం కలిగించేలా పునాది విద్యను గరపాలి. మన పిల్లల్ని మనమే కాపాడుకోవాలి.
- కె.శాంతారావు, 9959745723