– ముక్త కంఠంతో ఖండించిన వామపక్షాలు, పలు రాజకీయ పార్టీలు
– వెనిజులాకు సంఘీభావంగా బహిరంగ సభ
న్యూఢిల్లీ : వెనిజులాపై అమెరికా సాయుధ దురాక్రమణను పలువురు రాజకీయ నేతలు, పార్లమెంట్ సభ్యులు తీవ్రంగా ఖండించారు. ఇది, అంతర్జాతీయ చట్టాన్ని, ఐక్యరాజ్య సమితి నిబంధనావళిని తీవ్రంగా ఉల్లంఘించడమేనన్నారు. ఒక దేశం సార్వభౌమాధికారాన్ని దారుణంగా ఉల్లంఘించి, వారి అంతర్గత వ్యవహరాల్లో జోక్యం చేసుకోవడాన్ని నిరసించారు.
దేశ రాజధానిలోని హరికిషన్ సింగ్ సూర్జిత్ భవన్‌లో సోమవారం అమెరికా తీరును ఖండిస్తూ బహిరంగ సభ జరిగింది. సీపీఐ(ఎం) నేత ప్రకాశ్ కరత్ అధ్యక్షతన జరిగిన ఈ సభలో వామపక్ష పార్టీల నాయకులు పాల్గొన్నారు.
ఈ సభ వెనిజులాకు సంపూర్ణ సంఘీభావాన్ని ప్రకటించింది. ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికైన అధ్యక్షుడు మదురో, ఆయన భార్యను కిడ్నాప్ చేయడాన్ని తీవ్రంగా ఖండించింది. తద్వారా ప్రపంచంలో ఒక ప్రమాదకరమైన ఆనవాయితీని అమెరికా ప్రవేశపెట్టిందని విమర్శించింది. ఈ దారుణాలను ప్రజాస్వామ్య శక్తులన్నీ ముక్త కంఠంతో ఖండించాలని కరత్ కోరారు. సామ్రాజ్యవాదాన్ని వ్యతిరేకించి, సార్వబౌమాధికారాన్ని పరిరక్షించుకున్న గొప్ప సాంప్రదాయం భారత్ ప్రజలకుందని ఆయన గుర్తు చేశారు. ఈ సాంప్రదాయాన్ని మనం కాపాడుకోవాలన్నారు.
సభ లో సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి ఎం.ఎ.బేబీ, సీపీఐ ప్రధాన కార్యదర్శి డి.రాజా, సీపీఐ(ఎంఎల్) లిబరేషన్ నేత రవి రారు, ఏఐఎఫ్‌బీ ప్రధాన కార్యదర్శి జి.దేవరాజన్, ఆర్.ఎస్.సాగర్(ఆర్‌ఎస్‌పీ), తిరుచి శివ(డీఎంకే ఎంపీ), జావేద్ అలీ ఖాన్ (సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ), మనోజ ఝా (ఆర్జేడీ ఎంపీ), సందీప్ పాథక్ (ఆప్ ఎంపీ)లతో పాటూ పలు రాజకీయ పార్టీలకు చెందిన నేతలు, ఎంపీలు పాల్గొని ప్రసంగించారు.
అనంతరం వెనిజులాకు సంఘీభావాన్ని ప్రకటిస్తూ, అమెరికా దురాక్రమణను ఖండిస్తూ సభ ఒక తీర్మానాన్ని ఆమోదించింది. అమెరికా ఆక్రమణ చర్యలను బహిరంగంగా ఖండిస్తూ, వెనిజులా, క్యూబా, పాలస్తీనా ప్రజలకు సంఘీభావాన్ని ప్రకటించాలని భారత ప్రభుత్వాన్ని తీర్మానం కోరింది.
అమెరికా దారుణాలను ప్రతిఘటించాలి
- Advertisement -
- Advertisement -



