సీపీఐ(ఎం) అభ్యర్థులను గెలిపించుకోవాలి
మంత్రి వాకిటి శ్రీహరితో కలిసి సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ ప్రచారం
అమరచింతలో రోడ్ షో
నవతెలంగాణ -ఆత్మకూర్
వ్యవసాయ కూలీలు, కార్మికులు, పేద ప్రజల సమస్యల పరిష్కారం కొరకు, పట్టణ అభివృద్ధి కోసం ప్రజల పక్షాన పోరాడే సీపీఐ(ఎం), కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని మక్తల్ ఎమ్మెల్యే, మంత్రి వాకిటి శ్రీహరి, సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ అమరచింత ప్రజలను కోరారు. ఆదివారం వనపర్తి జిల్లా అమరచింత పట్టణంలోని రాజీవ్ గాంధీ విగ్రహం దగ్గర రోడ్ షో నిర్వహించారు. రాజవాలి దర్గా వద్ద చద్దర్ సమర్పించారు. అనంతరం 10 వార్డుల్లో రోడ్ షో నిర్వహించారు. మంత్రి వాకిటి శ్రీహరి మాట్లాడుతూ 10 వార్డుల్లో ఏడుగురు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు, మూడు వార్డుల్లో సీపీఐ(ఎం) అభ్యర్థులకు పట్టణ ప్రజలు మద్దతు తెలిపి ఓట్లు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. రేవంత్‌రెడ్డి హయాంలో అమరచింత మున్సిపాలిటీకి కోట్లాది రూపాయలు మంజూరు చేసి అభివృద్ధి పనులు చేశామన్నారు.
అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు, పింఛన్లు అనేక సంక్షేమ పథకాలు అందజేస్తామన్నారు. అమరచింత పట్టణంలో ఇద్దరు మైనార్టీలకు కౌన్సిలర్ అభ్యర్థులుగా కాంగ్రెస్ అవకాశం ఇచ్చిందని చెప్పారు. సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ మాట్లాడుతూ కాంగ్రెస్, సీపీఐ(ఎం) మధ్య ఇక్కడ జరిగిన పొత్తులో భాగంగా కలిసి పోటీ చేయడం జరిగిందన్నారు. రెండు పార్టీల అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించుకోవాలని కోరారు. పేద ప్రజల కార్మికుల కష్టజీవుల సమస్యలను పరిష్క రించడంలో కేంద్రప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. బీజేపీకు ఓటు అడిగి హక్కు లేదన్నారు. ఎందుకంటే మతాల మధ్య చిచ్చుపెట్టి లబ్ది పొందే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. బీజేపీకి వ్యతిరేకంగా ప్రతి ఒక్కరు నిలబడాలన్నారు. అందరికీ ఉచితంగా విద్య వైద్యం అందాలని, అందరికీ ఉపాధి అవకాశం లభించాలని అందరూ కలిసిమెలిసి ఉండేందుకు ఎర్రజెండా పోరాటం చేస్తుందన్నారు.
అధికారంలో ఉన్నా లేకున్నా ఎల్లప్పుడు ప్రజల సమస్యల పరిష్కారం కోసం పోరాడుతుందన్నారు. బీడీ చేనేత కార్మికులు ఇతర రైతాంగ కూలీలు వెనుకబడిన వారు ఈ ప్రాంతంలో ఎక్కువ మంది ఉన్నారని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం, మంత్రి కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో టీపీసీసీ అధికార ప్రతినిధి కల్లుగీత కార్మిక విభాగ చైర్మన్ కేశం నాగరాజు గౌడ్ , సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎండి జబ్బార్, సీనియర్ నాయకులు మహమూద్, కాంగ్రెస్ జిల్లా నాయకులు అయూబ్ ఖాన్, సీపీఐ(ఎం)జిల్లా నాయకులు వెంకటేష్, ఆర్‌ఎన్ రమేష్ ,జి ఎస్ గోపి, ఎస్ రాజు ,అజయ్ బుచ్చన్న, రాఘవేంద్ర ,శ్యాంసుందర్ ,విష్ణు ,వెంకటేష్ ,నరసింహ ,కాంగ్రెస్ మండల అధ్యక్షులు మహేందర్ రెడ్డి, పట్టణ అధ్యక్షుడు అరుణ్ కుమార్, కాంగ్రెస్ ,సీపీఐ(ఎం) కౌన్సిలర్ అభ్యర్థులు, నాయకులు పాల్గొన్నారు.



