Wednesday, July 30, 2025
E-PAPER
Homeతాజా వార్తలుబనకచర్లను నిలువరించాల్సిందే

బనకచర్లను నిలువరించాల్సిందే

- Advertisement -

– ప్రజాసమస్యలపై పోరాటాలను ఉధృతం చేయాలి : బీఆర్‌ఎస్‌ శ్రేణులకు కేసీఆర్‌ పిలుపు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌

తెలంగాణ సాగు నీటి రంగాన్ని ఆగం చేసేలా ఉన్న బనకచర్ల ప్రాజెక్టును ఎట్టి పరిస్థితుల్లోనైనా నిలువరించాల్సిందేనని బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ సీఎం కే.చంద్రశేఖర్‌రావు చెప్పారు. అందుకోసం బీఆర్‌ఎస్‌ శ్రేణులు పోరాటాలకు సన్నద్ధం కావాలని ఆయన పిలుపునిచ్చారు. పార్టీ తరఫున క్షేత్రస్థాయిలో చేపట్టాల్సిన ఆందోళనలకు సంబంధించి మంగళవారం ఎర్రవెల్లిలోని ఫామ్‌హౌజ్‌లో కేసీఆర్‌ ప్రత్యేక సమావేశం నిర్వహించారు. కార్యనిర్వాహక అధ్యక్షులు కేటీఆర్‌, మాజీ మంత్రులు హరీశ్‌రావు, జగదీశ్‌రెడ్డిలతో పాటు పలువురు సీనియర్‌ నేతలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేసీఆర్‌ మాట్లాడుతూ..రైతాంగ సంక్షేమం కోసం, వ్యవసాయ సంక్షోభాన్ని నివారించేందుకు పార్టీ శ్రేణులు పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఆంధ్రా ప్రయోజనాలను కాపాడేందుకు కాంగ్రెస్‌ సర్కారు స్వయంగా కొన్ని పాలనా విధానాలను అమలు చేయడం దుర్మార్గమని విమర్శించారు. నమ్మిన పాపానికి సీఎం రేవంత్‌రెడ్డి తెలంగాణ రైతాంగానికి తీవ్ర అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు. తెలుగు రాష్ట్రాల్లో చంద్రబాబు, ఢిల్లీలో మోడీ ప్రయోజనాలను కాపాడేందుకు సీఎం తహతహలాడుతున్నారని విమర్శించారు. రాష్ట్రంలో యూరియా కొరతున్నా రాష్ట్ర ప్రభుత్వానికి పట్టడం లేదన్నారు. కాంగ్రెస్‌, బీజేపీ నేతలు పరస్పరం విమర్శలు చేసుకుంటూ ప్రజా సమస్యలను గాలికొదిలేశాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి తరుణంలో ప్రజా సమస్యల మీద పోరాడేందుకు పార్టీకి సంబంధించిన అన్ని అనుబంధ వ్యవస్థలను బలోపేతం చేయాలని దిశానిర్దేశం చేశారు. ఆయా వ్యవస్థలు క్షేత్రస్థా యిలో పోరాటాలు చేస్తూ ప్రజలతో మమేకం కావాలని కేసీఆర్‌ పిలుపునిచ్చారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -