కుల, మతాల పేరుతో ఓట్లు దండుకుంటున్న బీజేపీ
హామీలు అమలు చేయని మోసకారి కాంగ్రెస్
వేములవాడలో ఎన్నికల ప్రచారసభలో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
నవతెలంగాణ – వేములవాడ
కులం, మతం పేరుతో ఓట్లు అడుగుతున్న బీజేపీ, హామీలను అమలు చేయకుండా మోసం చేసిన కాంగ్రెస్‌కు మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పాలని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో శుక్రవారం మున్సిపల్ ఎన్నికల ప్రచార సభలో నియోజకవర్గ ఇన్‌చార్జి చల్మెడ లక్ష్మీనరసింహారావుతో కలిసి కేటీఆర్ పాల్గొని మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ దొంగ హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజల్ని మోసం చేస్తోందని ఆరోపించారు. ఆరు గ్యారంటీల పేరుతో ప్రజలను మభ్యపెట్టి, అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క హామీనీ సరిగా అమలు చేయలేదన్నారు. ఎన్నికల సమయంలో వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ బాండ్ పేపర్‌పై రాసి ఆరు గ్యారంటీలను వంద రోజుల్లో అమలు చేస్తానన్న హామీని గుర్తు చేస్తూ.. ఆ బాండ్ పేపర్‌ను సభలో ప్రజల ముందు ప్రదర్శించారు. నాలుగు సార్లు ఓడిపోయానని, ఈసారి ఓటు వేయకపోతే చనిపోతానని సానుభూతి డైలాగులతో ప్రజలను మభ్యపెట్టిన ఆది శ్రీనివాస్.. ఆ తర్వాత అభివృద్ధి గురించి పట్టించుకోలేదని విమర్శించారు.
వేములవాడ నియోజకవర్గానికి ఏం చేశారో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. ఇన్ని మోసాలు, ద్రోహాల తర్వాత కూడా ఈ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఓటు వేస్తే, ప్రజలు తమ మోసాలను ఆమోదించినట్టేనని రేవంత్‌రెడ్డి ప్రభుత్వం భావిస్తోందని అన్నారు. అలా జరిగితే భవిష్యత్‌లో హామీల అమలుపై దృష్టి పెట్టే అవకాశమే ఉండదన్నారు. రూ.4 వేల పెన్షన్, ఆసరా పెన్షన్, రైతు భరోసా, కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్, తులం బంగారం వంటి హామీలు అమలు కావాలంటే ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఓటు వేయాలని పిలుపునిచ్చారు. అప్పుడే తమ మోసాలపై ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారన్న విషయం ప్రభుత్వానికి అర్థమవుతుందని చెప్పారు.కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కూడా తెలంగాణకు చేసింది ఏమీ లేదని కేటీఆర్ విమర్శించారు.
ఇదే పార్లమెంట్ నియోజకవర్గం నుంచి రెండుసార్లు ప్రాతినిధ్యం వహించిన కేంద్ర మంత్రి బండి సంజరు చేసిన అభివృద్ధి ఏమిటో చెప్పాలని ప్రశ్నించారు. ప్రతి ఇంటికీ రూ.15 లక్షలు ఇస్తానన్న ప్రధాని మోడీ హామీ ఏమైందని నిలదీశారు. ఎన్నికలొచ్చినప్పుడల్లా దేవుడి పేరు, కులం, మతం పేరుతో ప్రజలతో ఓట్లు వేయించుకోవడమే బీజేపీ పని అని ఆరోపించారు. బీజేపీ దొంగ మాటలను నమ్మొద్దని, పేదల కడుపులు నింపి తెలంగాణ సాధించిన నాయకుడు కేసీఆర్‌ను గుర్తు పెట్టుకొని బీఆర్‌ఎస్‌కు ఓటు వేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ ఎన్నికల్లో వేసే ప్రతి ఓటూ మరోసారి కేసీఆర్‌ను ముఖ్యమంత్రిని చేసే ప్రస్థానానికి తొలి అడుగుగా మారాలని అన్నారు. ఈ ప్రచార కార్యక్రమంలో మాజీ జెడ్పీ చైర్‌పర్సన్ అరుణ, మున్సిపల్ అభ్యర్థులు నిమ్మచెట్టి విజయ్, గోలి మహేష్, మారం కుమార్, నరాల శేఖర్, బీఆర్‌ఎస్ నాయకులు పాల్గొన్నారు.
మున్సిపల్ ఎన్నికల్లో రెండు పార్టీలకూ బుద్ధి చెప్పాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



