ప్రగతిశీల రాజకీయ నేతలు, మేధావుల పిలుపు
న్యూఢిల్లీ : ప్రపంచ వ్యాప్తంగా ఫాసిస్టు శక్తులకు వ్యతిరేకంగా బలమైన సమష్టి చర్యకు పూనుకోవాలని సుమారు యాభై దేశాలకు చెందిన మేధావులు, ప్రగతిశీల రాజకీయ నేతలు పిలుపునిచ్చారు. కమిటీ ఫర్ ది అబాలిషన్ ఆఫ్ ఇల్లెజిటిమేట్ డెట్ (సీఏడీటీఎం) అనే అంతర్జాతీయ సంస్థ ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ సంస్థలో మేధావులు, పరిశోధకులు, ప్రగతిశీల భావాలు కలిగిన రాజకీయ నేతలు సభ్యులుగా ఉన్నారు. సంస్థ విడుదల చేసిన ప్రకటనపై బ్రిటన్ రాజకీయ నాయకుడు జెరెమీ కార్బిన్, గ్రీకు ఆర్థికవేత్త యానిస్ వరోఫాకిన్, వామపక్ష మేధావులు, కార్యకర్తలు నాన్సీ ఫ్రేజర్, అచిన్ వానిక్, విజరు ప్రసాద్, జాకోబిన్ వ్యవస్థాపక సంపాదకుడు భాస్కర్ సుంకర, సీఏడీటీఎం ప్రతినిధి ఎరిక్ టౌసెయింట్ తదితర ప్రముఖులు సంతకాలు చేశారు. ప్రపంచంలోని ప్రతి ఖండంలోనూ నయా ఫాసిస్టు శక్తులు చెలరేగిపోతున్నాయని వారు ఆందోళన వ్యక్తం చేశారు.
‘సంపదను కూడబెట్టాలన్న కోరిక, గరిష్ట లాభాల కోసం అవిశ్రాంత ప్రయత్నం, వనరుల స్వాధీనం, దోపిడీ లక్ష్యంగా సామ్రాజ్యవాద దురాక్రమణ తీవ్రమవుతోంది. పాలస్తీనా విషయంలో జరిగింది ఇదే. అక్కడ ఇజ్రాయిల్ తన సామ్రాజ్యవాద మిత్రదేశాల సహకారంతో మారణహోమం జరిపింది. ప్రపంచంలో ఫాసిజం ముప్పు ప్రాంతాలు, దేశాలను బట్టి వేర్వేరు రూపాలలో ఎదురవు తోంది. అయితే వాటిలోని సారూప్యతను తక్షణమే గుర్తించాల్సిన అవసరం ఉంది. కార్మిక హక్కులను హరించడం, వారికి లభిస్తున్న రక్షణలను తొలగించడం, కార్మిక సంఘాలను అణచివేయడం, సామాజిక భద్రతను నిర్వీర్యం చేయడం, ఉపాధి కార్మికులను అనిశ్చిత పరిస్థితులలోకి నెట్టడం, ప్రభుత్వ సేవలను ప్రైవేటీక రించడం, వాతావరణ మార్పులను తిరస్కరించడం, హద్దులు దాటుతున్న ప్రభుత్వ రుణాలను పొదుపు చర్యలకు సాకుగా చూపడం, వ్యవసాయాన్ని వ్యాపారీకరించడం, అభివృద్ధి ప్రాజెక్టుల పేరుతో స్థానిక ప్రజలను నిర్వాసితులను చేయడం, నిర్బంధ వలస విధానాలను కఠినతరం చేయడం, సైనిక వ్యయాన్ని పెంచడం… ఇవన్నీ నయా ఫాసిజం రూపాలే’ అని ఆ ప్రకటన వివరించింది.
ఇలాంటి విధానాలను అమలు చేయడం ద్వారా పాలకులు తరచుగా పౌర స్వేచ్ఛను, అసమ్మతిని, భావ వ్యక్తీకరణను, సమావేశ హక్కులను అణచివేస్తున్నారని సంయుక్త ప్రకటన విమర్శించింది. కార్మికులు, రైతులు, వలసదారులు, మహిళలు, జాతి పరంగా అణచివేతకు గురవుతున్న సంఘాలు, మైనారిటీలు, స్థానికులను ఫాసిజం శక్తుల బారి నుంచి కాపాడడానికి సమన్వయంతో కూడిన అంతర్జాతీయ పోరాటం అవసరమని పిలుపునిచ్చింది. మార్చిలో బ్రెజిల్‌లో ‘అంతర్జాతీయ ఫాసిస్టు, సామ్రాజ్యవాద వ్యతిరేక’ సదస్సు జరగనున్న నేపథ్యంలో ఈ ప్రకటనను విడుదల చేశారు. పర్యావరణాన్ని ధ్వంసం చేస్తున్న పెట్టుబడిదారీ విధానం నుంచి ప్రకృతిని రక్షించడానికి, సామ్రాజ్యవాద-వలసవాద దురాక్రమణను ఎదుర్కోవడానికి, అణచివేతలను ప్రతిఘటించే ప్రజా పోరాటాలకు మద్దతు ఇవ్వడానికి అందరూ ఏకం కావాల్సిన అవసరం ఉన్నదని ప్రకటన నొక్కి చెప్పింది.



