సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు తుమ్మల వీరారెడ్డి
నవతెలంగాణ – మిర్యాలగూడ
కార్మికుల హక్కుల చట్టాల పరిరక్షణ కోసం అన్ని రంగాల కార్మికులు సమరశీల పోరాటాలు నిర్వహించాలని సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు తుమ్మల వీరారెడ్డి పిలుపునిచ్చారు. సోమవారం నల్గొండ జిల్లా మిర్యాలగూడలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కార్మికుల హక్కుల చట్టాలను నిర్విరం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్ర చేస్తుందని దానికి రాష్ట్ర ప్రభుత్వం వత్తాసు పలుకుతుందని ఆరోపించారు. 8 గంటల పని విధానాన్ని తొలగించి 10 గంటల పని విధానాన్ని అమలు చేస్తున్నారని ఆరోపించారు. కార్మికుల హక్కులు సంక్షేమం కోసం ఏర్పాటు చేసిన నాలుగు లేబర్ కోడులను రద్దుచేసి కార్మికుల చట్టాలను కేంద్ర ప్రభుత్వం నిర్విరం చేస్తుందని ధ్వజమెత్తారు. చట్టాలను కాపాడుకునేందుకు కార్మికులు పోరాటాలు నిర్వహించాలని సూచించారు.
కార్మిక చట్టాలు సక్రమంగా అమలు కాకుండా ప్రభుత్వాలు ప్రయత్నాలు చేస్తున్నాయని అందులో భాగంగానే లేబర్ అధికారులను తనిఖీలు చేయకుండా అడ్డకుంటున్నారని విమర్శించారు. కార్మికులతో వెట్టిచాకిరి చేయించుకుంటున్నారన్నారు. కార్మికులు పోరాడి సాధించుకున్న అగ్రిమెంట్లు, ప్రమాద బీమా లాంటి సంక్షేమ పథకాలు నిర్విరమవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కార్మికులు సంఘటితంగా ఉండి సంఘాలు ఏర్పాటు చేసుకొని హక్కుల సాధన కోసం చట్టాల పరిరక్షణ కోసం బలమైన పోరాటాలు చేయాలని కోరారు. కార్మికుల సంక్షేమం కోసం సిఐటియు అండగా ఉంటుందన్నారు. ఈ సమావేశంలో సిఐటియు రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు డబ్బికార్ మల్లేష్, సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి డాక్టర్ మల్లు గౌతమ్ రెడ్డి, హమాలి వర్కర్స్ ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు తిరుపతి రామ్మూర్తి, జిల్లా నాయకులు రొండి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.



