ప్రధాని మోడీ
ఇంధన సంక్షోభ నేపథ్యంలో రాష్ట్రాల సన్నద్ధతపై సమీక్ష
పలు రాష్ట్రాల సీఎంలతో వీడియో కాన్ఫరెన్ప్
న్యూఢిల్లీ : పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతున్న నేపథ్యంలో ప్రధాని మోడీ పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో శుక్రవారం సమావేశమయ్యారు. ఎన్నికలు జరుగుతున్న పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ, అసోం, పుదుచ్చేరి ముఖ్యమంత్రులు మినహా మిగిలిన రాష్ట్రాల సీఎంలతో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. యుద్ధంతో ఇంధన సంక్షోభం కొనసాగుతున్న తరుణంలో రాష్ట్రాల సన్నద్ధతపై, వారి ప్రణాళికల పై సమీక్ష జరిపారు. టీమ్ ఇండియా స్ఫూర్తితో ఈ కృషిలో సమన్వయం సాధించడమే ఈ వీడియో సమావేశం లక్ష్యమని అధికార వర్గాలు పేర్కొన్నాయి. సుమారు రెండున్నర గంటల పాటు చర్చలు కొనసాగాయి. పశ్చిమాసియా యుద్ధం వేళ ఇంధన సంక్షోభం, తదితర అంశాలపై చర్చించారు.
పెట్రోల్, డీజీల్, ఎల్పీజీ, ఎరువుల సరఫరాకు ఎదురవుతున్న సమస్యలపై మాట్లాడారు. దీనిలో భాగంగా పీఎం మోడీ మాట్లాడుతూ… కలిసికట్టుగా పని చేస్తేనే పరిస్థితులను అధిగమించొచ్చన్నారు. ఆర్థిక, వాణిజ్య స్థిరత్వాన్ని కాపాడుకోవడమే ప్రాధాన్యమని, ప్రజాప్రయోజనాలను పరిరక్షించడమే లక్ష్యంగా అంతా పని చేయాలని తెలిపారు. ఎరువుల నిల్వ, పంపిణీపై ముందస్తు ప్రణాళిక ఏర్పాటు చేయాలని రాష్ట్రాల సీఎంలకు మోడీ ఆదేశించారు. పశ్చిమాసియాలో యుద్ధం మొదలైన తర్వాత ప్రధాని ఇలాంటి సమావేశాన్ని ఏర్పాటు చేయడం ఇదే మొదటిసారి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, యూపీ, పంజాబ్, గుజరాత్, జమ్మూకాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, అరుణాచల్‌ప్రదేశ్ ముఖ్యమంత్రులు పాల్గొన్నారు.
ఎన్నికల ప్రవర్తనా నియమావళి (ఎంసీసీ) అమల్లో ఉన్నందున ఎన్నికలు జరిగే రాష్ట్రాల సీఎంలు పాల్గొనలేదు. అలాగే రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, హోంమంత్రి అమిత్‌షాలు కూడా పాల్గొన్నారు. కాగా ఎన్నికలు జరిగే ఈ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంత చీఫ్ సెక్రెటరీలతో విడిగా క్యాబినెట్ సెక్రెటేరియట్ సమావేశం జరపనుంది. మార్చి 25న ప్రభుత్వం అఖిలపక్షం నిర్వహించి పశ్చిమాసియాలో తలెత్తిన పరిస్థితులను వివరించింది. ఇంధన సంక్షోభం తలెత్తిన నేపథ్యంలో ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను, సవివరమైన ప్రణాళికలను ఆ సమావేశంలో వివరించారు. ఈ ఇంధన సంక్షోభం సుదీర్ఘ కాలం కొనసాగే అవకాశం వుందంటూ ఈ నెల 23న లోక్‌సభలో మాట్లాడుతూ ప్రధాని పేర్కొన్నారు. కోవిడ్ సమయంలో అందరం కలిసి ఎలా ఎదుర్కొన్నామో ఇప్పుడు కూడా దేశం అందుకు సన్నద్ధంగా వుండాలని కోరారు.


