మహిళలకు భద్రత కల్పించాలి
ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి
మానవహక్కుల దినోత్సవం సందర్భంగా ర్యాలీ
నవతెలంగాణ – ముషీరాబాద్
గౌరవంగా జీవించే హక్కు, గౌరవప్రదమైన ఉపాధి, ఉద్యోగం, వివక్ష లేని సమాజం కావాలని ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి అన్నారు. అలాగే, మహిళలకు భద్రత కల్పించాలని కోరారు. ఐద్వా కేంద్ర కమిటీ పిలుపులో భాగంగా బుధవారం అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవాన్ని పుర స్కరించుకుని హైదరాబాద్ వీఎస్టీ నుంచి బాగ్‌లింగంపల్లిలోని ఐద్వా కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఐద్వా రాష్ట్ర అధ్యక్షులు ఆర్.అరుణ జ్యోతి అధ్యక్షతన జరిగిన సభలో మల్లు లకిë మాట్లాడుతూ.. రాజ్యాంగం ద్వారా పుట్టుకతోనే ప్రతి వ్యక్తికీ కొన్ని హక్కులు లభిస్తాయని తెలిపారు. అయితే, వాటిని పరిరక్షించడం ప్రభుత్వాల బాధ్యత అని, కానీ ఎక్కడా అమలు కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సమస్త మానవాళి జాతి, కులం, మతం, ప్రాంతం, లింగం పేరుతో వివక్షకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలందరూ స్వేచ్ఛ, స్వాతంత్య్రాలతో, సమాన హక్కులతో జీవించాలన్నది ఐక్య రాజ్యసమితి ఆశ యమని చెప్పారు.
అందుకు భిన్నంగా దేశంలో బీజేపీ అధి కారంలోకి వచ్చినప్పటి నుంచి భావ ప్రకటన స్వేచ్ఛపై దాడి జరుగుతోందన్నారు. హక్కుల కోసం ఉద్య మిస్తున్న సామాజిక కార్యకర్తలపై దాడి చేసి చంపుతున్నారన్నారు. ఐద్వా రాష్ట్ర అధ్యక్షులు అరుణ జ్యోతి మాట్లాడుతూ.. దేశంలో ఇంకా లింగ వివక్ష కొనసాగుతోందని, మహిళల పట్ల హింస అనేక రూపాల్లో కొనసాగుతోందని అన్నారు. అసమానతలు, హింస, మద్యం, డ్రగ్స్ లేని సమాజం, రక్తహీనత రహిత భారతదేశం కావాలన్నారు. మహిళల హక్కుల సాధనకు ఉద్యమించాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎం.వినోద, పి.శశికళ, వై.వరలక్ష్మి మాట్లాడుతూ.. స్వాతంత్య్రం వచ్చి 78 ఏండ్ల యినా ప్రజలకు ఆ ఫలాలు అందకపోవడం బాధాకర మన్నారు. చిన్నపిల్లలపైనా, మహిళలపైనా లైంగిక దాడులు, హత్యలు పెరుగుతున్నాయని, వాటిని అరికట్టడంలో ప్రభుత్వాలు విఫలమవుతున్నాయని చెప్పారు. విద్య, వైద్యం ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఐద్వా రాష్ట్ర కమిటీ సభ్యులు లక్ష్మమ్మ, పద్మ, స్వర్ణలత, షబానా బేగం, మంగ, విమల, కవిత పాల్గొన్నారు.



