Sunday, January 25, 2026
E-PAPER
Homeఎడిట్ పేజి'అశ్వమిత్‌'లు కావాలిప్పుడు!

‘అశ్వమిత్‌’లు కావాలిప్పుడు!

- Advertisement -

”సామాజిక రాజకీయాలలో/ జరుగుతున్న దారుణాలెట్టివి?/ కార్పొరేట్‌ బొజ్జలు నింపే బుల్డోజరు పాలనయే తీరు!/ జరుగుతున్న వర్తమానం! / తెలుసుకొనుట కావాలిప్పుడు / దాచేస్తే దాగని సత్యాలు!” అంటూ శ్రీశ్రీ పద్యానికి మారుగా ఇలా పాడుకోవాలి మనం. అసలైన, ప్రజలు తెలుసుకోవాల్సిన విషయాలెప్పుడూ అట్టడుగున పడేసి కనపడకుండా చేస్తూనే ఉంటారు పాలకులు. వాటన్నింటిని పట్టుకుని వెలికితీసి ఎరుకపరచడమే విజ్ఞులు చేయాల్సినపని. అసలు విషయాలు తెలిస్తే, వాస్తవాలు బోధపడితే, ప్రశ్నలు ఆయుధాలై ఎక్కుపెట్టబడతాయని వాళ్లకు తెలుసు. తెలుసుకోవడం, ప్రశ్నించడం, మార్చుకోవడం.. ఇవి మాత్రమే సమాజాన్ని ముందుకు నడిపిస్తాయి. అభివృద్ధిని సాధిస్తాయి. వీటిని తలెత్తకుండా చేయటమే అనాదిగా జరుగుతున్నది. అందుకే ప్రశ్న అంటే తుపాకి ఎక్కుపెట్టిన దానికన్నా ఎక్కువగా భయపడిపోతారు. కానీ ప్రజాస్వామ్యం అంటే ప్రశ్న, జవాబుల ప్రయాణం కదా! నియంతలందుకే ప్రశ్నల పీకనొక్కేస్తారు. నిర్బంధానికి గురిచేస్తరు. ప్రశ్న లేవనెత్తగానే ఉమర్‌ఖాలీద్‌ను, షర్జీల్‌ ఇమామ్‌ను జైల్లో వేసేశారు. ప్రశ్నరాగానే సాయిబాబాను జైల్లోనే ఉంచి చంపేశారు. స్టాన్‌ స్వామినీ, గౌరీలంకేశ్‌నీ, కల్బుర్గినీ, పన్సారేని…. ఎంతమందినైనా నోళ్లు మూయిస్తూనే ఉన్నారు. ఇప్పుడు మరి ఓ లేత గొంతుక ప్రశ్నల పల్లవులను విసురుతున్నది. ఆ గొంతుక వేరే అశ్వమిత్‌ గౌతమ్‌.

నిజమైన చదువు ఏం చేస్తుందో నిరూపిస్తున్నాడు ఈ బాలుడు. చదువు జ్ఞానాన్నిస్తుంది. జ్ఞానం, మన చుట్టూ ఉన్న అన్యాయాలను, అజ్ఞానాలను అలుముకొనే చీకట్లను తరిమేసేయటానికి ఉపయోగించాలన్న దానికి రుజువుగా నిలుస్తున్నాడు. అశ్వమిత్‌ గౌతమ్‌ కేవలం పద్నాలుగేండ్ల కుర్రాడు. అదీ ఓ సామాన్య దళిత కుటుంబంలో పుట్టినవాడు. అతని నివాసం ఉత్తరప్రదేశ్‌లోని లక్నో. ఇతనికి పుస్తకాలంటే ప్రాణం. విపరీతంగా పుస్తకాలు చదువుతున్నాడు. తరగతి పుస్తకాలే కాదు, బయటదొరికే పుస్తకాలన్నీ చదివేస్తున్నాడు. చదవడమంటే ఊరికే చదవడంకాదు. లేదా బట్టీ పట్టడం కాదు. చదివి అవగాహన చేసుకుని నేటి పరిస్థితులకు అన్వయిస్తున్నాడు. రాజ్యాంగాన్ని చదివాడు, మనుస్మృతిని చదివాడు, రాజకీయ విషయాలు, అర్థశాస్త్రం, చరిత్ర, సంస్కృతి, పరిపాలన, ప్రజాస్వామ్యం ఇంకా ఎన్నెన్నో చదువుతూనే ఉన్నాడు. వర్తమాన సామాజిక, రాజకీయ విషయాలనూ అధ్యయనం చేశాడు.

చదివి ఊరుకున్నాడా! లేదు. తాను తెలుసుకున్న విషయాల ఆధారంగా అనేక ప్రశ్నలను సంధిస్తూ ఇన్‌స్టాగ్రాం, సోషల్‌ మీడియాలో వీడియోలు చేసి పోస్టు చేస్తున్నాడు. అంబేద్కర్‌ రచనలూ చదివి సమాజంలోని కుల వ్యవస్థపై పోస్టులు పెడుతున్నాడు. ద్రవ్యోల్బణం పెరుగుదల, ధరల పెరుగుదలనూ ప్రశ్నిస్తున్నాడు. రైతుల సమస్యలు, మద్దతు ధర ఇవ్వకపోవడంపై ప్రశ్నిస్తున్నాడు. విద్య అందించడం గురించి, నాణ్యత గురించీ ప్రశ్నిస్తున్నాడు. గాలి, నీరు కాలుష్యాలు, అనారోగ్యాలు, వైద్యసేవల లేమిని గూర్చీ ప్రశ్నలు వేస్తున్నాడు. నిరుద్యోగాన్ని ఎత్తిచూపాడు. అంతేకాదు, సమాజంలోని కుల, మత విభేదాలు, వర్గభేదాలు, అసమానతలపై ప్రశ్నలు వేస్తున్నాడు. ఇంకా.. ఆర్‌ఎస్‌ఎస్‌ చరిత్రను చదివి బీజేపీ సంఘ్ పరివారం సమాజాన్ని విభజించాలని చేస్తున్న ప్రయత్నాలను పొట్టవిప్పి మరీ చూపెడుతున్నాడు. ప్రజాస్వామ్యానికి మోడీ చేస్తున్న చెడుపును ఎత్తిచూపుతున్నాడు. అతనికేమీ మందబలం లేదు, ఆర్థిక బలం లేదు, సౌకర్యాలూ లేవు. అతనికున్న సెల్‌ఫోన్‌తోనే ఇవన్నీ చేస్తున్నాడు. పదిలక్షల మంది ఫాలోయర్స్‌ను కలిగి వున్నాడు.

ఇక ప్రభుత్వం ఊరుకుటుంటుందా! అందులో డబుల్‌ సర్కార్‌ యోగికి చిర్రెత్తకుండా ఉంటుందా! అసలే అబద్దాల మీద బతికే వారికి సూదులు గుచ్చినట్లు అనిపించదూ! లోపల్లోపల భయమూ కలుగుతుంది కదా! ఊరుకోలేదు. ప్రశ్నలేస్తున్న గౌతమ్‌పై పోలీసులు కేసు ఫైల్‌చేశారు. విద్వేషాలను, విభజనలను సృష్టిస్తున్నాడని, అసంబద్ధతలను ప్రచారం చేస్తున్నాడని ఆరోపిస్తూ ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. అతనేమీ యూట్యూబ్‌, ఇన్‌స్టాగ్రామ్‌లలో బూతు మాటలతో రీల్స్‌ చేయలేదు. నచ్చని వాళ్లను అసభ్యంగా దూషించనూలేదు. మూఢ విశ్వాసాల్ని, మత విద్వేషపు మాటల్ని రెచ్చగొట్టలేదు. హింసను ఉసిగొల్పలేదు, వాస్తవ పరిస్థితులపై సాధారణంగా ప్రశ్నించాడు అంతే! అతనిపై కేసు పెట్టారని తెలిసి, ప్రజలు, అనుచరులు తీవ్రంగా వ్యతిరేకించారు. ప్రతిపక్షాలూ గొంతెత్తాయి. గౌతమ్‌ను అరెస్టు చేయటానికి ప్రభుత్వం వెనకడుగువేసింది. మనకిప్పుడు అశ్వమిత్‌ గౌతమ్‌లు కావాలి. ఊరుకొక్కరైనా కావాలిప్పుడు. ప్రశ్నలు తలెత్తాలి. ప్రజలు జాగురూకులవ్వాలి!

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -