Friday, March 6, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంఅభివృద్ధి కావాలి..విధ్వంసం వద్దు

అభివృద్ధి కావాలి..విధ్వంసం వద్దు

- Advertisement -

పేదల ఇండ్లపైకి బుల్డోజర్లు నడిపితే అడ్డుగా నిలబడతాం
హైదరాబాద్‌లో ఒక్క ఇల్లు కట్టినట్టు నిరూపిస్తే నేను రాజకీయాలను వదిలేస్తా
పేదల జోలికొస్తే వారే నీ కుర్చీని మడతపెడతారు
మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌

నవతెలంగాణ-నాగోల్‌
మూసీ అభివృద్ధి పేరుతో పేదల ఇండ్లను కూల్చివేయడం సరికాదని, అభివృద్ధి పేరుతో విధ్వంసం సృష్టించకూడదని మాజీ మంత్రి, ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ అన్నారు. మూసీ అభివృద్ధి విషయంలో ఒక్క ఇల్లు కూడా కూల్చాల్సిన అవసరం లేని విధానం బీఆర్‌ఎస్‌ మోడల్‌ అయితే, లక్షన్నర ఇండ్లను కూల్చే బుల్డోజర్‌ మోడల్‌ను కాంగ్రెస్‌ ప్రభుత్వం అమలు చేయాలని చూస్తోందని ఆరోపించారు. ఎన్నికల ముందు ”ఇందిరమ్మ రాజ్యం” తీసుకువస్తామని చెప్పిన కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇప్పుడు తెలంగాణలో ”బుల్డోజర్‌ రాజ్యం” నడుపుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో నాగోల్‌లో మూసీ అభివృద్ధి జరిగిన ప్రాంతాన్ని, నాగోల్‌ ఎస్టీపీని గురువారం ఆయన పరిశీలించి బాధితులతో మాట్లాడారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. కేవలం వేల కోట్ల రూపాయల అవినీతి కోసం నగరంలో మూసీ ప్రాజెక్టు పేరిట లక్షన్నర మంది పేదల ఇండ్లను కూల్చివేయడానికి కుట్ర జరుగుతోందని ఆరోపించారు. పేదల ఇండ్లను కూల్చడానికి ప్రయత్నిస్తే బీఆర్‌ఎస్‌ చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు. హైదరాబాద్‌లో ప్రభుత్వం ఒక్క ఇల్లు కట్టినట్టు నిరూపిస్తే తాను శాశ్వతంగా రాజకీయాలను వదిలేస్తానని సవాల్‌ విసిరారు. తమ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో నాగోల్‌లో ఐదున్నర కిలోమీటర్ల మేర మూసీ నది తీరాన్ని ఒక్క ఇల్లు కూడా కూల్చకుండా అభివృద్ధి చేశామని కేటీఆర్‌ తెలిపారు.

అప్పట్లో ప్రజలకు ఇబ్బంది కలగకుండా ప్రణాళికాబద్ధంగా పనులు చేపట్టామని అన్నారు. ఇదే విషయాన్ని ప్రభుత్వం గుర్తించాలనే ఉద్ధేశంతోనే ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, పార్టీ నేతలతో కలిసి ఆ ప్రాంతాన్ని పరిశీలించామని చెప్పారు. మూసీ సుందరీకరణకు తమ పార్టీ మద్దతిస్తుంది కానీ.. ఆ పేరుతో పేదల జీవితాలను నాశనం చేయడాన్ని మాత్రం అంగీకరించబోమని కేటీఆర్‌ స్పష్టం చేశారు. లేకపోతే ప్రజల తరపున బీఆర్‌ఎస్‌ ఉద్యమిస్తుందని హెచ్చరించారు. మూసీ పేరిట హైదరాబాద్‌లో సృష్టిస్తున్న విధ్వంసాన్ని రానున్న అసెంబ్లీ సమావేశాల్లో బలంగా లేవనెత్తుతామని తెలిపారు. పేదల జోలికి వస్తే వారే నీ కుర్చీని మడతపెడతారని హెచ్చరించారు.

ఎల్బీనగర్‌ ఎమ్మెల్యే దేవీ రెడ్డి సుధీర్‌ రెడ్డి మాట్లాడుతూ.. తాను మూసీ రివర్‌ డెవలప్మెంట్‌ కార్పొరేషన్‌ చైర్మెన్‌గా ఉన్నప్పుడు కేసీఆర్‌ ఆలోచన విధానంతో పేదలకు నష్టాలు వాటిల్లకుండా తక్కువ వ్యయంతో సుందరీకరణ ప్రణాళికలు తయారుచేసి కార్యక్రమాలు చేపట్టినట్టు తెలిపారు. వాటిలో భాగంగానే 32 ఎస్టీపీలు ఏర్పాటు చేసి 2023 నాటికి 80 శాతం పనులు పూర్తి చేశామని అన్నారు. నాగోల్‌లో ఉన్న ఎస్టీపీ రోజుకు 320 ఎంఎల్‌డీ నీటిని శుద్ధి చేస్తోందని వివరించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, ముఠా గోపాల్‌, లక్ష్మారెడ్డి, కాలేరు వెంకటేష్‌, ఎమ్మెల్సీ వాణీ దేవి, మాజీ ఉపముఖ్యమంత్రి మహమూద్‌ అలీ తదితర ప్రజాప్రతినిధులు, బీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు, మూసి నది పరివాహక ప్రాంత బాధితులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -