బీసీ రిజర్వేషన్లపై ప్రజా ఉద్యమాలతో కేంద్రం మెడలు వంచాలి : హిస్సా ఇజ్జత్ హుకుమాత్ పుస్తకావిష్కరణలో రిటైర్డ్ ఐఏఎస్ చిరంజీవులు
నవతెలంగాణ- మహబూబ్‌నగర్ ప్రాంతీయ ప్రతినిధి
‘రాయితీలు మాకొద్దు… రాజ్యాధికారం కావాలి. అందుకోసం రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్ల కోసం తెలంగాణ ఉద్యమాన్ని తలపించేలా ఆందోళనలు చేపట్టాలి. ప్రజా ఉద్యమాలను నిర్మించడం ద్వారా కేంద్ర ప్రభుత్వం మెడలు వంచాలి. పోరాటాల ద్వారానే బీసీలకు 42శాతం రిజర్వేషన్లు వస్తాయి’ అని హిస్సా ఇజ్జత్ హుకుమాత్ పుస్తక రచయిత రిటైర్డ్ ఐఏఎస్ చిరంజీవివులు అన్నారు. ఆదివారం మహబూబ్‌నగర్‌లో జరిగిన కార్యక్రమంలో బీసీలకు హక్కులు రాజ్యాధికారం కోసం రచించిన పుస్తకాన్ని చిరంజీవులు ఆవిష్కరణ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కలెక్టర్‌గా పదవీ విరమణ పొందిన తర్వాత బీసీ ప్రజల కడుపు మంట చూసి ఉద్యమాలలోకి వచ్చానని ఆయన అన్నారు.
బీసీ రిజర్వేషన్ల పోరాటం అంతం కాదని ఇది ఆరంభం మాత్రమేనని అన్నారు. అధికారం యాచనతో రాదు ఉద్యమాలు చేసి గుంజుకోవాలని అన్నారు. స్వాతంత్రం వచ్చి 78ఏండ్లు పూర్తి అయిన తర్వాత కూడా నేటికీ బీసీలు యాచనస్థితిలో ఉన్నారని ఇక్కడి పెత్తందారులు నిజాం నవాబు కంటే క్రూరమైన వారని అన్నారు. కేరళ, తమిళనాడు, కర్నాటక రాష్ట్రాలలో బీసీ సీఎంలు ఉన్నారని, తెలంగాణలో బీసీలు ఆ స్థాయికి ఎందుకు ఎదగడం లేదని ప్రశ్నించారు. 32 లక్షల కోట్లలో బీసీలకు ఇచ్చేదెంతా అని ప్రశ్నించారు. అంబానీకి 47 వేల కోట్లలో 470 కోట్లు చెల్లిస్తే మిగతావన్నీ మాఫీ చేశారని ఆయన అన్నారు. భారత కష్టజీవుల డబ్బులు ధనవంతులకు రుణమాఫీగా మారుతున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
బీసీలకు 42శాతం రిజర్వేషన్ ఇవ్వాలని కోరుతూ చేపట్టిన బంద్ సంపూర్ణమైందని ప్రధానమైన మీడియాలో బంద్ విజయోత్సవాలపై కథనాలు రాకపోవడం విచారకరమన్నారు. కాంగ్రెస్ మోసం చేస్తే బీజేపీ కుట్ర చేస్తుందని, బీఆర్‌ఎస్ మాత్రం గోడమీద పిల్లిలా ఊగిసలాట ధోరణి ప్రదర్శిస్తున్నదని ఆయన మండిపడ్డారు. ఇప్పటికైనా కాంగ్రెస్ అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లి కేంద్రం మెడలు వంచేలా చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. పేదలు బడుగు బలహీన వర్గాల వారికి కార్పొరేట్ పాఠశాలలో 25శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని కోరుతుంటే ఎందుకు అమలు చేయడం లేదన్నారు. కార్యక్రమంలో సింగిశెట్టి శ్రీనివాసులు, ఉపాధ్యాయుల గుడిపల్లి నిరంజన్, సుబ్బయ్య, నిరంజన్, పెబ్బేటి మల్లికార్జున్, చిన్న రాములు, దిలీప్, ఆచారి తదితరులు పాల్గొన్నారు.
రాయితీలు కాదు.. రాజ్యాధికారం కావాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES