Thursday, October 9, 2025
E-PAPER
Homeప్రధాన వార్తలుపోరాటాలకు సన్నద్ధం కావాలి

పోరాటాలకు సన్నద్ధం కావాలి

- Advertisement -

భవన నిర్మాణరంగ కార్మికుల వెల్ఫేర్‌ బోర్డు నిధులు దుర్వినియోగం
కార్మికుల సొమ్ము ఇన్సూరెన్స్‌ కంపెనీలకు కట్టబెట్టడమేంటి?
దీన్ని కార్మికులందరూ ప్రశ్నించాలి
డబులింజన్‌ సర్కారులో అభివృద్ధి అన్నరు కదా.. వలసలేంటి? : సీడబ్ల్యూఎఫ్‌ఐ జాతీయ ఉపాధ్యక్షులు ఎం.సాయిబాబు
తెలంగాణ భవన, ఇతర నిర్మాణ రంగ కార్మికుల ఫెడరేషన్‌ రాష్ట్ర నాలుగో మహాసభలు ప్రారంభం
జెండా ఆవిష్కరించిన రాష్ట్ర అధ్యక్షులు ఎస్‌.రామ్మోహన్‌

నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
భవన, ఇతర నిర్మాణ కార్మికులందరూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై పోరాటాలకు సన్నద్ధం కావాలని కన్‌స్ట్రక్షన్‌ వర్కర్స్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా జాతీయ ఉపాధ్యక్షులు ఎం.సాయిబాబు పిలుపునిచ్చారు. బుధవారం హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రం(కూకట్ల శంకర్‌ నగర్‌)లోని జి.టి.గోపాల్‌రావు ప్రాంగణంలో తెలంగాణ బిల్డింగ్‌, అదర్‌ కన్‌స్ట్రక్షన్‌ వర్కర్స్‌ ఫెడరేషన్‌(బీసీడబ్ల్యూఎఫ్‌-సీఐటీయూ అనుబంధం) రాష్ట్ర నాలుగో మహాసభలు ప్రారంభమయ్యాయి. ప్రారంభ సూచకంగా ఆ ఫెడరేషన్‌ రాష్ట్ర అధ్యక్షులు రామ్మోహన్‌రావు అరుణపతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం జరిగిన ప్రారంభ సభలో సాయిబాబు మాట్లాడుతూ.. తెలంగాణలో భవన, ఇతర నిర్మాణ రంగ కార్మికుల వెల్ఫేర్‌ బోర్డు నిధులు దుర్వినియోగం అవుతున్నాయన్నారు. రూ.346 కోట్ల రూపాయలను బోర్డు నుంచి ఇన్సూరెన్స్‌ కంపెనీలకు ఎలా బదిలీ చేస్తారు? ఇన్సూరెన్స్‌ కంపెనీలను బతికించేందుకు కార్మికులకు అన్యాయం చేస్తారా? దీనిపై కార్మిక శాఖ అధికారులను కార్మికులందరూ నిలదీయాలని పిలుపునిచ్చారు.

కేంద్రంలో, రాష్ట్రంలో తమ డబుల్‌ ఇంజిన్‌ సర్కారు ఉంటే అభివృద్ధి పరుగులు పెడుతుందని ప్రధాని మోడీ, బీజేపీ నేతలు ప్రజల్ని మోసం చేస్తున్నారని విమర్శించారు. బీహార్‌, ఉత్తరప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌, రాజస్థాన్‌, ఒడిశా, మహారాష్ట్ర, తదితర రాష్ట్రాల్లో డబుల్‌ ఇంజిన్‌ సర్కార్లు ఉన్నా అభివృద్ధి ఎందుకు జరగడం లేదు? ఆ రాష్ట్రాల నుంచి కార్మికులు ఇక్కడకు వలసెందుకు వస్తున్నారు? జీతాలు తగ్గించుకుని పనిచేయాల్సిన పరిస్థితి ఎందుకొచ్చింది? అని ప్రశ్నల వర్షం కురిపించారు. వలస కార్మికుల హక్కుల కోసం కూడా తమ ఫెడరేషన కొట్లాడుతుందని తెలిపారు. దేశంలోని పది శాతం మంది కార్పొరేట్ల వద్ద 80 శాతం సంపద పోగుకావడం, మరోవైపు పేదల కొనుగోలు శక్తి రోజురోజుకీ పడిపోతుండటం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. సిగాచీ పరిశ్రమలో 54 మంది కార్మికులు చనిపోతే నేటికీ న్యాయబద్ధంగా దక్కాల్సిన పరిహారం రాకపోవడమేంటి? పరిహారం కోసం కార్మిక శాఖ వద్ద ధర్నాలు చేయాల్సి రావడమేంటి? అని వాపోయారు. కార్మికులు తమ హక్కుల కోసం అడుగడుగునా ప్రశ్నిస్తేనే న్యాయం జరుగుతుందని స్పష్టం చేశారు. ప్రపంచ దేశాల్లో కార్మికవర్గ పోరాటాలు వేగంగా విస్తరిస్తున్న తీరును ఆయా దేశాల వారీగా వివరించారు. చైనా, భారత్‌లపై ఆమెరికా ఆంక్షలు, రష్యా-చైనా-ఇండియా స్నేహ బంధం బలపడడం వంటి పరిణామాలు ప్రపంచ రాజకీయ సమీకరణాలను మార్చుతున్నాయన్నారు.

భారత ప్రభుత్వం అమెరికా ఒత్తిళ్లకు తలొగ్గుతూ పాలస్తీనా విషయంలో మానవత్వాన్ని ప్రదర్శించలేదని విమర్శించారు. పెట్టుబడిదారీ వ్యవస్థకు అమెరికా పెద్దన్న పాత్ర పోషిస్తున్నదనీ, ఆ వ్యవస్థనే ప్రపంచంలో ఎక్కడైనా ఉత్పత్తులు అమ్ముకోవచ్చునని చెప్పి ఇప్పుడేమో అమెరికా దిగుమతి చేసుకునే వస్తువులపై విపరీతమైన సుంకాలు వేస్తున్నదని విమర్శించారు. దీనిని బట్టే పెట్టుబడి దారీ వ్యవస్థ సరిగాదనే విషయం అర్థమవుతున్నదని చెప్పారు. మోడీ ప్రభుత్వం కార్పొరేట్‌ మిత్రుల ప్రయోజనాల కోసం లేబర్‌ కోడ్‌లను అమలు చేయడానికి సిద్ధమవుతోందని విమర్శించారు. ఆ కోడ్‌లు కార్మికులకు ఉరితాళ్లలాంటివన్నారు. వాటిని తిప్పికొట్టేందుకు కార్మికులు ఐక్యపోరాటాలు చేయాలన్నారు. కార్యక్రమంలో సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్‌, ఫెడరేషన్‌ గౌరవాధ్యక్షులు వంగూరు రాములు, ప్రధాన కార్యదర్శి ఆర్‌.కోటంరాజు, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ ముదాం శ్రీనివాస్‌, కోశాధికారి యల్క సోమయ్య గౌడ్‌, లక్ష్మీనారాయణ, ఉప్పలయ్య, రవి, శ్రీనివాసులు, వెంకన్న, రాజు, కె. జంగయ్య, సోములు తదితర నాయకులు పాల్గొన్నారు.

వెల్ఫేర్‌ బోర్డు స్కీమ్‌లను ఇన్సూరెన్స్‌ కంపెనీలకు అప్పగించొద్దు : మహాసభలో ఏకగ్రీవ తీర్మానం
వెల్ఫేర్‌ బోర్డు స్కీమ్‌లను ఇన్సూరెన్స్‌ కంపెనీలకు అప్పగిస్తూ ఇచ్చిన జీవో 12ను సవరించాలనే తీర్మానాన్ని ఫెడరేషన్‌ గౌరవాధ్యక్షులు వంగూరు రాములు ప్రవేశపెట్టారు. దాన్ని రాష్ట్ర కార్యదర్శి కె.జంగయ్య బలపర్చారు. ‘ప్రయివేటు బీమా కంపెనీలకు కట్టబెట్టిన రూ.346 కోట్లను తిరిగి బోర్డులో జమ చేయాలి. వెల్ఫేర్‌ బోర్డు నిధుల దుర్వినియోగంపై సమగ్ర విచారణ జరిపించాలి. ప్రభుత్వమే సంక్షేమ పథకాలను అమలు చేయాలి. 1996 భవన నిర్మాణ కార్మిక కేంద్ర చట్టం నిబంధనల ప్రకారం రాష్ట్ర వెల్ఫేర్‌ బోర్డు అడ్వజరీ కమిటీని నియమించాలి. ఆ కమిటీ నిర్ణయం ప్రకారమే బోర్డు నిధులు ఖర్చు చేయాలి. వెల్ఫేర్‌ బోర్డు సలహా మండలిని తెలంగాణ ఏర్పడినప్పటి నుండి బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ ప్రభుత్వాలు తమకు ఇష్టమొచ్చినట్టుగా నిధులను ఇతర శాఖలకు దారి మళ్ళిస్తున్నాయి. అలా చేయకూడదు. 2009 నుండి 2025 సెప్టెంబర్‌ వరకు వెల్ఫేర్‌ బోర్డులో పేరు నమోదు చేసుకున్న కార్మికుల సంఖ్య 27,35,693 కాగా ప్రస్తుతం బోర్డులో కార్డులు రెన్యూవల్‌ చేసుకొని అర్హత ఉన్న కార్మికుల సంఖ్య 15,14,606. ఇంకా 12,20,119 మంది కార్డులు రెన్యూవల్‌ కాలేదు. వాటిని రెన్యూవల్‌ చేయాలి’ అని మహాసభ తీర్మానించింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -