డ్రగ్స్ వినియోగం మీద ఉక్కుపాదం
మైనర్లకు మద్యం అమ్మితే కఠిన చర్యలు
వేడుకల్లో ఔట్ డోర్ ఈవెంట్లలో డీజేలకు అనుమతి లేదు : రాచకొండ సీపీ సుధీర్ బాబు
నవతెలంగాణ-సిటీబ్యూరో
ప్రశాంత వాతారణంలో ఇన్సిడెంట్ ఫ్రీ న్యూ ఇయర్‌గా వేడుకలను చేసుకోవాలని రాచకొండ సీపీ సుధీర్‌బాబు తెలిపారు. నూతన సంవత్సర వేడుకల సందర్భంగా రాచకొండ పరిధిలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు. రాచకొండ పరిధిలోని పబ్‌లు, బార్లు, రెస్టారెంట్స్, ఫామ్ హౌస్‌లు, వైన్ షాపులు, ఈవెంట్ ఆర్గనైజేషన్ నిర్వాహకులతో హైదరాబాద్ వనస్థలిపురంలో బుధవారం సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులకు సీపీ దిశానిర్ధేశంతోపాటు పలు సూచనలు చేశారు. ఇన్సిడెంట్ ఫ్రీ న్యూ ఇయర్‌గా జరుపుకోవాలన్నారు. ఆరోజు ఒక్క యాక్సివెంట్ కూడా జరగకూడదని, ఏ ప్రాణం పోవద్దని, రక్తం చిందకూడదని కోరుకుంటున్నామని అన్నారు. ప్రజలందరూ బాధ్యతాయుతంగా సహకరించాలని కోరారు. సివిల్, ట్రాఫిక్, ఎస్‌ఓటి, షి టీమ్స్, పెట్రోలింగ్ సిబ్బందితోపాటు ప్రత్యేక పోలీస్ బృందాలు విధుల్లో ఉంటాయన్నారు.
ఔట్ డోర్ కార్యక్రమాల్లో డీజే బాక్సులకు అనుమతి లేదని, బాణసంచా కాల్చడానికి వీల్లేదని అన్నారు. పరిమితికి మించి ఈవెంట్‌లోకి ప్రేక్షకులను అనుమతించకూడదన్నారు. మహిళల భద్రతపై ప్రత్యేక దృష్టి సారించామని, తమ షి టీమ్ బృందాలు నిఘా వేస్తాయని చెప్పారు. న్యూ ఇయర్ వేడుకల్లో డ్రగ్స్ వినియోగాన్ని అరికట్టడానికి ప్రత్యేక పోలీసులు తనిఖీలు చేస్తారని, నిషేధిత డ్రగ్స్ సరఫరా చేసే ముఠాల మీద ఉక్కుపాదం మోపుతామని అన్నారు. పబ్‌లు, బార్లు, వైన్ షాపులు నిర్దేశిత సమయంలోపు మూసేయాలని, మైనర్‌లకు మద్యం విక్రయించే దుకాణాలపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. వాహనాల పార్కింగ్‌కు సరైన ఏర్పాట్లు చేయాలని, షాపులు, పబ్‌లు, రెస్టారెంట్‌ల పరిసరాల్లో సీసీ టీవీలు ఖచ్చితంగా ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. నగర శివార్లలో ఉండే ఫామ్‌హౌస్‌లలో కార్యక్రమాలు కూడా నిబంధనలకు లోబడి ఉండాలన్నారు.
రోడ్ల మీద ట్రాఫిక్ ఇబ్బందులు రాకుండా ట్రాఫిక్ సిబ్బంది జాగ్రత్తలు తీసుకోవాలని, డ్రంకెన్ డ్రైవింగ్ తనిఖీలను కట్టుదిట్టంగా అమలు చేయాలని తెలిపారు. మైనర్లకు వాహనాలు ఇచ్చే యజమానుల మీద కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అర్ధరాత్రి యువకులు నిర్లక్ష్యంగా అధిక వేగంతో వాహనాలు నడపకుండా, బైక్ రేసులు చేయకుండా ఉండేందుకు ప్రత్యేక నిఘా వేశామన్నారు. ఫ్లై ఓవర్‌లను మూసేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో మహేశ్వరం డీసీపీ నారాయణరెడ్డి, ఎల్బీనగర్ డీసీపీ అనురాధ, మల్కాజిగిరి డీసీపీ సీహెచ్ శ్రీధర్, యాదాద్రి డీసీపీ ఆకాంక్ష్ యాదవ్, ఎస్‌ఓటి డీసీపీ రమణ రెడ్డి, డీసీపీ అడ్మిన్ ఇందిర, ఎస్బీ డీసీపీ జి.నరసింహారెడ్డి, విమెన్ సేఫ్టీ డీసీపీ ఉషా రాణి, ట్రాఫిక్ డీసీపీ శ్రీనివాస్, రోడ్ సేఫ్టీ డీసీపీ మనోహర్, డీసీపీ హెడ్ క్వార్టర్ శ్యామ్ సుందర్, రాచకొండ పరిధిలోని డీసీపీలు, అడిషనల్ డీసీపీలు, అన్ని పోలీస్ స్టేషన్ల ఇన్‌స్పెక్టర్లు, ఇతర అధికారులు పాల్గొన్నారు.



