Sunday, November 23, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంతాటి, ఈత మొక్కల పెంపకానికి ముందుకు రావాలి

తాటి, ఈత మొక్కల పెంపకానికి ముందుకు రావాలి

- Advertisement -

రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌
తెలంగాణ గీత పనివారల సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర సదస్సు

నవతెలంగాణ-హిమాయత్‌ నగర్‌
రాష్ట్ర ప్రభుత్వం 45 లక్షల తాటి, ఈత మొక్కలు ఇచ్చేందుకు సిద్ధంగా ఉందని, వాటి పెంపకానికి కల్లుగీత సంఘాలు ముందుకు రావాలని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ తెలిపారు. శనివారం హైదరాబాద్‌ బషీర్‌బాగ్‌ ప్రెస్‌ క్లబ్‌లో తెలంగాణ గీత పనివారల సంఘం రాష్ట్ర అధ్యక్షులు బొమ్మగాని ప్రభాకర్‌ అధ్యక్షతన నిర్వహించిన రాష్ట్ర సదస్సులో మంత్రి మాట్లాడారు. మొక్కలు నాటేందుకు, వాటిని పెంచేందుకు ప్రభుత్వం అన్ని విధాలుగా ఆర్థిక సాయం చేస్తుందని తెలిపారు. గీత పనివారల సంఘం వ్యవస్థాపకులు, మాజీ ఎంపీ బొమ్మగాని ధర్మభిక్షం అంటే తనకెంతో గౌరవమని, ప్రభుత్వంతో చర్చించి మర్రిగూడ మండలం చర్లగూడెం రిజర్వాయర్‌కు ధర్మభిక్షం పేరు పెట్టే విధంగా కృషి చేస్తానన్నారు.

గీత కార్మికులు కులవృత్తి రక్షణతోపాటు వారి పిల్లల విద్యాభ్యాసానికి ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. ప్రస్తుత పోటీ ప్రపంచంలో పిల్లలు నెగ్గేందుకు విద్య చాలా అవసరమని, వారిని చదివించాలన్నారు. రాష్ట్ర మంత్రిగా తనవంతు బాధ్యతగా గీత కార్మికులకు ఎక్స్‌గ్రేషియా, కాటమయ్య రక్ష, సంఘపరమైన భవనాలకు సంబంధించి అన్ని గౌడ కుల పెద్దలతో కలిసి అమలయ్యే విధంగా చేద్దామన్నారు. టీపీసీసీ అధ్యక్షులు మహేశ్‌ కుమార్‌ గౌడ్‌, తాను కలిసి సీఎంతో మాట్లాడి ట్యాంక్‌బండ్‌ వద్ద సర్వాయి పాపన్న గౌడ్‌ విగ్రహ ఏర్పాటును త్వరలో చేపట్టనున్నట్టు చెప్పారు. ఏ విషయంలోనూ నిరాశ చెందొద్దని, ఐక్యంగా ఉండి సమస్యలను పరిష్కరించుకోవచ్చన్నారు.

సీపీఐ జాతీయ కార్యదర్శి పల్లా వెంకటరెడ్డి మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల్లో కల్లు గీత వృత్తి ప్రధానమైందని, కొన్ని ప్రాంతాల్లో గౌడ కులస్థులే కాకుండా ఇతర కులాల వారూ కల్లు గీత వృత్తి చేస్తుండేవారన్నారు. బొమ్మగాని ధర్మభిక్షం పార్టీలు, కులాలకు అతీతంగా గీత పనివారల సంఘం స్థాపించి, గీత వృత్తి రక్షణకు పాటుపడ్డారని కొనియాడారు. గీత వృత్తి గ్రామీణ పరిశ్రమగా అభివృద్ధి చెందాలని సంఘం అనేక మార్గాలను ప్రభుత్వాలకు సూచించిందన్నారు. సూర్యాపేట జిల్లాకు ధర్మభిక్షం పేరును పెట్టాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ప్రజల ఆలోచనలో మార్పు వచ్చిందని, కాలం మారిందని, కమ్యూనిస్టులు మరింత బలోపేతం కావాలంటే మరింత ఐక్యత అవసరమన్నారు. ఈ సమావేశంలో సంఘం ప్రధాన కార్యదర్శి డీజీ సాయిలు గౌడ్‌, సమన్వయ కార్యదర్శి బొమ్మగాని నాగభూషణం, ఉపాధ్యక్షులు కేవీఎల్‌, దూసరి శ్రీరాములు, పండ్ల రాములు, కార్యదర్శులు పబ్బూరి దేవేందర్‌ గౌడ్‌, బొమ్మగాని శ్రీనివాస్‌, గౌడ్‌ సంఘం నేతలు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -