అదనపు కలెక్టర్ లోకల్ బాడీస్ యాదయ్య
నవతెలంగాణ – వనపర్తి
త్వరలో జరుగబోయే ఎంపీటీసీ/జడ్పీటీసీ సాధారణ ఎన్నికల నిర్వహణకు తప్పులు లేని ఎలెక్టోరల్ జాబితా రూపొందించేందుకు సహకరించాలని అదనపు కలెక్టర్ లోకల్ బాడీస్ యాదయ్య రాజకీయ పార్టీల ప్రతినిధులను సూచించారు. సోమవారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో రాజకీయ పార్టీల ప్రతినిధులతో జిల్లా స్థాయినావేశం నిర్వహించారు. త్వరలో జరుగబోయే ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికల నిర్వహణకు సెప్టెంబర్ 6న ముసాయిదా ఎలెక్టోరల్ రోల్ ప్రకటించడం జరిగిందని, ఓటరు జాబితాను అని గ్రామ పంచాయతీల్లో అందుబాటులో ఉంచడం జరిగింది. సెప్టెంబర్ 6 నుండి 8వ తేదీ వరకు ప్రకటించిన ఎలెక్టోరల్ రోల్ పై అభ్యంతరాలు, సూచనలు ఇవ్వడానికి అవకాశం కల్పించడం జరిగింది. రాజకీయ పార్టీలు తాము పరిశీలించిన ఓటరు జాబితాలో కానీ, నిర్దేశించిన పోలింగ్ కేంద్రాలు, లొకేషన్లలో అభ్యంతరాలు ఉంటే తెలుపాలని సూచించారు. సెప్టెంబర్ 9న ఫిర్యాదులు పరిష్కరించి సెప్టెంబర్ 10న తుది ఓటరు జాబితా ప్రకటించడం జరుగుతుందన్నారు.
వనపర్తి జిల్లా లో ఎంపీటీసీ, జడ్పీటిసి ఎన్నికల నిర్వహణకు ముసాయిదా ఓటరు జాబితా ప్రకారం 382295 మంది ఓటర్లు ఉన్నారని, అందులో పురుషులు 190068 ఓటర్లు కాగా మహిళలు 192223 ఇతరులు 4 మంది ఉన్నారు. జిల్లాలో 133 మంది ఎంపీటీసీలు, 15మంది జడ్పీటీసీల ను ఎన్నుకోవడం జరుగుతుందని ఇందుకోసం 268 గ్రామ పంచాయతీలు, 2436 వార్డులు, 283 లొకేషన్లలో 657 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు తెలియజేశారు. ఏపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు జిల్లాలో రెండు విడతలుగా ఎన్నికలు నిర్వహించేందుకు ప్రతిపాదనలు పంపించడం జరిగిందన్నారు. మొదటి విడతలో వనపర్తి నియోజకవర్గంలోని 8 మండలాలు, రెండవ విడతలో జిల్లాలోని మిగిలిన 7 మండలాల్లో ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధమవుతున్నట్టు తెలిపారు.
సమావేశంలో పాల్గొన్న ఆర్డీఓ సుబ్రమణ్యం మాట్లాడుతూ ముసాయిదా ఓటరు జాబితాలో 1370 మంది రెండు చోట్ల ఓట్లు ఉన్నవిగా గుర్తించడం జరిగిందని, అదేవిధంగా ఇప్పటివరకు 800 వరకు చనిపోయిన వారి పేర్లు గుర్తించడం జరిగిందన్నారు. ఎన్నికల నిర్వహణ లోపు డబుల్ ఓటర్లు, చనిపోయిన వారి పేర్లు తొలగించి శుద్ధమైన ఎలెక్టోరల్ రోల్ ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు తెలియజేశారు.
సమావేశంలో పాల్గొన్న రాజకీయ పార్టీల ప్రతినిధులు మాట్లాడుతూ తమకు ముందుగానే ఓటరు జాబితా ఇవ్వాలని, అదేవిధంగా సమావేశం మినిట్స్ కాపీని అందజేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జడ్పీ సూపరింటెండెంట్ నాగేశ్వర్ రెడ్డి, జడ్పీ డిప్యూటీ సి.ఈ.ఓ రామ మహేశ్వర్ రెడ్డి, రాజకీయ పార్టీల నుండి బిఆర్ఎస్ నుండి గట్టు యాదవ్, బిజెపి నుండి డి నారాయణ, సిపిఐ ఎం నుండి ఎండి జబ్బార్, ఎంఐఎం నుండి ఎండి రహీం తదితరులు పాల్గొన్నారు.