Sunday, February 15, 2026
E-PAPER
Homeమానవిలౌక్యంతో నెట్టుకురావాలి

లౌక్యంతో నెట్టుకురావాలి

- Advertisement -

పియ్రమైన వేణు గీతికకు
నాన్న ఎలా ఉన్నావు, ఆఫీస్‌ ఆడిట్‌తో అసలు సెలవులే లేవన్నావు. తప్పదుకదా నాన్న. వచ్చేనెలతో ఆర్ధిక సంవత్సరం ముగుస్తుంది కదా. ఇప్పటి నుండే పెద్ద పెద్ద సంస్థల్లో ఆడిట్‌ జరుగుతూ ఉంటుంది. మీ కొలీగ్‌ పెళ్లి అన్నావు. వెళ్తున్నాను అని చెప్పావు. చక్కగా అందరూ కలిసి వెళ్ళండి. అక్కడ పెళ్ళి సంప్ర దాయం ఎలా ఉందో చూడు. సరదాగా గడిపి రండి.
నాన్న కిందటి ఉత్తరంలో పెళ్లి ఎంత ముఖ్యమో చెప్పాను. పెళ్ళి అయిన కొత్తల్లో ఎలా గడపాలో, ఒకరికొకరు తమకోసం సమయాన్ని ఎలా కేటాయిం చుకోవాలో చెప్తాను. నాన్న, పెద్దలు కుదిర్చిన పెళ్లి అయితే కనుక పెళ్లి అయ్యి అత్తగారింటికి వెళ్ళినప్పుడు అంతా కొత్త వాళ్ళు, కొత్త వాతావరణం, పద్ధతులు, అలవాట్లు. నీ పుట్టింట్లో ఉన్నట్లు ఉండకపోవచ్చు. కాబట్టి నెమ్మదిగా తెలియనవి తెలుసుకుంటూ, వాళ్ళల్లో కలిసిపోయి ఉండాలి.
ఉద్యోగరీత్యా వేరే ఊర్లో ఉన్నట్టు అయితే పొద్దున పూట ఆఫీస్‌ హడావిడి ఉంటుంది కాబట్టి, సాయంత్రం సమయంలో, లేదా వారంతాల్లో ,బైటకి కలసి వెళ్లడం, ఇష్టమైన ప్రాంతాలకు వెళ్లడం, షాపింగ్‌ చేయడం, ఇంట్లోకి కావలసిన సామాగ్రిని కలిసి ఎంచుకోవడం ఇలాంటివి చేయాలి.
సమయం దొరికినప్పుడల్లా సాధ్యమైనంత వరకు సరదాగా కబుర్లు చెప్పుకోవడం, ఒకరిపై ఒకరు జోక్స్‌ వేసుకోవడం, ఆట పట్టించుకోవడం చేస్తుండాలి. దీనివలన మనసుకు బాగా దగ్గర అవుతారు. మీ ఏకాంత సమయంలో ఎప్పుడూ ఇతరుల ప్రస్తావన తేకుండా ఉండాలి. కలిసి పనులు చేసుకోవడం, కలిసి భోజనం చేయడం, ఒకరికొకరు కొసరి కొసరి వడ్డించుకోవడం ఇవన్నీ కూడా ఒకరిపై ఒకరికి ప్రేమను పెంచుతాయి. పెళ్ళైన కొత్తలో చిన్న చిన్న సమస్యలు వస్తాయి. వాటిని ఇంకోవ్యక్తి వరకు తీసుకెళ్లకూడదు.
సంసార జీవితాన్ని సంతోషంగా గడపాలంటే ఎప్పుడూ మూడవ వ్యక్తిని తలదూర్చనివ్వవద్దు. మూడవ వ్యక్తి ప్రమేయం వలన సమస్యలు వస్తాయి. కొన్ని పరిస్థితులను బట్టి సర్దుకుపోవాలి. నీ వైవాహిక జీవితం, కుటుంబం మొదలైనవి సజావుగా సాగాలంటే లౌక్యంతో నెట్టుకురావాలి. నీకు ఆ నేర్పు, ఓర్పు ఉన్నాయని నాకు తెలుసు. అయినా అమ్మగా చెప్పడం నా బాధ్యత. ఉంటాను చిట్టితల్లి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -