– మండల వ్యవసాయ అధికారి శ్రీనివాస్
నవతెలంగాణ – ఆలేరు రూరల్
రైతు భరోసా పథకాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని మండల వ్యవసాయ అధికారి శ్రీనివాస్ అన్నారు. మంగళవారం ఆయన నవతెలంగాణతో మాట్లాడుతూ ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు భరోసా పథకానికి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు తెలిపారు. అర్హులైన రైతులు ఆలస్యం చేయకుండా వెంటనే దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
రైతు భరోసా పథకానికి దరఖాస్తు చేసుకునే రైతులు కొన్ని ముఖ్యమైన పత్రాలను సమర్పించాల్సి ఉంటుందని తెలిపారు. రైతు భరోసా దరఖాస్తు ఫారం, భూమి పాస్‌బుక్ జిరాక్స్ లేదా తహసీల్దార్ డిజిటల్ సంతకం చేసిన పత్రం, ఆధార్ కార్డు, బ్యాంక్ పాస్‌బుక్ జిరాక్స్ తప్పనిసరిగా జతచేయాలని చెప్పారు. ఈ పత్రాలను కొలనుపాక రైతు వేదికలో సమర్పించవచ్చని పేర్కొన్నారు. 2026 ఫిబ్రవరి 28 వరకు కొత్తగా భూమి రిజిస్ట్రేషన్ చేసుకున్న రైతులు, అలాగే ఇప్పటివరకు పట్టాదారు పాసుపుస్తకాలు పొందినా రైతు భరోసాకు దరఖాస్తు చేయని వారు ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చని తెలిపారు.
అయితే.. గతంలో రైతుబంధు పథకానికి దరఖాస్తు చేసిన రైతులు మళ్లీ దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. ఇప్పటికే రైతుబంధు పొందుతున్న రైతులు తమ బ్యాంకు ఖాతాను మార్చుకోవాలనుకుంటే రైతు భరోసా దరఖాస్తు ఫారం నింపి సమర్పించవచ్చని వివరించారు. దరఖాస్తుల సమర్పణకు చివరి తేదీగా 25 మార్చి 2026ను నిర్ణయించినట్లు తెలిపారు. అందువల్ల అర్హులైన రైతులు చివరి తేదీకి ముందే తమ దరఖాస్తులను సమర్పించాలని అధికారులు కోరుతున్నారు.



