Friday, January 23, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంవెనిజులాపై సోనిక్‌ ఆయుధం ప్రయోగించాం

వెనిజులాపై సోనిక్‌ ఆయుధం ప్రయోగించాం

- Advertisement -

అది వేరెవ్వరి వద్ద లేదు : అంగీకరించిన ట్రంప్‌

వాషింగ్టన్‌ : వెనిజులాపై దాడి చేసి దాని అధ్యక్షుడు నికొలస్‌ మదురోను అపహరించే సమయంలో రహస్య ‘సోనిక్‌ ఆయుధా’న్ని ఉపయోగించామని, అది వేరెవ్వరి వద్ద లేదని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ చెప్పారు. సోనిక్‌ ఆయుధం అంటే ధ్వని తరంగాలు లేదా అత్యంత తీవ్రమైన శబ్దాలను ఆయుధంగా ఉపయోగించి ప్రత్యర్థులను నిలువరించేందుకు వాడే పరికరం. ఇది శారీరక నష్టాన్ని కలిగించే ఆయుధాలకు భిన్నంగా చెవులు చిల్లులు పడే భీకర శబ్దాన్ని వెలువరిస్తుంది. దీంతో శత్రువులు అచేతనులవుతారు. ఈ ఆయుధం అమెరికా సైనిక శక్తిని చాటి చెప్పిందని ట్రంప్‌ తెలిపారు.

దాడి సమయంలో తాము ప్రయోగించిన ఓ పరికరం కారణంగా వెనిజులా సైనికుల ముక్కు నుంచి రక్తం కారిందని, వారు రక్తంతో వాంతులు చేసుకున్నారని అధ్యక్ష భవనం పత్రికా కార్యదర్శి కరోలిన్‌ లీవిట్‌ గతంలోనే చెప్పారు. అప్పటి నుంచి ఈ సోనిక్‌ ఆయుధంపై వదంతులు వ్యాపించాయి. న్యూస్‌ నేషన్‌ కార్యక్రమం ‘కతే పౌలిచ్‌ టునైట్‌’ తాజా ఎపిసోడ్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూ సందర్భంగా…వెనిజులాపై దాడి సమయంలో సోనిక్‌ ఆయుధాన్ని ప్రయోగించినట్టు ట్రంప్‌ అంగీకరించారు. ఆయుధ శక్తి గురించి అమెరికా సైనికులకు తెలుసా అని పౌలిచ్‌ ప్రశ్నించగా తెలుసని ట్రంప్‌ బదులిచ్చారు. ఇలాంటి ఆయుధం ఎవరి వద్ద లేదని చెప్పారు. ఎవరికీ తెలియని ఆయుధాలు తమ వద్ద ఉన్నాయని అన్నారు. ‘ఇది ఒక అద్భుతమైన దాడి’ అని చెప్పుకున్నారు. కాగా ఈ ఆయుధంపై మరిన్ని వివరాలు బయటపెట్టాలని రష్యా డిమాండ్‌ చేసింది.

సోనిక్‌ వెపన్‌ ఏం చేస్తుంది?
ప్రత్యర్థులను బలహీన పరచడా నికి సోనిక్‌ వెపన్‌ను ప్రయోగిస్తారు. ఈ ఆయుధాలు చాలా బాధాకరమైన ధ్వనులను విడుదల చేస్తాయి. భరించరాని తలనొప్పి వస్తుంది. ప్రజలు గందరగోళంలో పడతారు. వీటి శబ్దానికి వినికిడి శక్తిని పూర్తిగా కోల్పోయే ప్రమాదం ఉంది. దీని ధాటికి కనీసం నిలబడలేనంత అశక్తత కలుగుతుంది. దీని సామర్ధ్యాన్ని గురించి ఏం చెప్పాలో తెలీడం లేదని ప్రత్యక్ష సాక్షి ఒకరు తెలిపారు. ‘చాలా తీవ్రమైన శబ్దం వచ్చింది. హఠాత్తుగా నా తల పగిలిపోయిందన్న భావన కలిగింది. కొందరికి ముక్కు నుంచి రక్తం కారింది. కొందరికి రక్త వాంతులు అయ్యాయి. కింద పడిపోయాం. కనీసం కదలలేని పరిస్థితి. ఆయుధాన్ని ప్రయోగించిన తర్వాత కనీసం లేవలేకపోయాం. అలాంటి దానిని ఎన్నడూ చూడలేదు’ అని వివరించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -