2-0 విజయంపై గిల్‌సేన గురి
భారత్, వెస్టిండీస్ రెండో టెస్టు నేటి నుంచి
ఉదయం 9.30 నుంచి స్టార్‌స్పోర్ట్స్‌లో..
బ్యాటర్లు పరుగుల వేటలో కదం తొక్కుతున్నారు. బౌలర్లు వికెట్ల జాతర సాగిస్తున్నారు. బ్యాట్‌తో, బంతితో ఆటగాళ్లు భీకర ఫామ్‌లో దూసుకెళ్తండగా వెస్టిండీస్‌పై టెస్టు సిరీస్‌ను 2-0తో క్లీన్‌స్వీప్ చేయాలని టీమ్ ఇండియా ఎదురుచూస్తోంది. తొలి టెస్టును రెండున్నర రోజుల్లోనే ముగించిన శుభ్‌మన్ గిల్ సేన.. ఫిరోజ్ షా కోట్లలోనూ అదే ప్రదర్శన పునరావృతం చేయాలని చూస్తోంది. కనీస పోటీ ఇవ్వాలనే తపనతో కరీబియన్లు కనిపిస్తుండగా.. నేటి నుంచి భారత్, వెస్టిండీస్ రెండో టెస్టు ఆరంభం.
నవతెలంగాణ-న్యూఢిల్లీ
స్వదేశంలో టెస్టు సవాల్. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌లో విలువైన పాయింట్లు. ప్రత్యర్థి వెస్టిండీస్. అయితే, ఆతిథ్య భారత్ ఎటువంటి ఒత్తిడి లేకుండా రెండో టెస్టుకు సిద్ధమవుతోంది. అగ్ర జట్టు టీమ్ ఇండియాకు సవాల్ విసరగల సత్తా, సామర్థ్యం ఉన్న నాణ్యమైన క్రికెటర్లు కరీబియన్ శిబిరంలో కరువయ్యారు. ప్రత్యర్థిని మట్టికరిపించటంపై ఫోకస్ పెట్టని భారత్.. రానున్న టెస్టు సిరీస్‌ల్లో బెంచ్ బలాన్ని మెరుగుపర్చేందుకు ఆటగాళ్లకు అవకాశాలు ఇవ్వనుంది. నేటి నుంచి న్యూఢిల్లీలో ఆరంభం కానున్న రెండో టెస్టులో భారత్ కొందరు యువ ఆటగాళ్లను పరీక్షించేందుకు సిద్ధమవుతోంది.
నితీశ్‌కు అవకాశం
పేస్ ఆల్‌రౌండర్, తెలుగు తేజం నితీశ్ కుమార్ రెడ్డి భారత టెస్టు ప్రణాళికల్లో కీలకంగా కొనసాగుతున్నాడు. గత ఆస్ట్రేలియా పర్యటనలో సత్తా చాటిన నితీశ్ కుమార్ రెడ్డి.. ఇంగ్లాండ్ పర్యటనలో గాయంతో అర్థాంతరంగా స్వదేశానికి చేరుకున్నాడు. బ్యాట్‌తో తడఖా చూపించిన నితీశ్ కుమార్.. బంతితో నిరూపించుకోవాల్సి ఉంది. సాధారణంగా పేస్ ఆల్‌రౌండర్లను విదేశీ టెస్టుల్లోనే ప్రయోగిస్తారు. కానీ నితీశ్ కుమార్‌ను స్వదేశీ టెస్టుల్లోనూ రెగ్యులర్ ఆటగాడిగా కొనసాగించేందుకు జట్టు మేనేజ్‌మెంట్ ఆలోచన చేస్తోంది. పేస్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య స్థానాన్ని టెస్టుల్లో భర్తీ చేసిన నితీశ్.. త్వరలోనే వన్డేల్లోనూ అతడి పాత్రను పోషించేందుకు సిద్ధం కావాల్సిన సమయం ఆసన్నమైంది. అందుకు టీమ్ మేనేజ్‌మెంట్ నుంచి స్పష్టమైన సంకేతాలు ఉన్నాయి.
న్యూఢిల్లీ టెస్టులో నితీశ్ బౌలింగ్, బ్యాటింగ్‌పై ఫోకస్ ఎక్కువగా ఉండనుంది. బ్యాటింగ్ లైనప్‌లో బి సాయి సుదర్శన్ మరో అవకాశం దక్కించుకోనున్నాడు. దేవదత్ పడిక్కల్ అవకాశం కోసం ఎదురుచూస్తున్నా.. తుది జట్టు కూర్పులో మార్పులకు గిల్, గంభీర్ సుముఖంగా లేరు. టాప్ ఆర్డర్‌లో బ్యాటింగ్ చేస్తున్న సాయి సుదర్శన్ ఈ టెస్టులో మెరిస్తే.. భవిష్యత్ ప్రణాళికల్లోనూ నిలువనున్నాడు. యశస్వి జైస్వాల్, కెఎల్ రాహుల్, శుభ్‌మన్ గిల్ బ్యాటింగ్ భారం మోయనున్నా.. ధ్రువ్ జురెల్, రవీంద్ర జడేజా గొప్ప ఫామ్‌లో ఉన్నారు. కుల్‌దీప్ యాదవ్, వాషింగ్టన్ సుందర్, రవీంద్ర జడేజా మాయాజాలాన్ని ఎదుర్కొని నిలువటం వెస్టిండీస్‌కు ఇక్కడా కఠిన పరీక్షగానే ఉండనుంది. జశ్‌ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్ పేస్ బాధ్యతలు పంచుకోనున్నారు.
పోటీ ఇవ్వగలరా?
వెస్టిండీస్ టెస్టు క్రికెట్ వైభవం ఎంత వర్ణించినా తక్కువే. కానీ ప్రస్తుతం ఆ జట్టు ప్రదర్శన పసికూన కంటే దారుణంగా తయారైంది. క్రికెటర్ల ప్రాధాన్యతలు మారటం, ఐదు రోజుల ఆటకు అవసరమైన నాణ్యమైన ఆటగాళ్లు లేకపోవటం కరీబియన్ క్రికెట్‌ను వేధిస్తున్నాయి. తొలి టెస్టులో విండీస్ పూర్తిగా తేలిపోయింది. రెండో టెస్టులోనూ ఆ జట్టు నుంచి పెద్దగా ఆశించడానికి ఏమీ లేదు. కానీ యువ ఆటగాళ్లు పోరాట స్ఫూర్తితో కనీస పోటీ ఇచ్చేందుకు పట్టుదలగా కనిపిస్తున్నారు. చందర్‌పాల్, హోప్, కాంప్‌బెల్, బ్రాండన్ కింగ్, రోస్టన్ ఛేజ్‌లు ధనాధన్ ఇన్నింగ్స్‌లు ఆడగలరు. సహనంతో పరుగుల వేట సాగించకపోయినా.. దూకుడుగా ఆడుతూ మంచి స్కోరు సాధించాలనే వ్యూహంతో వెస్టిండీస్ ఉంది.
పిచ్, వాతావరణం
ఫిరోజ్ షా కోట్ల పిచ్ సంప్రదాయ ఉపఖండ పిచ్ తరహాలోనే ఉండనుంది. తొలి రెండు రోజులు బ్యాటర్లకు అనుకూలించనుండగా.. మూడో రోజు నుంచి స్పిన్‌కు మొగ్గు ఉంటుంది. టెస్టు మ్యాచ్ చిరు జల్లుల ఆటంకం, శీతల ఉష్ణోగ్రత నడుమ సాగనుండగా.. పిచ్‌పై పగుళ్లు తేలేందుకు కాస్త ఎక్కువ సమయం పట్టనుంది. టాస్ నెగ్గిన జట్టు తొలుత బ్యాటింగ్ ఎంచుకునే అవకాశం మెండుగా కనిపిస్తోంది.
తుది జట్లు (అంచనా) :
భారత్ : యశస్వి జైస్వాల్, కెఎల్ రాహుల్, సాయి సుదర్శన్, శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, నితీశ్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, కుల్‌దీప్ యాదవ్, జశ్‌ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్.
వెస్టిండీస్ : చందర్‌పాల్, కాంప్‌బెల్, అలిక్, బ్రాండన్ కింగ్, షారు హోప్ (వికెట్ కీపర్), రోస్టన్ ఛేజ్ (కెప్టెన్), జస్టిన్ గ్రీవ్స్, జోమెల్ వారికన్, ఖారీ పియర్, జొహన్ లేనె, జేడెన్ సీల్స్.
12/12
1987 నుంచి న్యూఢిల్లీలో భారత్ ఒక్క టెస్టు మ్యాచ్‌లోనూ ఓటమి చెందలేదు. 1987 తర్వాత ఇక్కడ భారత్ 12 టెస్టుల్లో విజయాలు సాధించగా, మరో 12 టెస్టులను డ్రా చేసుకుంది. చివరగా ఈ స్టేడియంలో వెస్టిండీస్ చేతిలోనే భారత్ పరాజయం చెందింది.
10
టెస్టుల్లో 4 వేల పరుగుల మైలురాయికి రవీంద్ర జడేజా 10 పరుగుల దూరంలో నిలిచాడు. ఇయాన్ బోథమ్, కపిల్ దేవ్, డానియల్ వెటోరీ మాత్రమే టెస్టుల్లో 4000 పరుగులు, 300 వికెట్లు సాధించిన క్లబ్‌లో ఉన్నారు.