Wednesday, December 31, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంజర్నలిస్టులకు న్యాయం జరిగేలా 252 జీవోను సవరిస్తాం

జర్నలిస్టులకు న్యాయం జరిగేలా 252 జీవోను సవరిస్తాం

- Advertisement -

– అక్రిడిటేషన్‌, మీడియా కార్డులకు ఎలాంటి తేడా లేదు
– త్వరలోనే జర్నలిస్టు సంఘాలతో సమావేశం : టీడబ్ల్యూజేఎఫ్‌, డీజేఎఫ్‌టీ నేతలతో మంత్రి పొంగులేటి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

అక్రిడిటేషన్‌ కార్డులకు, మీడియా కార్డులకు ఎలాంటి తేడా లేదని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్‌, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. ప్రభుత్వ పరంగా అక్రిడిటేషన్‌ కార్డుదారులకు వర్తించే ప్రతి ప్రయోజనం మీడియా కార్డు దారులకు కూడా వర్తిస్తుందని వివరించారు. ఈ విషయంలో డెస్క్‌ జర్నలిస్టులు ఎలాంటి అపోహలకు గురికావొద్దని సూచించారు. జర్నలిస్టులకు న్యాయం జరిగేలా 252 జీవోను సవరిస్తామని లిఖితపూర్వకంగా మంత్రి హామీ ఇచ్చారు. త్వరలోనే జర్నలిస్టు సంఘాలతో సమావేశం నిర్వహించి, సవరణ జీవోను విడుదల చేస్తామని వెల్లడించారు. మంగళవారం హైదరాబాద్‌లోని సచివాలయంలో టీడబ్ల్యూజేఎఫ్‌, డీజేఎఫ్‌టీ ప్రతినిధులు మంత్రి పొంగులేటిని కలిసి వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా మంత్రికి వివిధ అంశాలను వివరించారు. ఇటీవల విడుదల చేసిన 252 జీవో ద్వారా జర్నలిస్టులు అక్రిడిటేషన్‌ కార్డులు, డెస్క్‌ జర్నలిస్టులకు మీడియా కార్డులు ఇస్తామనే ప్రకటన వారిలో విభజన తెచ్చేలా ఉందని చెప్పారు. ప్రస్తుతమున్న పరిస్థితుల్లో డెస్క్‌ జర్నలిస్టులు కూడా ఫీల్డ్‌ వర్క్‌ చేయాల్సి వస్తోందని వివరించారు. ఈ జీవోతో జర్నలిస్టులకూ భారీగా అక్రిడిటేషన్లు తగ్గే అవకాశం ఉందనీ, మహిళా కోటాను పునరుద్దరించాలని మంత్రి దృష్టికి తెచ్చారు. దీనిపై స్పందించిన మంత్రి పొంగులేటి జీవోపై కొంతమంది అపోహలకు గురిచేసేలా ప్రయత్నం చేస్తున్నారనీ, వాటిని నమ్మొద్దని స్పష్టం చేశారు. డెస్క్‌ జర్నలిస్టులు ఎవ్వరూ ఆందోళన చెందొద్దనీ, తాను అండగా ఉంటానని చెప్పారు. ఇది జర్నలిస్టులను రెండు భాగాలుగా చూడాలన్న ఆలోచన కాదనీ, ప్రభుత్వ పరంగా అందరికీ సంక్షేమ పథకాలను వర్తింపజేస్తామని వెల్లడించారు. అర్హులైన, నిజమైన జర్నలిస్టులకు మేలు చేయాలన్న సంకల్పంతో తీసుకున్న నిర్ణయమన్నారు. రాష్ట్రంలో మినహా దేశంలో ఇంత పెద్దమొత్తంలో అక్రిడిటేషన్‌ కార్డులు ఇస్తున్న రాష్ట్రం మరొకటి లేదని వివరించారు. అసెంబ్లీ సమావేశాలు ముగిసిన వెంటనే జర్నలిస్టుల సంఘాలతో సమావేశం నిర్వహిస్తామనీ, డెస్క్‌ జర్నలిస్టులనూ ఆహ్వానిస్తామని అన్నారు. అందరి అభిప్రాయాలు, సలహాలు సూచనలు తీసుకుని జర్నలిస్టులకు మరింత ప్రయోజనం చేకూరే విధంగా 252 జీవోలో మార్పులు, చేర్పులు చేస్తామని స్పష్టం చేశారు. మంత్రిని కలిసిన వారిలో టీడబ్ల్యూజేఎఫ్‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బి రాజశేఖర్‌, రాష్ట్ర కార్యదర్శి గండ్ర నవీన్‌, డీజేఎఫ్‌టీ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఉపేందర్‌, ఎస్‌కే మస్తాన్‌, ట్రెజరర్‌ నిస్సార్‌, ఉపాధ్యక్షుడు రాజారామ్‌, జాయింట్‌ సెక్రెటరీ విజయ, స్పోర్ట్స్‌ జర్నలిస్టు అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు కృష్ణ, శ్రీనివాస్‌, జర్నలిస్టుల ప్రతినిధులు శేఖర్‌, సురేష్‌, వెంకటరమణ, రమేష్‌, నరేష్‌ తదితరులు పాల్గొన్నారు.
252 జీవోను సవరించాలి : టీయూడబ్ల్యూజే
జర్నలిస్టుల అక్రిడిటేషన్‌ కార్డుల విషయంలో, కొత్త మార్గదర్శకాలతో ఇటీవల ప్రభుత్వం జారీ చేసిన 252 జీవోలో కొన్ని సవరణలు చేపట్టాల్సిన అవసరముందని తెలంగాణ రాష్ట్ర వర్కింగ్‌ జర్నలిస్టుల సంఘం (టీయూడబ్ల్యూజే) ప్రభుత్వాన్ని కోరింది. ఈ మేరకు మంగళవారం సచివాలయంలో టీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షులు కె విరాహత్‌ అలీ నేతృత్వంలో యూనియన్‌ ప్రతినిధి బృందం మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డిని కలిసి జీవోపై చర్చించడంతోపాటు వినతి పత్రాన్ని అందించింది. ఈ సందర్భంగా విరాహత్‌ అలీ మాట్లాడుతూ గతంలో అక్రిడిటేషన్‌ కార్డులతో డెస్క్‌ జర్నలిస్టులందరికీ కాకుండా కొందరికి మాత్రమే న్యాయం జరిగేదని అన్నారు. ప్రస్తుతం బస్‌పాస్‌తో సహా ప్రభుత్వం కల్పించే ప్రతి సంక్షేమ పథకం రిపోర్టర్లు, డెస్క్‌ జర్నలిస్టులనే తేడా లేకుండా, ఎలాంటి వివక్ష లేకుండా జీవోను సవరించాలని కోరారు. కేబుల్‌ టీవీ చానెల్స్‌కు సంబంధించి, జీవోలో పేర్కొన్న అస్పష్టతను సరిచేయాలన్నారు. మంత్రిని కలిసిన ప్రతినిధి బృందంలో టీయూడబ్ల్యూజే రాష్ట్ర ఉప ప్రధాన కార్యదర్శి కల్కూరి రాములు, రాష్ట్ర కార్యదర్శులు కె శ్రీకాంత్‌ రెడ్డి, వి యాదగిరి, రాష్ట్ర కోశాధికారి ఎం వెంకట్‌రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఏ రాజేష్‌, ఎండీ గౌస్‌, హెచ్‌యూజే అధ్యక్షుడు శంకర్‌ గౌడ్‌, రాష్ట్ర చిన్న, మద్య తరగతి పత్రికల సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు యూసుఫ్‌ బాబు, అశోక్‌ తదితరులు ఉన్నారు. 252 జీవోపై టీయూడబ్యూజే సూచనలను పరిశీలిస్తామని రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ కమిషనర్‌ ప్రియాంక హామీ ఇచ్చారు. అసెంబ్లీ సమావేశాల తర్వాత సమావేశాన్ని నిర్వహించి జర్నలిస్టు సంఘాల అభిప్రాయాలు స్వీకరిస్తామన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -