Monday, October 13, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంపార్టీ కోసం పని చేసే వారిని నియమిస్తాం

పార్టీ కోసం పని చేసే వారిని నియమిస్తాం

- Advertisement -

డీసీసీ అధ్యక్షుల ఎంపిక కోసం ఏఐసీసీకి నివేదిక
బీసీ రిజర్వేషన్లకు ప్రభుత్వం కట్టుబడి ఉంది : పాండిచ్చేరి మాజీ ముఖ్యమంత్రి వేలు నారాయణస్వామి

నవతెలంగాణ-మహబూబ్‌నగర్‌ ప్రాంతీయ ప్రతినిధి
కాంగ్రెస్‌ పార్టీ అభివృద్ధి కోసం పాటుపడే వారిని.. అందరి ఆమోదంతో డీసీసీ అధ్యక్షులుగా ఎన్నుకుంటామని పాండిచ్చేరి మాజీ ముఖ్యమంత్రి, డీసీసీ ఎన్నికల అబ్జర్వర్‌ వేలు నారాయణస్వామి చెప్పారు. నాగర్‌కర్నూల్‌ జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్‌రెడ్డి నివాసంలో ఆదివారం డీసీసీ అధ్యక్షులు, అచ్చంపేట ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నాగర్‌కర్నూల్‌, వనపర్తి, గద్వాల జిల్లాల డీసీసీ అధ్యక్షుల ఎన్నికల కోసం ఏఐసీసీ తనను అబ్జర్వర్‌గా పంపినట్టు చెప్పారు. ఈ మూడు జిల్లాలకు సంబంధించి ఆశావాహుల ద్వారా దరఖాస్తులను స్వీకరిస్తామన్నారు. పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, యువజన కాంగ్రెస్‌, మహిళా కాంగ్రెస్‌, సేవాదళ్‌ సభ్యుల అభిప్రాయాలను కూడా పరిగణలోకి తీసుకుంటామని తెలిపారు. తమకు వచ్చిన దరఖాస్తులను పరిశీలించి వారితో సమావేశం అవుతామన్నారు. పార్టీ కోసం వారు చేసిన కృషి, ఇతర అంశాలను పరిగణలోకి తీసుకొని నివేదికను ఏఐసీసీకి ఈనెల 22వ తేదీ వరకు పంపిస్తామని తెలిపారు.

మూడ్రోజులపాటు ఇక్కడే ఉండి నాగర్‌కర్నూల్‌, వనపర్తి, గద్వాల జిల్లాలలో డీసీసీ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను నిర్వహిస్తామన్నారు. తెలంగాణలో బీసీ రిజర్వేషన్ల అంశంపై పాత్రికేయులు అడిగిన ప్రశ్నకు నారాయణస్వామి సమాధానం ఇస్తూ.. 42శాతం రిజర్వేషన్ల అమలుకు రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్‌ పార్టీ కృతనిశ్చయంతో ఉన్నాయన్నారు. తమిళనాడు, కర్నాటక రాష్ట్రాల మాదిరిగా ఇక్కడా అమలు పరచాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతున్నామన్నారు. డీసీసీ అధ్యక్షుల ఎంపికపై ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే, పార్టీ అధినేతలు రాహుల్‌ గాంధీ, సోనియా గాంధీ సూచనల మేరకు ప్రకటిస్తారని చెప్పారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే డాక్టర్‌ కూచుకుళ్ల రాజేష్‌ రెడ్డి, ఎమ్మెల్సీ అహ్మద్‌ అలీఖాన్‌, అబ్జర్వర్లు బొజ్జ సంధ్యారెడ్డి, సాంబుల శ్రీకాంత్‌గౌడ్‌, శ్రీనివాస్‌, కోటేష్‌, గ్రంథాలయ చైర్మెన్‌ రాజేందర్‌ తదితరులున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -